ప్రకాశం జిల్లా వైసీపీలో ఫైటింగ్! త్వరలో ఎంపీ మాగుంట జంప్?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమంటోంది. కొంత కాలంగా అంతర్గతంగా సాగుతున్న విభేదాలు.. ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. జగన్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో.. ఇదే అదనుగా పార్టీ నుంచి బయటికి వచ్చేందుకు కొందరు నేతలు చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు దూకుడుతో కష్టాలు పడుతున్న వైసీపీకి. త్వరలో మరో ఎంపీ షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. జగన్ రెడ్డికి గుడ్ బై చెప్పి... ఆ ఎంపీ టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని  సమాచారం. ఇప్పటికే సదరు ఎంపీ టీడీపీ ముఖ్య నేతలతో మంత్రాంగం నడుపుతున్నారని చెబుతున్నారు. 

ప్రకాశం జిల్లా వైసీపీ నేతల మధ్య చాలా కాలంగా విభేదాలున్నాయి. తాజాగా అవి తీవ్ర రూపం దాల్చినట్లు తెలుస్తోంది. ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మంత్రి బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందట. తాజాగా వెలుగులోనికి వచ్చిన అక్రమ మైనింగ్ విషయంలోనూ ఎంపీ మాగుంటను సొంత పార్టీ నేతలే ఇరికించే ప్రయత్నాలు చేశారని చర్చ జరుగుతోంది. సర్వేపల్లి రిజర్వాయర్‌లో మట్టి తవ్వకాలకు సంబంధించి వివాదం జరుగుతోంది. దీనిపై స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. అయితే అందులో ఏ2గా ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి పేరు పెట్టారు. ఇదే ఇప్పుడు రచ్చగా మారింది. ఎంపీ మాగుంట పేరును ఎఫ్ఐఅర్ లో చేర్చడాన్ని టీడీపీ తప్పుపడుతోంది. మాగుంటకు మద్దతుగా నిలిచారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అంతేకాదు వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కుట్ర పూరితంగా ఎంపీ మాగుంటను ఇరికించారని ఆరోపించారు.  

సర్వేపల్లి ఎమ్మెల్యే అనుచరులతో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకాలు ఫోర్జరీ చేయించి సర్వేపల్లి రిజర్వాయర్‌లో మట్టి తవ్వకాలకు తెరలేపారని సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీపీఎస్ విధానం అమర్చి వాహనాల గురించిన సమాచారం తీసుకొని మరీ స్థానికులే స్వయంగా ఫిర్యాదు చేశారన్నారు సోమిరెడ్డి. పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్‌లో ఏ2గా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు చేర్చారన్నారు.

సాధారణ గ్రావెల్ తవ్వకాలకు ఎంపీ స్థాయి వ్యక్తి ఎలా దరఖాస్తు చేసుకుంటాడని అధికారులు ఆలోచించరా అని చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎంపీ మాగుంట  సంతకాన్ని గోవర్థన్ రెడ్డి అనుచరుడే ఫోర్జరీ చేశారని ఆరోపించారు. ఒకే సంతకంతో మూడు దరఖాస్తులు వచ్చినప్పుడు ఇరిగేషన్ అధికారులు ఎందుకు పరిశీలించ లేదని ప్రశ్నించారు. వైసీపీ సాగిస్తున్న అక్రమ మైనింగ్ కోసం ఎంపీని బలిచేస్తారా అని ప్రశ్నించారు. ఎంపీ మాగుంటపై ఎమ్మెల్యే కాకాణి కక్ష తీర్చుకున్నారని.. కాకాణి దోపిడీపై, అరాచకాలపై తాము ముఖ్యమంత్రికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఇష్టానుసారం గ్రావెల్ దోపిడీచేస్తూ, ఏమాత్రం సంబంధంలేని సొంతపార్టీ ఎంపీనే ఇరికించడం దేనికి సంకేతమన్నారు. ఎంపీసంతకం ఫోర్జరీ చేసిన కాకాణి అనుచరుడిపై క్రిమినల్ కేసులు నమోదుచేసి, అరెస్ట్ చేయాలన్నారు. తప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. వైసీపీ ఎంపీ మాగుంటకు మద్దతుగా టీడీపీ నేత ఇలా ఓపెన్ ప్రకటన చేయడం చర్చగా మారింది. 

