సినిమాల బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు... తెలంగాణ ఇలా.. ఏపీ అలా!

తెలుగు రాష్ట్రాలలో కొత్త సినిమాలు విడుదలౌతున్నాయంటే ఆ హడావుడే వేరుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా అగ్ర హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే పండగ శోభకు కొత్త సొబగులు అద్దినట్లే ఉంటుంది. ఇక కొత్త సినిమాల విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ల ధరల పుంపు మామూలే. అయితే పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన ఒక్కసారిగా పరిస్థితిని మార్చేసింది. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆ సినిమా హీరో అల్లు అర్జున్ వైఖరినీ, అరెస్టై మధ్యంతర బెయిలుపై విడుదలైన అల్లు అర్జున్ ను పరామర్శించడానికి జాతరలా వెళ్లిన సినీ ప్రముఖులనూ తప్పు పట్టారు. తాను సీఎంగా ఉన్నంత వరకూ బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ప్రశక్తే లేదని కుండ బద్దలు కొట్టేశారు. ఈ పరిస్థితి నిస్సందేహంగా తెలుగుసినీ పరిశ్రమకు ఒకింత ఇబ్బందికరంగానే పరిణమించింది. బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పుంపు లేకపోతే.. కోట్ల వ్యయంతో నిర్మించిన సినిమాల పెట్టుబడులు వెనక్కు వచ్చే అవకాశాలు మృగ్యమన్న ఆందోళన సినీ పరిశ్రమ వర్గాల్లో వ్యక్తం అయ్యింది. దీంతో తెలంగాణ సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయనతో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ తరువాత కూడా రేవంత్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. శాంతి భద్రతల విషయంలో రాజీ ప్రశక్తే లేదని ఖరాఖండీగా చెప్పేశారు. అదే సమయంలో రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తన ప్రభుత్వం పూర్తిగా అండదండలు అందిస్తుందని భరోసా ఇచ్చారు.  సరే తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతించారు. దీంతో ఏపీలో కూడా బెనిఫిట్ షోలకు, టికెట్ల ధర పెంపునకు బ్రేక్ పడినట్లేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. కానీ ఏపీ సర్కార్ తెలుగుసినీ పరిశ్రమకు ఊరట కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది.  సంక్రాంతికి రాబోతున్న మూడు సినిమాలకు బెనిఫిట్ షోలకు, టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది.   ఈ సంక్రాంతికి విడుదలౌతున్న మూడు సినిమాలు గేమ్ ఛేంజర్, డాకూ మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు వాటి వాటి బడ్జెట్ ను బట్టి  టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన గేమ్‌ ఛేంజర్‌  బడ్జెట్ దాదాపు 300 కోట్ల రూపాయలు కావడంతో ఆ సినిమాకి  మొదటి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌ థియేటర్‌లో రూ.135, మల్టీప్లెక్స్‌ల్లో రూ.175లు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. అలాగే పరిమిత సంఖ్యలో బెనిఫిట్‌ షోలకూ అనుమతించి, బెనిఫిట్ షోలకు టికెట్ల రేట్లను రూ.600లుగా నిర్ణయించింది. అదే విధంగా బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో   నిర్మించిన డాకు మహారాజ్ సినిమాకు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి దక్కింది. సింగిల్ స్క్రీన్‌ థియేటర్‌లలో రూ.110లు, మల్టీప్లెక్స్‌ల్లో రూ..135లు పెంపునకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. అలాగే బెనిఫిట్‌ షోలకు టికెట్ రేటు 500రూపాయలుగా ఫిక్స్ చేసింది. అలాగే వెంకటేష్ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకి సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో రూ.75లు, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపునకు ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. మూడు సినిమాలకు ఏపీ ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభించిందని చెప్పాలి.  మొత్తంగా కొత్త సినిమాలకు టికెట్ల రేట్లు పెంపు, బెనిఫిట్ షోల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలూ వేర్వేరు నిర్ణయాలు తీసుకున్నాయి. దీంతో సంక్రాతి సినిమాలకు తెలంగాణలో తక్కువ కలెక్షన్లు, ఏపీలో అధిక కలెక్షన్లు వస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పరిశ్రమకు శరాఘాతంగా మారితే.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పరిశ్రమ వర్గాలకు కొండంత ఊరట చేకూర్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Jan 1, 2025 12:15PM

