మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి! 

మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ మృతి చెందారు. సుకుమా-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆర్కే అనారోగ్యంతో చనిపోయినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధృవీకరించారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, అలియాస్ ఆర్.కెగా పని చేశారు. విప్లవోద్యమంలో ఆర్కేది తిరుగులేని పాత్ర. నేపాల్ నుంచి దక్షిణ భారతం వరకు ఆయనకు గొప్ప విప్లవ నేతగా గుర్తింపు ఉంది.

నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఆర్కే కొనసాగారు. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఆర్కే ప్రధాన సూత్రధారుడిగా ఉన్నారు. మాజీ సీఎం చంద్రబాబుపై దాడి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. నాలుగేళ్ల క్రితం బలిమెల ఎన్‌కౌంటర్‌లో ఆయనకు బుల్లెట్ గాయం అయింది. అదే ఎన్ కౌంటర్ లో ఆయన కుమారుడు మృతి చెందాడు. బుల్లెట్ గాయమైనప్పటి నుంచి ఆర్కే అనారోగ్యంతో బాధపడుతున్నారు. 

2004 అక్టోబర్ 15న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్కే ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆర్కేపై రూ.50 లక్షల రివార్డును పోలీస్ శాఖ గతంలో ప్రకటించింది.  సౌత్‌లో మావోయిస్టు పార్టీ బలోపేతానికి తీవ్రంగా పోరాటం చేశారు రామకృష్ణ. ఏపీ, తెలంగాణలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలు దఫాలుగా పోలీసుల నుంచి తప్పించుకున్నారు. అయితే ఆర్కే మృతిపై సమాచారం లేదని విరసం నేత కల్యాణరావు తెలిపారు. 

Related Segment News