రోజక్కా.. ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా..?

 

ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు ఉంది ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే రోజా గారి మాటలు వింటుంటే. సాధారణంగా మీడియా ముందుకు వచ్చిందంటే రోజాకి అస్సలు నోరు కుదురుగా ఉండదని తెలుసు. ఇప్పుడు అలాగే శాసనసభ సమావేశాలపై మాట్లాడిన రోజా ఎప్పటిలాగానే అధికార పార్టీపై విమర్శలు గుప్పించింది. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో స్పెషాలిటీ ఏంటంటే.. సభలో ప్రతిపక్షం లేకపోవడమే. దీనికి కారణం వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడమే. జగన్ పాదయాత్రలో భాగంగా... వైసీపీ నేతలు అసెంబ్లీకి రాకూడదని నిర్ణయించుకున్నారు. అయితే దానికి ఫిరాయింపుల పై నిరసన అంటూ పేరు పెట్టారు. ఇక ఎలాగూ ప్రతిపక్షం లేదు కాబట్టి అధికార పార్టీ ఎంచక్కా సమావేశాలు ప్రారంభించి.. ప్రశాంతంగా చర్చలు జరిపింది. ఇక దీనిపై స్పందించిన రోజా..  ప్రతిపక్షం లేకుండా సభను నడపడం పై ఆమె విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లా మారిందని.. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో శిక్షణ శిబిరాల కార్యక్రమాలు జరిగేలా అసెంబ్లీ మారిందని ఆరోపించారు. ఇదేదో ప్రభుత్వం వైకాపాను సభకు రావద్దు అన్నట్టు రోజా గారు అంటున్నారు. వైకాపా సభ్యులు సభకు రావాలి అనుకుంటే వారిని ఆపేది ఎవరు? వారికి వారే రావొద్దు అని నిర్ణయం తీసేసుకుని మళ్ళి ఏపీ అసెంబ్లీ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లా మారిందని అనడం వారికే రోజా గారికే చెల్లింది. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. అసలు వాళ్లు సభకు వచ్చినా.. రాకపోయినా పెద్దగా ఒరిగేది ఏం లేదు. వాళ్లు సమావేశాలకు హాజరు అవ్వకపోతే చంద్రబాబుకి ఏం నష్టం? ఏదో చంద్రబాబు అసెంబ్లీకి రావొద్దు అంటే..వైసీపీ మానుకున్నట్టు మాట్లాడుతుంది రోజా..