వరదల్లో మంత్రి.. హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ

ఉత్తర భారతంలో వానలు దంచి కొడుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వరదలు బీభత్సం స్పష్టిస్తున్నాయి. పెనుగాలులు, భారీ వర్షాలు, వరదలతో మధ్యప్రదేశ్ లోని కొన్ని జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి.కొన్ని రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక చోట్ల గ్రామాలకు గ్రామాలే జలమయమయ్యాయి. దాతియా జిల్లాలో వందలాది గ్రామాలను వరద ముంచెత్తింది. రెండు బ్రిడ్జీలు వరదల ధాటికి పూర్తిగా కూలిపోవడంతో చాలా గ్రామాలకు.. ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. 

దాతియా జిల్లాకే చెందిన హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లి ఇబ్బందుల్లో పడ్డారు. వరద నీటిలోనే మంత్రి చిక్కుకుపోయారు.వరద బాధితులను రక్షించేందుకు హోంశాఖ మంత్రి బోటులో వెళ్తుండగా..  దగ్గరలోని ఓ చెట్టు ఆ బోటుపై పడడంతో అది ఆగిపోయింది. అప్పటికే ఓ ఇంటి చుట్టూ నీరు చేరడంతో ఆ ఇంటివారంతా ఇంటి రూఫ్ పైకి ఎక్కి సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. అతి కష్టం మీద నరోత్తం మిశ్రా కూడా ఆ ఇంటిని చేరారు. అయితే చుట్టూ నీరు ప్రవహిస్తుండడంతో ఆయన కూడా వారితో బాటు ఆ ఇంటిపైనే చిక్కుకుపోయారు. ఎటూ వెళ్లే దారి లేక ఆయన అధికారులకు ఫోన్ లో సమాచారమిచ్చారు. దీంతో మంత్రిని రెస్క్టూ చేసేందుకు అధికారులు ఆర్మీ సాయం కోరారు.

వైమానిక దళాన్ని సంప్రదించి ఆ ప్రాంతానికి హెలికాఫ్టర్ పంపారు జిల్లా అధికారులు. అందులోని సిబ్బంది హెలికాఫ్టర్ నుంచి తాడును కిందికి వదలడంతో దాన్ని పట్టుకుని మంత్రి పైకి చేరగలిగారు. ఇతర సహాయక సిబ్బందిని, బాధితులను కూడా ఇలాగే సిబ్బంది రక్షించారు. తన నియోజకవర్గంలో ముంపు గ్రామాలను విజిట్ చేసి మిశ్రా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని.. అనేకమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హోంమంత్రి నరోత్తం మిశ్రా చర్యను కాంగ్రెస్ పార్టీ ఓ స్టంట్ గా అభివర్ణించింది. ఏదో చేయాలనుకుంటే.. ఏదో జరిగిందంటూ సెటైర్లు వేశారు.