Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పైలట్ రోహిత్ రెడ్డి నిండా మునిగినట్లేనా?
posted on: Mar 18, 2026 11:03AM
.webp)
తెలంగాణ రాజకీయాలలో పెను సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం అయ్యింది. అన్నిటికీ మించి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిండామునిగినట్లేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో డ్రగ్స్, కాల్పుల కేసులో మంగళవారం (మార్చి 17) కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు పైలట్ రోహిత్ రెడ్డి, సహా నిందితులను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. మరో వైపు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఇక ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిందితుల మధ్య ఉన్న సంబంధాలు, డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయి అనే కోణంలో ఆరా తీసింది. సిట్ చీఫ్ సుధీర్ బాబు స్వయంగా విచారణ పురోగతిని సమీక్షించారు. విచారణకు హాజరైన వారిలో అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి వంటి ప్రముఖులు ఉన్నారు. వీరందరి మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తాను ఏప్రిల్ 4 తర్వాతే విచారణకు హాజరవుతానని ఆయన పోలీసులకు సమాచారం అందించగా సిట్ అంగీకరించింది. కాగా మంగళవారం (మార్చి 17) విచారణలో భాగంగా రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు, గతంలో ఎప్పుడైనా ఇలాంటి పార్టీలు జరిగాయా అనే అంశాలపై పోలీసులు విచారించారు.
అదలా ఉంటే.. రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి సంబంధించిన గన్ లైసెన్స్‌ను రద్దు చేయాలని పోలీసులు నిర్ణయించారు. పార్టీ జరిగిన సమయంలో ఆయుధాన్ని టేబుల్‌పై పెట్టి ప్రదర్శించడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో ఈ నిర్ణయానికి వచ్చారు. ఇక ఢిల్లీకి చెందిన నిందితుడు నమిత్ శర్మ తనకు అమిత్ షా తెలుసని, తాను మాజీ ఎమ్మెల్యేనని చెప్పిన మాటలన్నీ బుకాయింపులేనని పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించడంపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను ఏడు రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నిటినీ బట్టి చూస్తుంటే పైలట్ రోహిత్ రెడ్డి ఈ కేసులో నిండా మునిగినట్లేనన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. ఇక ఈ కేసుకు సబంధించి రానున్న మరిన్ని అరెస్టులు జరగడంతో పాటు మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.






