వస్త్రధారణ "రచ్చ"లో మిథాలీరాజ్

ఇటీవలి కాలంలో మహిళల వస్త్రధారణపై కామెంట్ చేయడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా సెలబ్రెటీ స్టేటస్‌లో ఉన్నవారికి ఈ తాకిడి మరింత ఎక్కువైంది. సినీ తారలు, స్పోర్ట్స్ పర్సన్స్‌కు సంబంధించిన ప్రతి విషయమూ ఆసక్తికరమే..బయోగ్రఫి నుంచి వ్యక్తిగత విషయాల దాకా అన్నింటిపైనా అభిమానులకు ఆరాటం ఎక్కువే. ఈ రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి చిన్న విషయానికి విపరీతమైన బజ్ వచ్చేస్తోంది. ఒక దానికి పాజిటివ్ టాక్ వస్తే..మరోదానిపై నెగిటీవ్ కామెంట్లు వచ్చేస్తున్నాయి. ఒక సెలబ్రెటీ ఎక్కడో ఏదో ఫంక్షన్‌లో సెల్ఫీ దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం‌..అది క్షణాల్లో వైరల్ అవ్వడం జరిగిపోతుంది.

 

దానిని చూసిన వారు బాగుంది అని లైక్ కొట్టడానికి బదులు..అందులోని తప్పొప్పులను వేలేత్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మహిళా సెలబ్రెటీ అయితే ఇక అంతే ఉండదు. గతంలో వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి, సినీనటి అనసూయ వస్త్రధారణపై కొందరు విమర్శలు చేశారు. అలా చేసిన వారికి అంతే ఘాటుగా కౌంటరిచ్చారు వారిద్దరూ. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ చేరారు.

 

ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో మిథాలీ వేసుకున్న వస్త్రధారణ అసభ్యకరంగా ఉందంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. నలుగురికి స్పూర్తి పంచాల్సిన స్థానంలో ఉంటూ ఇదేం పని అంటూ విమర్శిస్తున్నారు. మరి అభిమానులు ఊరుకుంటారా... అసలే ఇండియాలో క్రికెట్ ఒక మతమాయే. ఇక చూస్కోండి..మీ మైండ్‌సెట్ మార్చుకోండి..ఇలాంటి మనస్తత్వాన్ని ఇకనైనా విడిచిపెట్టాలంటూ క్లాసులు పీకుతున్నారు.. మేల్ డామినేటేడ్ ఇండియన్ క్రికెట్‌లో మహిళా క్రికెట్‌కు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చి.. మహిళా క్రికెట్‌ అనేది ఒకటి దేశంలో ఉందని చాటి చెప్పింది మిథాలీనే అని..అలాంటి ఆమె విజయాలు చూడకుండా..ఇలా నీచమైన కామెంట్లు పెట్టడం విడనాడాలని వారు సలహా ఇస్తున్నారు.