రాష్ట్రానికి మోడీ ఢిల్లీ కి కేసీఆర్ మతలబు ఏమిటో ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘రాజకీయం’ ఎవరికి ఒక పట్టాన అర్థం కాదు. ఆయన ఎప్పుడు ఏ అడుగు ఎందుకు వేస్తున్నారో, అయన సన్నిహితులకే కాదు, కొన్ని కొన్ని సందర్భాలలో ఆయనకు కూడా అర్థం కాదు. అందుకే అనేక సందర్భాలలో అయన నాలుక కరుచుకోవడం జరుగుతుందని అంటారు. అయితే, ఒకటి మాత్రం నిజం, ఆయన ఇంచుమించుగా ఓ పక్షం రోజులకు పైగా, ఫార్మ్ హౌస్’కే పరిమితం అయినా, ఇప్పుడు మరో పక్షం రోజులు ‘జాతీయ’ పర్యటనకు బయలుదేరి వెళుతున్నా అందుకు జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగానే భావించవలసి ఉంటుందని, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

సరే, జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు. చేస్తున్న ప్రయత్నాలు  ఎంతవరకు ఫలిస్థాయి, కేసీఆర్ జాతీయ స్వప్నం ఏమవుతుంది అనేది పక్కన పెడితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ఇంకో ముఖ్య కారణం కూడా ఉందని తెరాస వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 26 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)ఎస్‌బీ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్నారు. ఇప్పటికే, ప్రధాని రాష్ట్ర పర్యటన విషయంలో ముఖ్యమంత్రి ప్రోటోకాల్ పాటించక పోవడం ఒకసారి వివాదమైంది. గత ఫిబ్రవరిలో సమతా మూర్తి, రామానుజ ఆచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమమంతో పాటుగా, ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలాలో పాల్గొనేందుకు ప్రదాని హైదరాబాద్ వచ్చారు. అయితే, ఆ రెండు కార్యక్రమాలలో అధికార హోదాలో పాల్గొనవలసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనలేదు. కనీసం,  విమానాశ్రయంలో ప్రధాన మంత్రిని రిసీవ్ చేసుకునేందుకు కూడా వెళ్ళలేదు. ఒక విధంగా, ప్రధాని పర్యటనను ముఖ్యమంత్రి బహిష్కరించారా అన్న సందేహం వచ్చే విధంగా వ్యవహరించారు. నిజంగానే అది రాజకీయంగానూ, అధికరికంగానూ కూడా వివాదం అయింది. 

దీనిపై రాష్ట్రంలోనే కాకుండా జాతీయా మీడియాలోనూ చర్చ జరిగింది. జాతీయ రాజకీయాలపై మనసు పారేసుకున్న ముఖ్యమంత్రికి ఆ విధంగా కొంత మైలేజి వచ్చిందని, అప్పట్లో తెరాస నాయకులు చెప్పుకున్నారు. అయితే, ప్రధానిని రిసీవ్ చేసుకునేందుకు ఎందుకు వెళ్ళలేదు అంటే, ముఖ్యమంత్రికి, జ్వరమని, ఆహ్వానం అందలేదని విభిన్న కథనాలు వినిపించినా, చివరకు కేంద్రపై యుద్ధం ప్రకటించిన నేపధ్యంలో రాజకీయ కారణాల కారణంగానే ప్రధానికి స్వాగతం పలకలేదనే అభిప్రయమే అందరిలో స్థిరపడింది.  

నిజానికి,అప్పటికంటే  ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం మరింతగా పెరిగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీపై దండయాత్రలు చేస్తుంటే, బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణపై రాజకీయ దండయాత్రలు సాగిస్తున్నారు. గత పదిహేను ఇరవై రోజుల్లోనే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత షా, రాష్ట్రంలో రాజకీయ పర్యటనలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండవ విడత పాద  యాత్రలో పాల్గొన్నారు. జాతీయ నేతల పర్యటన సందర్భంగా ఏర్పాటు  చేసిన బహిరంగ సభలు సక్సెస్ అయ్యాయి. ఆ రెండు పర్యటనలు విజయవంతం అవడం తెలంగాణ బీజేపీ నేతల్లో నూతనొత్తేజాన్ని నింపింది.

ఇదిలావుంటే, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను కార్యకర్తలో ఉత్సాహాన్ని నింపే  విధంగా  విజయవంతం చేసేందుకు బీజేపి రాష్ట్ర బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటించే అన్ని మార్గాల్లో ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే పార్టీ శ్రేణులకు సూచించినట్టు తెలుస్తోంది.

అదలా వుంటే, ప్రధాని పర్యటన అధికార పర్యటనే అయినా, నడ్డ్డా, అమిత్ షా పర్యటనల కొనసాగింపుగా జరుగుతున్న మోడీ పర్యటనను  రాజకీయ కోణంలోనూ చూడవలసి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈనేపధ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్’ స్వామి కార్యం స్వకార్యం కలిసి వచ్చేవిధంగా ఉత్తరాది రాష్ట్రాల పర్యటన పెట్టుకున్నారని అంటున్నారు. ముఖ్యంగా ప్రొటోకాల్  వివాదం నుంచి తప్పించుకునిందుకే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ ..అక్కడి నుంచి పంజాబ్ టూర్ వెళుతున్నారని అంటున్నారు. ఏమైనా ప్రధాని, హైదరాబాద్ పర్యటన, ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ రెండూ రాజకీయ యాత్రలు గానే చూడవలసి ఉంటుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.