వెంకయ్యను గిల్లి మోడీ జోల పాట

పిల్లాడిని గిల్లేసి.. ఆనక తీరిగ్గా జోలపాట పాడిందట వెనుకటికి ఓ మహాతల్లి.  తాజా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీరు సరిగ్గా ఇలాగే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశ ప్రథమ పౌరుడిగా ఎన్నికయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ లేదా.. ఉప రాష్ట్రపతిగా రెండోసారి కొనసాగించేందుకు అవకాశం ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వెంకయ్య నాయుడికి ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా పక్కన పెట్టేసిన మోడీ తీరిగ్గా ఆయనకు మూడు పేజీల ఫేర్ వెల్ లేఖ రాసిన తీరును విశ్లేషకులు వేలెత్తి చూపుతున్నారు.

సుదీర్ఘ రాజకీయ జీవితంలో వెంకయ్య నాయుడు దేశానికి చేసిన సేవలను ప్రధాని మోడీ తన ఫేర్ వెల్ లేఖలో కొనియాడడం గమ్మత్తుగా ఉందంటున్నారు. పొగడడం, అంతటితో ఆగకుండా మోడీ భూదానోద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య వినోబా భావేతో వెంకయ్య నాయుడిని పోల్చిన వైనాన్ని పరిశీలకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఏ విషయమైనా సూటిగా, సుస్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వినోబా భావేకు అద్భుతమైన నైపుణ్యం ఉండేదని, అలాంటి లక్షణమే వెంకయ్య నాయుడిలోనూ ఉందని మోడీ పొగడ్తలతో ముంచెత్తారు.

గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఉప రాష్ట్రపతి హోదా వరకు ఎదిగిన వెంకయ్య నాయుడి ప్రయాణం ఎంతో స్ఫూర్తిమంతం అంటూ మోడీ ప్రశంసించారు. అయితే.. అన్ని దశలూ దాటుకుని అంతటి ఘన కీర్తి పొందిన వెంకయ్యపై ఏ మాత్రం గౌరవం లేకుండా బలవంతపు విశ్రాంతికి పంపడం ఏమిటని పలువురు మొడీని సూటిగా ప్రశ్నిస్తున్నారు.  ఏపీలో అసలే ప్రాధాన్యం లేని బీజేపీ, రాజకీయ ఉద్యమంలో చేరడానికి వెంకయ్యను ప్రేరేపించిన నమ్మకం, నిబద్ధత ఎంత శక్తిమంతమైనవో ఊహించుకోవచ్చనేది మోడీ వక్తం చేసిన అభిప్రాయం.

వెంకయ్య నాయుడి శక్తి అనంత ప్రవాహం లాంటిదనీ. దాన్ని వెంకయ్య నాయుడి చతురత, జ్ఞానంలో చూడొచ్చనీ. వెంకయ్య వేసే అంత్య ప్రాసలు బాగా ప్రాచుర్యం పొందాయని మోడీ స్వయంగా ఫేర్ వెల్ లేఖలో ప్రస్తావించారు. వాక్చాతుర్యమే వెంకయ్యకు గొప్ప బలం అన్నారు. వెంకయ్య నాయుడి మాటలు ఎప్పుడు విన్నా.. అత్యంత అనువైన పదాలతో విషయాన్ని స్పష్టంగా చెప్పిన వినోబా భావే తనకు గుర్తుకు వస్తారంటూ కితాబు ఇచ్చారు. వినేవారిని సమ్మెహితులను చేసి, విషయాన్ని సరళంగా అర్థమయ్యేలా చెప్పగలిగే వెంకయ్య నాయుడి సామర్ధ్యం అద్భుతం అని మోడీ కీర్తించారు. అక్కడితో సరిపెట్టని మోడీ ‘వెంకయ్య నాయుడి చతురతకు జీవితకాలం ఆరాధకుడిగా ఉంటాను’ అని ఆ ఫేర్ వెల్ లేఖలో పేర్కొన్నారు. వెంకయ్య వ్యక్తిగత సలహాలతో తాను వ్యక్తిగతంగా ఎంతో లబ్ధి పొందాననీ చెప్పారు. అయినప్పటికీ వెంకయ్య నాయుడికి సరైన ప్రాధాన్యం కల్పించేందుకు మాత్రం మోడీకి చేతులు, నోరు రాలేదేమని తెలుగు ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

దేశ భౌగోళిక రాజకీయ పరిస్థితులపై వెంకయ్య నాయుడి లోతైన ఆలోచనలు, చేసిన విశ్లేషణలను వినేందుకు జర్నలిస్టులు, మేధావులు కూడా ఎంతో ఆసక్తి, ఉత్సుకత చూపించేవారని మోడీ గుర్తుచేశారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పనిచేసిన విధానాన్ని బట్టి ఆయన శక్తి సామర్ధ్యాలను అంచనా వేయొచ్చనీ, రాజ్యసభ చైర్మన్ గా వెంకయ్య నాయుడు రాజ్యసభను నిర్వహించిన తీరు అద్భుతం అన్నారు.

ప్రధాని మోడీ. అధికార, ప్రతిపక్ష సభ్యులతో వెంకయ్య నెరపిన సన్నిహిత సంబంధాలు సభలో సౌహార్ద్ర స్ఫూర్తిని నింపాయంటున్నారు. అలాంటి వెంకయ్య నాయుడికి ఉన్నత పదవిలో నిలబెడితే జాతి మరింత స్ఫూర్తి పొందుతుందని, ముందుకు వెళ్తుందని మీరు ఎందుకు భావించలేదని మోడీని జనం ప్రశ్నిస్తున్నారు. పేదరిక నిర్మూలన, సమస్యల పరిష్కారం పట్ల నిబద్ధత చూపించిన వెంకయ్య నాయుడు ప్రతి విషయాన్నీ ‘నేషన్ ఫస్ట్’ కోణంలో చూసేవారని మోడీ చెప్పుకొచ్చారు. అలా నేషన్ ఫస్ట్ భావనతో ఉండే వెంకయ్య నాయుడు దేశ ప్రథమ పౌరుడిగా పనికిరాలేకపోయారా? మోడీ గారూ అంటూ పలువురు నిలదీస్తున్నారు. వెంకయ్య నాయుడి అనుభవం, జ్ఞానం భవిష్యత్ లో శాసనకర్తలకు వెలలేని ఆస్తులుగా ఉపయోగపడతాయంటున్న మోడీ.. మరి ఆయనను రాష్ట్రపతిని చేయడానికి ఇంకేమి లోపం కనిపించిందో వెల్లడిస్తే బాగుంటుందంటున్నారు.