ఇదిలా ఉండగానే పార్లమెంటు వర్షాకాలు సమావేశాల సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి  ఓ పార్టీ ఏర్పాటు చేశారు. మాగుంట నివాసంలో జరిగిన పార్టీకి అనూహ్యంగా టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. నిజానికి ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య వార్ ఓ రేంజ్ లో ఉంటుంది.  పార్లమెంట్ లోనూ ఇరు పార్టీల ఎంపీలు చాలా గ్యాప్ మెయింటేన్ చేస్తుంటారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు పార్టీలకతీతంగా ఢిల్లీలో ఉంటారు. కాని ఏపీ లీడర్లు మాత్రం కలవడానికి ఇష్టపడరు. ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలతో కనీసం టీడీపీ ఎంపీలు ఉన్న లాబీల్లోకి కూడా వైసీపీ ఎంపీలు వెళ్లడం లేదు.అలాంటిది వైసీపీ ఎంపీ మాగుంట ఇచ్చిన పార్టీకి టీడీపీ ఎంపీలు రావడం చర్చనీయాంశంగా మారింది. మాగుంట ఇంట్లో జరిగిన పార్టీకి వచ్చిన వైసీపీ ఎంపీలు.. అక్కడ టీడీపీ ఎంపీలను చూసి షాకయ్యారట. సొంత పార్టీ ఎంపీలకు.. మాగుంట కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే.. ప్రతిపక్ష పార్టీ ఎంపీలను ఆహ్వానించడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాగుంట వైఖరిపై కొందరు వైసీపీ ఎంపీలు ఆగ్రహంగా ఉన్నారని కూడా తెలుస్తోంది. మాగుంట పార్టీలో టీడీపీ ఎంపీలు హాజరైన విషయం బయటకు పొక్కటంతో వైసీపీ పెద్దలు నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారట. 

గతంలో కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్నారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి ఎంపీగా  గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల సమయంలో ఆయన టీడీపీలో చేరారు.  టీడీపీ అభ్యర్థిగా ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. తర్వాత మాగుంటను ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు చంద్రబాబు. 2019 ఎన్నికల సమయంలో  టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు మాగుంట. జగన్ సునామీలో మాగుంట విజయం సాధించారు. అయితే జిల్లా వైసీపీ నేతలతో మొదటి నుంచి ఆయనకు పొసగడం లేదనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో మాగుంటకు విభేదాలు ఉన్నాయి. జిల్లాకు సంబంధించిన విషయాల్లోనూ మంత్రి మాగుంటను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డితోనూ మాగుంటకు పడటం లేదు. ఇటీవల ఆనందయ్య కరోనా మందు విషయంలోనూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి.. మాగుంటకు మధ్య  వివాదం రేగింది. మాగుంట సపరేట్గా ఆనందయ్య మందును సేకరించి.. ప్రత్యేక శిబిరాలు వేసి ప్రజలకు పంచారు. ఈ కార్యక్రమానికి మంత్రిని ఆహ్వానించలేదు.జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్తోనూ ఇతర నేతలతోనూ మాగుంటకు పడడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈక్రమంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. 

ఈ నేపథ్యంలో తాను ఏర్పాటు చేసిన విందుకు మాగుంట,, టీడీపీ ఎంపీలను ఆహ్వానించడం.. వైసీపీ ఎంపీలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అదే సమయంలో మట్టితవ్వకాల విషయంలో ఎంపీ మాగుంట పేరు కేసులో చేర్చడం, దీనికి వ్యతిరేకంగా టీడీపీ మాట్లాడటం ఆసక్తిగా మారింది. తాజా పరిణామాలతో మాగుంట వైఖరిలో మార్పు వచ్చిందా? దీని వెనుక ఏమైనా రాజకీయ కోణం ఉందా? అనే చర్చ  మొదైలంది. త్వరలోనే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి.. టీడీపీ గూటికి చేరడం ఖాయమనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది.