Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డ్రగ్స్ కేసులో తవ్వేకొద్దీ విస్తుపోయే నిజాలు!
posted on: Mar 17, 2026 4:29PM

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్ ఫామ్‌హౌస్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ పార్టీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఈ ఫామ్‌హౌస్‌పై పోలీసులు జరిపిన మెరుపు దాడిలో డ్రగ్స్ వినియోగం నిర్ధారణ కావడంతో రాజకీయ, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ సహా పలువురు ప్రముఖుల పేర్లు బయటకు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.
పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో నిందితుల మత్తు చరిత్రకు సంబంధించి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఎంపీ పుట్టా మహేష్, నమిత్ శర్మల నుంచి సేకరించిన నమూనాల పరీక్షల్లో కొకైన్‌తో పాటు యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్ వంటి ప్రమాదకర రసాయనాల అవశేషాలు లభించినట్లు సమాచారం. వీరికి గత కొంతకాలంగా డ్రగ్స్ అలవాటు ఉందన్న అనుమానాలను దర్యాప్తు సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. బెంగళూరుకు చెందిన కౌశిక్ రవి అనే వ్యక్తి ఈ పార్టీ కోసం సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చినట్లు విచారణలో అంగీకరించాడు.
ఈ దాడి సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులు సోదాలకు వస్తున్న క్రమంలో నమిత్ శర్మ అనే వ్యక్తి గన్ ఫైరింగ్ చేసినట్లు తెలుస్తోంది. రోహిత్ రెడ్డి ప్రోద్బలంతోనే పోలీసులపైకి కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వస్తుండటంతో, వారిపై హత్యాయత్నం సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మరోవైపు, తనపై వస్తున్న ఆరోపణలను ఎంపీ పుట్టా మహేష్ ఖండించారు. తాను కేవలం స్నేహితుడు పిలిస్తే డిన్నర్‌కి వెళ్లానని, తనకు ఎలాంటి దురలవాట్లు లేవని ఆయన స్పష్టం చేశారు. అయితే పోలీసులు మాత్రం ఈ పార్టీ వెనుక బలమైన ‘మత్తు బంధం’ ఉందని, రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్ల నేపథ్యంలో వీరంతా తరచూ కలుస్తుంటారని అనుమానిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డ్రగ్స్ మూలాలను వెలికి తీసేందుకు చేవెళ్ల డీసీపీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి దుబాయ్ లింకులు ఏమైనా ఉన్నాయా? ఇంకా ఎంతమంది ప్రముఖులకు ఇందులో భాగస్వామ్యం ఉందనే కోణంలో సిట్ ఆరా తీస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.






