మగాడివైతే రిజైన్ చెయ్! వైసీపీ నేతపై ఎమ్మెల్యే రోజా చిందులు..

చిత్తూరు జిల్లా వైసీపీ వర్గ పోరు భగ్గుమంటోంది. మండల పరిషత్ చైర్మెన్ ఎన్నికల సందర్భంగా వైసీపీలో అంతర్గత పోరు బహిర్గతమైంది. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైసీపీ రెండుగా చీలిపోయింది. ఎంపీపీ ఎన్నికల సందర్భంగా పోటాపోటీ క్యాంపులతో వైసీపీ రాజకీయం రోడెక్కింది. ఎమ్మెల్యే రోజాను ధిక్కరిస్తూ ఎక్కడికక్కడ స్థానిక నేతలు తిరుగుబాటు చేశారు. 

నిండ్ర మండలం ఎంపీపీ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతంగా మారింది. వైసీపీ ఎంపీటీసీలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఓ వర్గం ఎమ్మెల్యే రోజా బలపరిచిన దీపను ఎంపిపి చేయాలని ప్రయత్నిస్తుండగా... రోజా ప్రత్యర్థి వర్గం అయిన రెడ్డివారి భాస్కర్ రెడ్డి తనకే ఎంపీపీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం జరగాల్సిన ఎంపీపీ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. శనివారం సమావేశంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా భాస్కర్ రెడ్డి తనకు మద్దతుగా ఉన్న ఎంపీటీసీలతో రావడంతో రోజా షాకయ్యారు. 

నిండ్ర మండలంలో వైసీపీకి 8 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యే రోజా వర్గంలో ఉండగా.. మిగితా ఐదుగురు రోజాకు వ్యతిరేకంగా ఉన్న భాస్కర్ రెడ్డికి సపోర్టుగా నిలిచారు. దీంతో అధికారులపై, సొంత పార్టీ ప్రత్యర్థి వర్గం పైన  ఎమ్మెలేయే రోజా చిందులు వేశారు. నిబంధనల ప్రకారం తాము బలపరిచిన అభ్యర్థిని ఎంపీపీగా ప్రకటించాలంటూ అధికారులతో వాదనకు దిగారు రోజా.టిడిపి కార్యకర్తలు అంటూ సొంత పార్టీ కార్యకర్తలతో గొడవ పడ్డారు.మగాడివైతే ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలంటూ భాస్కర్ రెడ్డిని సవాల్ చేశారు ఎమ్మెల్యే రోజా. ఇద్దరి మధ్య వాగ్వాదంతో ఎంపీడీవో కార్యాలయంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.