కుమారులతో సహా కోర్టుకు హాజరైన మోహన్ బాబు

సినీ నటుడు, శ్రీవిద్యా నికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు, ఆయన కుమారులు మా అధ్యక్షుడు మంచు విష్ణు,  నటుడు మంచు మనోజ్ కుమార్ మంగళవారం తిరుపతి కోర్టులో హాజరయ్యారు. టీడీపీ ప్రభుత్వం తమ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22న తిరుపతి- మదనపల్లె జాతీయ రహదారిపై బైఠాయించి, విద్యార్థులతో కలిసి మంచు కుటుంబం ధర్నా చేసింది.

అప్పటికే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మనోజ్ కుమార్, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఏఓ తులసినాయుడు, పీఆర్వో సతీష్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు ఇబ్బంది కలిగించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ధర్నాకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదని, 341, 171(ఎఫ్), పోలీస్ యాక్ట్ 290 కింద వీరిపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి నేడు తిరుపతి నాలుగవ అదనపు కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ తమ అభిమానులతో కలిసి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కోర్టు ప్రాంగణం వరకు పాదయాత్రగా వెళ్లారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలి రావడంతో కోర్టు ప్రాంగణం కిక్కిరిసింది. కాగా.. సెప్టెంబరు 20వ తేదీకి కేసును కోర్టు వాయిదా వేసింది. అదలా ఉంచితే.. ఏ ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం మోహన్ బాబు ధర్నా చేశారో ఆ రీయింబర్స్ మెంట్ ఇంత వరకూ రాలేదు. అప్పట్లో ఫీజురీయింబర్స్ మెంట్ ఇవ్వడంలో చంద్రబాబు సర్కార్ అన్యాయం చేసిందని ఆరోపిస్తూ మోహన్ బాబు వైసీపీ గూటికి చేరారు.

అయితే ఏ ఫీజురీయింబర్స్ మెంట్ కోసమైతే మోహన్ బాబు ధర్నా చేశారో, ఆ పీజు రీయింబర్స్ మెంట్ జగన్ మూడేళ్ల హయాంలో ఇప్పటి వరకూ కూడా రాలేదు.  మోహన్ బాబులాగే విద్యా సంస్థలు నడుపుతున్న అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.  అప్పటి రీఎంబర్స్‌మెంట్ ఇప్పటికీ రాలేదన్నారు. మోహన్ బాబు కూడా కొన్ని సందర్భాల్లో ఫీజు రీయింబర్స్ మెంట్ రాలేదని అంగీకరించారు కానీ.. జగన్ ప్రభుత్వంపై మాత్రం ఎలాంటి విమర్శలు చేయడం లేదు.