తిరుమలలో లాగే అమరాతి వేంకటేశ్వర స్వామి ఆలయం

ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెం వద్ద టీటీడీ నిర్మించిన  శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో   జె.శ్యామల రావు మంగళవారం (డిసెంబర్ 31) సందర్శించారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన రోజువారి  రోజువారి జరుగుతున్న కైంకర్యాలను, దాతల సహకారంతో ఇప్పటికే జరుగుతున్న అన్నదాన కార్యక్రమ వివరాలను, ఇతర కార్యక్రమాలను ఈవోకు అధికారులు తెలియజేశారు.   తిరుమలలో జరుగుతున్న విధంగానే అమరావతి ఆలయంలోనూ శ్రీవారి రోజువారీ సేవలు జరగాలని ఆయన ఈ సందర్భంగా ఆలయ అధికారులను ఆదేశించారు.   టిటిడి సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్ , అన్నదానానికి అవసరమైన భవనాలు, భక్తులు వేచి ఉండేందుకు హాల్, స్వామివారి వాహనాల కోసం వాహన మండపం, ఆహ్లాదకరంగా గార్డెనింగ్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఈవో శ్యామలరావు ఈ సందర్భంగా ఆదేశించారు. ఆలయానికి సంబంధించి రూపొందించిన ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. ఆలయ నిర్మాణానికి ముందు తయారు చేసిన ప్లాన్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని టిటిడి ఇంజనీరింగ్ అధికారులను ఈవో ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి రద్దీ నేపథ్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతకుముందు ఆలయానికి ఈవో చేరుకోగానే సాంప్రదాయ బద్ధంగా ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి వేదశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, డిప్యూటీ ఇఇ నాగభూషణం, సూపరెంటెంట్ మల్లికార్జున, టెంపుల్ ఇస్పెక్టర్ రామకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Publish Date: Jan 1, 2025 11:45AM

మంగళగిరిలో వైసీపీ గాయెబ్!

మంగళగిరి నియోజకవర్గంలో  ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా వైసీపీ నాయకుడు కనిపించడం లేదు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఏమంత పట్టు లేని నియోజకవర్గం ఇది. 2019 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన నారా లోకేష్ పరాజయం పాలయ్యారు. అయితే ఆ ఓటమి తరువాత నుంచీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా లోకేష్ పని చేశారు. ఆయన శ్రమ, కృషి ఫలించింది. మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోటగా మారిపోయింది. 2024 ఎన్నికలలో లోకేష్ ఈ నియోజకవర్గం నుంచి 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంత వరకూ నియోజకవర్గంలో తోపులం మేమే అంటూ బోర విరుచుకు తిరిగిన వైసీపీ నేతలంతా ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.  ఈ నియోజకవర్గ పరిధిలోనే వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి ప్యాలెస్ ఉంది. నియోజకవర్గ కేంద్రానికి అతి సమీపంగానే జగన్ నివాసం ఉంది. పార్టీ కార్యాలయం కూడా అదే.  అలాంటి మంగళగిరిలో ఇప్పుడు వైసీపీ ఖాళీ అయిపోయింది. ఆ పార్టీ తరఫున పని చేయడానికి నాయకుడూ, కార్యకర్తా కూడా కనిపించని పరిస్థితి ఉంది. అలాంటి చోట‌. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో వైసీపీ ఫేస్ గా ఫోజులు కొడుతూ తిరిగిన వారంతా ఎంత తొందరగా వైసీపీకి గుడ్ బై కొడితే అంత మేలు అన్నట్లుగా మారిపోయారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా, లోకేష్ కు ప్రత్యర్థిగా పోటీ చేసిన మురుగుడు లావణ్య.. ఓటమి తరువాత కనిపించడం లేదు. ఆమె అజాపజా లేదు. ఆమె మావ మురుగుడు హనుమంతరావు ఇప్పటికీ వైసీపీలోనే కొనసాగుతున్నా... ఏ మాత్రం క్రియాశీలంగా లేరు. ఆయన తెలుగుదేశం వైపు చూస్తున్నారు. అటు నుంచి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుందా దూకేద్దామన్నట్లుగా ఆయన తీరు ఉంది. ఇక మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి 2024కు ముందు వరుస విజయాలు సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే అలియాస్ కరకట్ట కమల్ హసన్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన తీరు గమనిస్తే పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక వీరు కాకుండా వైసీపీలో చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన గంజి చిరంజీవి. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించి భంగపడినా గంజి చిరంజీవి వైసీపీని అంటిపెట్టుకునే ఉన్నారు. కానీ పార్టీ ఘోర పరాజయం తరువాత ఆయన వైఖరి మారింది. పార్టీకి దూరం జరగడమే కాదు.. జనసేనకు దగ్గరయ్యారు. అతి కష్టం మీద పవన్ కల్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొంది జనసేన గూటికి చేరిపోయారు. దీంతో ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎంప్టీ అయిపోయింది. పార్టీ కార్యక్రమాలను నడిపించే వారు కాదుకదా అసలా పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా ఎవరూ లేకుండా పోయిన పరిస్థితి ఉంది.  అదే సమయంలో మంత్రి నారా లోకేష్ కు నియోజకవర్గంలో రోజు రోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. ప్రజాదర్బార్ లో ఆయన నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నారు. కష్టంలో ఉన్న ప్రతి వారికీ నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు. దీంతో జనం స్వచ్ఛందంగా ఆయన నాయకత్వానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారంతా ఇప్పుడు తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 75 వేల మంది కొత్తగా తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు గడువు ముగిసే సరికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే.. మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
Publish Date: Jan 1, 2025 11:36AM

