కేబినెట్ లోకి కవిత ఎంట్రీ ఖాయమేనా? ఆయనకు ఆ పదవి అందుకేనా? 

తెలంగాణ మంత్రివర్గంలోకి కల్వకుంట్ల కవిత ఎంట్రీ ఉంటుందనే చర్చ గత రెండేండ్లుగా సాగుతోంది. గత లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కవితను... ఆ జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో  ఎమ్మెల్సీగా గెలిచారు. కవిత మండలికి ఎన్నికయినప్పటి నుంచే ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. కేబినెట్ లోకి తీసుకోవడం కోసమే ఆమెను ఎమ్మెల్సీ చేశారనే చర్చ జరిగింది. అప్పటి నుంచి ఆ చర్చ అలా కొనసాగుతూనే ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు. ఇటీవల ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత మళ్లీ కేబినెట్ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. దీంతో మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తే కవితకు చోటు ఖాయమా లేదా అన్న చర్చ మొదలైంది.

తాజాగా సీఎం కేసీఆర్ చేపట్టిన ఓ నియామకంతో ఎమ్మెల్సీ కవితను కేబినెట్ లోకి తీసుకోవడం ఖాయమనే చర్చ సాగుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత, రూరల్ ఎమ్మెల్యే  బాజిరెడ్డి గోవర్దన్ ను ఆర్టీసీ ఛైర్మన్ గా నియమించారు కేసీఆర్. మంత్రిపదవిని ఆశిస్తున్న బాజిరెడ్డికి సడెన్ గా ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కడంతో కొత్త సమీకరణలు ఊపందుకున్నాయి. కుమార్తె కవితను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి వీలుగానే బాజిరెడ్డి గోవర్దన్ కు ఆర్టీసీ పగ్గాలు ఇచ్చారని అంటున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి కవితతో పాటు బాజిరెడ్డి మంత్రిపదవి రేసులో ఉన్నారు. ఇప్పుడు బాజిరెడ్డికి కీలక పదవి ఇవ్వడం ద్వారా మంత్రి రేసు నుంచి కేసీఆర్ ఆయన్ను తప్పించారని అంటున్నారు. 

బాజిరెడ్డిని కాదని కవితకు మంత్రి పదవి ఇస్తే పార్టీలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే జరిగితే రానున్న రోజుల్లో కవితకు.. పార్టీకి అంతో ఇంతో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే.. ఆయన మనసు నొప్పించకుండా.. ఆర్టీసీ ఛైర్మన్ కుర్చీలో కూర్చోబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. మంత్రివర్గంలోకి కవితను తీసుకోవటానికి ఉన్న అడ్డంకి తొలగిపోయినట్లుగా భావిస్తున్నారు. అయితే.. కవితను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయం కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందినట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. పదవులన్ని ఫ్యామిలీ ప్యాక్ గా మారాయని.. కల్వకుంట్ల రాజరిక పాలనకు నిదర్శనంగా ఉందని విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి.  విమర్శలు ఎక్కువ అవుతున్నాయి.

కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి.. మంత్రిగా కేటీఆర్.. మేనల్లుడు హరీశ్ మంత్రిగా ఉన్నారు. ఎంపీగా ఓడిపోయినా కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి.. దగ్గర బంధువు సంతోష్ ను రాజ్యసభ సభ్యుడ్ని చేయటాన్ని పలువురు వేలెత్తి చూపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన కవితను ఎమ్మెల్సీగా చేయటానికి కేసీఆర్ ప్రదర్శించిన తాపత్రయం ఆయనపై విమర్శలు వెల్లువెత్తేలా చేసింది. కవితను కేబినెట్ లోకి తీసుకుంటే కుటుంబ పాలన అంశాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అది టీఆర్ఎస్ ఇబ్బంది కల్గిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేబినెట్ లోకి కవితను తీసుకునే సాహసం కేసీఆర్ చేస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.