ఏపీ సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో భారీ కుంభకోణం.. దగా పడ్డ అభ్యర్థులు!

posted on: Jun 22, 2026 4:33PM

తెలుగు వన్ ఎక్స్ క్లూజివ్

ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ  హయాంలో చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో పెను సంచలనం రేపే భారీ కుంభకోణం వెలుగుచూసింది.  2020లో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా జరిగిన ఈ రిక్రూట్‌మెంట్‌లో అర్హులైన మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, కనీస అర్హత మార్కులు రాని వారికి తెరవెనుక నుంచి ఉద్యోగాలు కట్టబెట్టారని బాధితులు ఆధారాలతో సహా ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలను ప్రశ్నించిన బాధితులకు  నాటి అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి కుమారుడు, అనుచరుల నుంచి ప్రాణాపాయ హెచ్చరికలు రావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు   45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే..  అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంలో శ్రీకాకుళం, ప్రకాశం తదితర జిల్లాల్లో జరిగిన నియామకాల డిజిటల్ డేటాను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. వికలాంగుల కేటగిరీలో 45 మార్కులు రావాల్సి ఉండగా, కేవలం 40.75 మార్కులు సాధించి అనర్హుడిగా మిగిలిన ఒక అభ్యర్థికి రోస్టర్ పాయింట్ల ఆధారంగా 42 వేల పైచిలుకు ర్యాంకు ఉన్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. అంతకంటే మెరుగైన ర్యాంకులు, అర్హత మార్కులు సాధించిన ఎంతో మంది ప్రతిభావంతులను పక్కనబెట్టి, తెర వెనుక దందాతో అనర్హులకు కాల్ లెటర్లు పంపారని బాధితులు నిలదీస్తున్నారు.

మరింత విచిత్రంగా, కేవలం రెండు నెలల్లో ముగియాల్సిన ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ఏకంగా రెండేళ్ల పాటు సాగదీశారు. 2020 నవంబర్‌లో ప్రారంభమైన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ 2022 జనవరి వరకు   కొనసాగుతూనే వచ్చింది. ముఖ్యంగా పోలీసు ఉద్యోగాల పరిధిలోకి వచ్చే మహిళా కానిస్టేబుల్   పోస్టుల్లో వినికిడి లోపం   ఉన్న వారికి పెద్దపీట వేయడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన పోస్టుకు ఫిట్ నెస్ ను పక్కనబెట్టి దొంగ సర్టిఫికేట్లతో పైరవీకారులకు ఉద్యోగాలు కట్టబెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తమకు జరిగిన అన్యాయంపై బాధితులు  అప్పుడే ఒక మంత్రిని కలిసి మొరపెట్టుకోగా.. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం కానీ, మీకే ఇస్తామని చెప్పామా? అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ దారుణాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రయత్నించిన అభ్యర్థులను మాజీ మంత్రి కుమారుడు తీవ్రంగా బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్ వివరాలు బయటపెడితే బాధితుల కుటుంబాలను లేకుండా చేస్తామంటూ గూండాలతో హెచ్చరికలు పంపడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది.

లక్షలాది మంది నిరుద్యోగుల కష్టాన్ని, తల్లిదండ్రుల ఆశలను కాలరాస్తూ జరిగిన ఈ సచివాలయ ఉద్యోగాల దందాపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్లు వస్తున్నాయి. బాధితులంతా సమాచార హక్కు చట్టం (  ద్వారా వివరాలు సేకరించి, హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో పిల్   దాఖలు చేయాలని మేధావులు సూచిస్తున్నారు. నిలిపివేసిన అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించి, అభ్యర్థుల మార్కులతో కూడిన సమగ్ర మెరిట్ జాబితాను విడుదల చేయడమే కాకుండా, దీనిపై సిట్టింగ్ జడ్జితో పూర్తి స్థాయి విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని ఏపీ నిరుద్యోగ లోకం గళమెత్తుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...