సంక్రాంతి వేళ తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. సంక్రాంతి రద్దీని తట్టుకునేలా  6,432 ప్రత్యేక బస్సులను నడపనుంది. వీటిలో 557 సర్వీసు లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. దీంతోపాటు ఈ సంక్రాంతికి జిల్లాల నుంచి హైదరాబాద్ కు ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని నిర్ణయించారు.  గత ఏడాది టీజీ ఆర్టీసీ సంక్రాంతి సందర్భంగా  4,484 ప్రత్యేక బస్సుల నడపాలని నిర్ణయించినప్పటికీ, ప్రయాణీకుల రద్దీ అధికంగా ఉండటతో ఆ సంఖ్యలు  5246 బస్సులను సంస్థ నడిపింది. గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి 6,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 9వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు   అందుబాటులో ఉంటాయి.  హైదరాబాద్ లో   ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసేలా ప్రత్యేక అధికారులను నియమించింది.  హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్ నుంచి కాకినాడ, కందుకూరు, అమలాపురం, నర్సాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి లకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి.  అలాగే ఏపీ నుంచి పండుగ అనంతరం తిరుగు ప్రయాణం అయ్యేవారి కోసం కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు.   రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని టీజీఆర్టీసీ తెలిపింది. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని సూచించింది. 
Publish Date: Jan 1, 2025 10:11AM

తిరుమలలో తాచుపాము హల్ చల్.. కొత్త సంవత్సరంలో కంగారుపెట్టిన సర్పం

కొత్త సంవత్సరానికి తిరుమలలో ఓ నాగుపాము స్వాగతం చెప్పింది. బుసలు కొడుతూ ఊగిపోతున్న ఆ తాచుపామును చూసి భక్తులు భయకంపితులయ్యారు. బుధవారం (జనవరి 1) ఉదయం తిరుమల  రాంబగిచా గెస్ట్ హౌస్ దగ్గర ఓ తాచుపాము హల్ చల్ చేసింది. దాదాపు ఆరు అడుగులు ఉన్న ఈ పాము బుసలు కొడుతూ ఊగిపోతుండటంతో భక్తులు తీవ్ర భయందోళనలకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో అతడు వెంటనే రంగంలోకి దిగి అతి కష్టం మీద ఆ తాచుపామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశాడు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం జనంలో సందడిగా ఉండే రామ్ బగీచా గెస్ట్ హౌస్ వద్ద నాగుపాము హల్ చల్ చేయడం ఆశ్చర్యంగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు.  
Publish Date: Jan 1, 2025 9:52AM

