కేసీఆర్ ప్రామిస్... ఓ బోగస్.. ఇదిగో ప్రూఫ్

దళితుల సంక్షేమం కోసమంటూ కొత్తగా దళిత బంధు పథకాన్ని ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. దళితుల దశ మార్చి దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలుపుతామంటున్నారు. టీఆర్ఎస్ నేతలు కూడా దళిత బంధు చరిత్రాత్మకమంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షాలు మాత్రం హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓట్ల కోసమే దళిత బంధు అంటూ కేసీఆర్ కొత్త డ్రామా చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. దళితులకు మూడెకరాల భూపంపిణి లాగే ఇదికూడా వందల మందితోనే ఆగిపోతుందని చెబుతున్నారు. 

దళిత బంధుపై అధికార, విపక్షాల వాయిస్ ఎలా ఉన్నా..  కేసీఆర్ కొత్త స్కీంను దళితులు సహా ఎవరూ నమ్మడం లేదంటున్నారు సామాజిక నిపుణులు. ఎందుకంటే దళితబంధుపై కేసీఆర్ ఇప్పటికే 3, 4 సార్లు ప్రకటనలు చేశారు. ఏ ఒక్క ప్రకటనకూ పొంతన లేదని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ మాటల్లో డొల్లతనాన్ని తన పదునైన విశ్లేషణల ద్వారా బట్టబయలు చేశారు ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ.  అంతేకాదు ఈసారి ఎన్నికల ముందు దళితులు మోసపోకుండా దళిత చైతన్య సదస్సును నిర్వహిస్తామని కూడా ప్రకటించారు. 

దళిత బంధుపై మందకృష్ణ మాదిగ లెవనేత్తిన అంశాలు.. 

1) హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే పథకాన్ని అమల్లోకి తీసుకురావాలి. అలా చేస్తేనే ఎన్నికలు జరుగుతున్న సమయానికి కూడా పథకం అమలుకు ప్రాబ్లం ఉండదు. ఒకవేళ నోటిఫికేషన్ వెలువడేనాటికి అమల్లోకి రాకపోతే దళితబంధు కాస్తా దళిత దగా అవుతుంది. 

2) తొలుత దళిత బంధు కోసం నియోజకవర్గానికి 100 మంది చొప్పున రూ. 1500 నుంచి 2 వేల కోట్లు కేటాయిస్తామన్న కేసీఆర్.. ఆ తరువాత ఏకంగా ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున లక్ష కోట్లయినా ఖర్చు చేస్తామని చెప్పారు. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గానికే 2 వేల కోట్లు అవుతున్నప్పుడు... కేటాయించే మొత్తం లక్ష కోట్లు అనుకున్నా.. మిగిలిన నియోజకవర్గాలకు కనీసం వెయ్యి కోట్లు కూడా అందబోవడం లేదని మందకృష్ణ లాగుతున్న లాజిక్కు. దీనికి కేసీఆర్ అండ్ కో దగ్గర అసలు ఏ జవాబూ లేదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 

3) తాజాగా దళిత బంధును దశలవారీగా అమలు చేస్తామని, ఏటా 3, 4 లక్షల మందికి వర్తించేలా ఏటా రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తామని కేసీఆర్ అంటున్నారు. ఒక్క హుజూరాబాద్ ను పురస్కరించుకునే రూ. 2 వేల కోట్లు కేటాయిస్తే 20 వేల మందికి సరిపోతున్నప్పుడు ఏడాదికి కేటాయించే రూ. వెయ్యి కోట్లతో ఎంతమందికి లాభం చేకూరుస్తారు.. అంటే సరిగ్గా 10 వేలమందికి కూడా దళితబంధు పథకాన్ని అమలు చేయలేకపోతున్నారని దీన్నిబట్టే తేలిపోతోంది. 

4) కేసీఆర్ దగ్గర దళితబంధు పథకం విషయంలో చిత్తశుద్ధి గానీ, రోడ్ మ్యాప్ గానీ లేదని, ఇదంతా బోగస్ ప్రామిస్ గానే చూడాలని ఆయన ఘాటుగా విరుచుకుపడుతున్నారు. 

కేసీఆర్ మాటల్లోని డొల్లతనాన్ని అన్నివర్గాల ప్రజలకు, ఓటర్లకు వివరించేందుకే తాము త్వరలో దళిత చైతన్య సదస్సు నిర్వహిస్తామంటున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందే దళితుల ఓట్ల కోసం ఇన్ని సర్కస్ ఫీట్లు చేస్తున్న కేసీఆర్... ఆ తరువాత పథకం అమలు చేయలేక చేతులెత్తేయడం ఖాయమంటున్నారు దళిత మేధావులు. మరోవైపు దళితుల సంక్షేమాన్ని, వారి సాధికారతను ఇప్పుడే వల్లిస్తున్న కేసీఆర్.. అసలు ఎస్సీ కార్పొరేషన్ ను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చొల్లేటి ప్రభాకర్ ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ప్రణాళికను సక్రమంగా అమలు జరగనిస్తే ప్రత్యేకమైన దళితబంధు వంటి స్కీముల అవసరమే లేదంటున్నారాయన. ఒకవేళ ఒక్కో కుటుంబానికి ఈ రూ. 10 లక్షలు నిజంగా ఇచ్చినట్టయితే.. వారి ఆర్థిక స్వావలంబనకు ఆ మొత్తాన్ని ఎలా వాడుతారో తెలియజేయాలనేది ఆయన మరో ప్రశ్న. మరి కేసీఆర్ మళ్లీ ఎలాంటి కొత్త ఈక్వేషన్ తీసుకొస్తారో చూడాలి..