ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన మంత్రి నారా లోకేశ్
posted on May 17, 2025 9:27PM

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిశారు.శనివారం సాయంత్రం నారా లోకేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి దేశ రాజధాని దిల్లీకి చేరుకున్నారు. అనంతరం, ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం ప్రధానమంత్రి ఆహ్వానం మేరకే జరిగినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ప్రధాని అమరావతిలో పర్యటించిన విషయం విదితమే. ఆ పర్యటన సందర్భంగా, నారా లోకేశ్‌ను దిల్లీ వచ్చి తనను కలవాల్సిందిగా ప్రధాని సూచించారు.
ఈ నేపథ్యంలోనే, లోకేశ్ ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి దిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు.ఈ సందర్భంగా ప్రధాని, లోకేశ్ దంపతుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుమారుడు, చిన్నారి దేవాన్ష్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముచ్చటించారు. ఫ్యామిలీపరమైన విషయాలతో పాటు, ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు కూడా వీరిరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.