ఈనెల 18న టీఆర్ఎస్ లోకి మోత్కుపల్లి నర్సింహులు..

గత రెండు, మూడు నెలలుగా జరుగుతున్న ప్రచారం నిజం కాబోతోంది. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అధికార టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. మోత్కుపల్లి నర్సింహులు కారెక్కడానికి ముహుర్తం ఖరారైంది. ఈనెల 18 సోమవారం  మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షం లో గులాబీ కండువా కప్పుకోనున్నారు మోత్కుపల్లి నర్సింహులు.

పార్టీలో చేరిన వెంటనే మోత్కుపల్లిని దళిత బంధు చైర్మన్‌గా ప్రకటిస్తారని తెలుస్తోంది. జులై 23న బీజేపికి రాజీనామా చేసిన మోత్కుపల్లి నర్సింహులు.. అప్పటి నుంచి బీజేపీ వైఖరిపై, హుజూరాబాద్ బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అదే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంను సమర్థిస్తూ ఆ పార్టీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. సీఎం కేసీఆర్ కు మద్దతుగా బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. అప్పటి నుంచే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయం అనే టాక్ వినిపించింది.

మాదిగ సామాజిక వర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ నుంచి మొదలైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నర్సింహులు. టీడీపీతో పాటు కాంగ్రెస్ , ఇండిపెండెంట్ గా కూడా ఆయన విజయం సాధించారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచే మోత్కుపల్లి, కేసీఆర్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. మోత్కుపల్లి నిజాయితీ గల వ్యక్తని, ఆయనకు దళిత బంధు చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తే.. ప్రభుత్వ ప్రతిష్ఠ ఇనుమడిస్తుందని కేసీఆర్ నమ్మకం. ఇటీవల జరిగిన దళిత బంధు సమీక్ష సమావేశంలోనూ మోత్కుపల్లికి కేసీఆర్.. అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తన పక్కనే కూర్చోబెట్టుకోవడం ద్వారా.. దళిత బంధుకు కాబోయే చైర్మన్ ఆయనేనన్న సంకేతాలిచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు.

గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి.. 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడారు. మధ్యలో ఓ సారి కాంగ్రెస్ లోకి వెళ్లినప్పటికీ.. అక్కడ ఇమడలేక.. మళ్లీ టీడీపీ గూటికే చేరారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో బీజేపీలోకి వెళ్లిన ఆయన.. ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సీఎంను ఏకంగా అంబేడ్కర్ కంటే గొప్పవాడిగా కీర్తించారు.