రేవంత్ ఎఫెక్ట్.. సోషల్ అవేర్ నెస్ వీడియోలు చేస్తున్న సినీ స్టార్స్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలీవుడ్ కు తన స్థానం ఏమిటో చూపించారు. ఆయన దెబ్బకు స్టార్లు దిగి వచ్చారు. బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపుతో రాత్రికి రాత్రి సినిమాకు పెట్టిన ఖర్చంతా రాబట్టేసుకోవడమే వ్యాపారం అనుకుంటూ వస్తున్న టాలీవుడ్ స్టార్లకు సామాజిక బాధ్యత మరిస్తే సహించేది లేదన్న స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆయన దెబ్బకు టాలీవుడ్ పరిశ్రమ కాళ్లు నేల మీద ఆన్చింది. రేవంత్ రెడ్డి ఇలా చెప్పారో లేదో అలా ఇద్దరు స్టార్లు సోషల్ అవేర్ నెస్ కలిగేలా వీడియోలు చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.   వారిలో ఒకరు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రభాస్ డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఓ వీడియో చేశారు. దాదాపు 28 సెకండ్ల నిడివి ఉన్న ఆ వీడియోలో ప్రభాస్ ప్రజలు, ముఖ్యంగా యువత డ్రగ్స్ కు బానిసలు కావద్దంటూ పిలుపు నిచ్చారు.  మరో స్టార్ అప్ కమింగ్ హీరోయిన్ శ్రీ లీల. ఆమె కూడా దాదాపు 30 సెకండ్ల నిడివి ఉన్న వీడియో చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అవాస్తవాలు, అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయవద్దని ప్రజలకు పిలుపు నిచ్చారు. వ్యూస్, లైక్ ల కోసం మరొకరిపై బురద జల్లోదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాన్ని సమాజానికి మేలు జరిగేందుకు మాత్రమే వినియోగించుకోవాలని, అందరూ సామాజిక బాధ్యతను అలవరచుకోవాలని శ్రీలీల తన వీడియోలో పిలుపునిచ్చారు.   ఇంత హఠాత్తుగా సీనీజనంలో పరివర్తన రావడానికి కారణం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ తో పాటు, సినీ ప్రముఖులు సమాజంలో అవేర్ నెస్ పెంచే దిశగా ప్రకటనలు చేయాలని ఇచ్చిన పిలుపే అనడంలో సందేహం లేదు.  పుష్ప సినిమా విడుదలకు ముందు రోజు  సంధ్యా ధియేటర్లో ప్రీమియర్ షో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం,   అదే తొక్కిసలాటలో ఆమె కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్ళి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.  ఆ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఆ తరువాత మధ్యంతర బెయిలుపై ఆయన బయటకు వచ్చారు అది వేరే సంగతి. ఈ ఘటనపై అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి  తాను సీఎంగా ఉన్నంతవరకు బెనిపిట్ షోలు, ప్రీమియర్ షోలుండవని, సినిమా టికెట్ల రేట్లు పెంపు కూడా ఉండదని ప్రకటించారు. రేవంత్ ప్రటకనతో సినిమాపరిశ్రమ ఒక్కసారిగా షేక్ అయిపోయింది.  ఆ తరువాత ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో కొందరు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. రేవంత్ ను ప్రసన్నం చేసుకుని ప్రీమియర్ షోలు, టికెట్ల పెంపునకు అనుమతి ఇచ్చేలా ఆయనను ఇన్ ఫ్లుయెన్స్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ భేటీ జరిగింది. అయితే  ఆ భేటీలో సినీ ప్రముఖులు తాము కోరుకున్నది సాధించుకోలేకపోవడం అటుంచి, వారికి రేవంత్ గట్టిగా క్లాస్ పీకారు.  టాలీవుడ్ స్టార్లకు సామాజికబాద్యత లేదా అని నిలదీశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ కు వ్యతిరేకంగా హీరోలు ఎందుకు నోరు విప్పటంలేదని ప్రశ్నించారు. డ్రగ్స్ కంట్రోల్ కు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సినీపరిశ్రమ మద్దతుగా నిలబడి తీరాలన్నారు. ఇందుకు  భేటీలో పాల్గొన్న సినీ ప్రముఖులు అంగీకరించారు.   ప్రభాస్, శ్రీలీలల సోషల్ అవేర్ నెస్ వీడియోలు దానికి ఫాలో అప్ గానే చూడాల్సి ఉంటుంది.   ముందు ముందు మరింత మంది స్టార్ హీరోల నుంచి ఇటువంటి వీడియోలు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యే సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఎటూ లేకుండా పోయింది. రేవంత్ ను మెప్పించి ఆ తరువాతైనా వీటిని సాధించుకోవాలన్న భావనతో టాలీవుడ్ పరిశ్రమ ఉందని అంటున్నారు.  
Publish Date: Jan 1, 2025 9:43AM