నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్.. వ్యక్తిగత పూచీకత్తు సమర్పణ

సినీ నటుడు అల్లు అర్జున్  నాంపల్లి కోర్టుకు హజరయ్యారు. సంధ్య థియేటర్ ఘటనలో రేవతి చనిపోవడం , ఆమె కుమారుడు ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో కొట్టు మిట్టాడంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కండిషన్ బెయిల్ మీద విడుదలైన అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు.  ఇరు పక్షాల వాదనలు  విన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు కావడంతో వ్యక్తిగత పూచీ కత్తు సమర్పించడానికి ఆయన కోర్టుకు హాజరయ్యారు. పూచీ కత్తుకు సంబంధించిన పత్రాలను సమర్పించడానికి ఇక్కడికి వచ్చారు. . చెరో 50 వేల చొప్పున రెండు పూచీకత్తులు   జడ్జి ముందు సమర్పించారు.
Publish Date: Jan 4, 2025 3:17PM

 అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు కాసేపట్లో...

సినీ నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు చేరుకోనున్నారు. రెగ్యులర్ బెయిల్ మంజూరుకావడంతో వ్యక్తిగత పూచీ కత్తు సమర్పించడానికి ఆయన కోర్టుకు హాజరవుతున్నారు.   పూచీ కత్తుకు సంబంధించిన పత్రాలను సమర్పించడానికి ఇక్కడికి వస్తున్నారు. చెరో 50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని  కోర్టు ఆదేశించింది. రెండు నెలల పాటు ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. సాక్ష్యలను , కేసును ప్రభావితం చేయకూడదని కోర్టు ఆదేశించింది. అల్లు అర్జున్ జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 45   నివాసం నుంచి బయలు దేరినట్టు సమాచారం. 
Publish Date: Jan 4, 2025 2:18PM

ఐదు పదుల వయసులో  నడి సంద్రంలో  గోలి శ్యామల  సాహసయాత్ర  

సామర్ల కోటకు చెందిన గోలి శ్యామల కేవలం గృహిణి మాత్రమే . కనీసం స్విమ్మర్ కూడా కాని ఆమె విశాఖ ఆర్ కె బీచ్ నుంచి కాకినాడ తీరం వరకు ఈది సంచలనం సృష్టించారు.  దాదాపు 150  కిలోమీటర్లు  ఐదురోజుల్లో ఈది అరుదైన రికార్డు సాధించారు.  రోజుకు 30 కిలోమీటర్లు టార్గెట్ గా ఆమె ఈత కొట్టారు. సముద్ర కెరటాల మీద ఈత కొట్టడం అంత ఆషామాషీ కాదు. హైద్రాబాద్ లో యానిమేషన్ స్టూడియో పెట్టుకుని పలు సీరియళ్లు, సినిమాలకు ఆమె పని చేశారు. దురదృష్ట వశాత్తు బాగా నష్టపోయారు. ఆర్థికంగా పూర్తిగా  చితికి పోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. మైండ్ డైవెర్షన్ కోసం స్విమ్మింగ్ నేర్చుకుని అదే స్విమ్మింగ్ మీద అరుదైన రికార్డు చేరుకోవడం గమనార్హం.  డిప్రెషన్ లో ఉన్నప్పుడు కోచ్ జాన్ సిద్దిఖీ ఆమెకు స్విమ్మింగ్ నేర్పించాడు. జీరో లెవెల్ నుంచి కెరీర్ ప్రారంభించి 150 కిలో మీటర్లు సముద్రంలో చేరుకోవడం ఆసియా స్థాయిలో సాధించిన ఘనత అని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 28 కి ముందు వాతావరణం అనుకూలించక ఈ  సాహస యాత్రను రెండు పర్యాయాలు వాయిదా వేసుకున్నారు. తర్వాత వాతావరణం అనుకూలించడంతో విశాఖ ఆర్కే బీచ్ లో సముద్రంలో దూకి కాకినాడ గడ్డపై తేలారు.  2021లో ఆమె  శ్రీలంక నుంచి ఇండియావరకు రామసేతు  దాటానని గోలి శ్యామల చెప్పారు. ఈ యేడు ఫిబ్రవరిలో లక్ష్య ద్వీప్ లో 18 గంటలపాటు 48 కిలో మీటర్లు ఆమె స్విమ్ చేసారు.  బంగాళా ఖాతంలో స్విమ్ చేయాలని ఆమె రెండేళ్ల క్రితమే కలలు కని సాకారం చేశారు. ఒక ఫిషింగ్ బోట్ లో ఇద్దరు స్కూపర్ డ్రైవర్లతో ఈ సాహస యాత్ర చేశారు.  మహిళలకు ఈత కంపల్సరీ అని గోలిశ్యామల చెబుతున్నారు. గైనిక్ సమస్యలను బాధపడుతున్న వారికి ఈత చక్కటి ఉపశమనం అని ఆమె చెబుతున్నారు. స్విమ్ ను స్పోర్ట్స్ గా కాకుండా సర్వైకల్ స్పోర్ట్స్ గా బలంగా నమ్మే గోలి శ్యామల భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచారు.    గోలి శ్యామల ఈత నేర్చుకునే సమయంలో చాలామంది హేళన చేశారు. అయినా ఆమె పట్టించుకోలేదు. అపజయం నుంచి విజయం అందుకున్న వీర వనిత గోలి శ్యామల. 
Publish Date: Jan 4, 2025 1:43PM

విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీలో ఉక్కపోతే మిగిలింది. వణికించేస్తున్న చలిలో కూడా ఆయనను ఉక్కపోత వేధిస్తున్నట్లుంది. జనవరి చివరి వారం నుంచి జిల్లాలలో పర్యటిస్తానంటూ ఆయన చేసిన ప్రకటనకు సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచే సానుకూలత వ్యక్తం కాకపోవడంతో ఆయన పర్యటనలను వాయిదా వేసుకుని హడావుడిగా విదేశీయానానికి రెడీ అయిపోయారు. సంక్రాంతి కంటే ముందుగానే ఆయన లండన్ వెళ్లాలని భావిస్తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఆయన ఈ నెల 11న లండన్ బయలుదేరి వెళ్లాలని భావిస్తున్నారు. అయితే ఆయన అనుకున్నంత మాత్రాన విదేశీ పర్యటనకు వెళ్లగలిగే వెసులుబాటు ఆయనకు లేదు. ఆయన అక్రమాస్తుల కేసులో బెయిలుపై ఉన్నారు. అందుకే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే అందుకు సీబీఐ కోర్టు అనుమతి తప్పని సరి. అందుకే ఆయన ఇప్పుడు సీబీఐ కోర్టులో ఈ నెల 11 నుంచి 25 వరకూ యూకేలో ఉన్నత చదువులు చదువుతున్న తన కుమార్తెల వద్దకు వెళ్లడానికి అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆయన పిటిషన్ ను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన తరువాత జగన్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతాయి. ఆ తరువాతే జగన్ కు విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చేదీ లేనిదీ కోర్టు నిర్ణయిస్తుంది.     గతంలో కూడా జగన్ తన విదేశీ పర్యటనలకు ముందుగా కోర్టు అనుమతి పొందిన సంగతి విదితమే. గత ఏడాది ఏపీలో ఎన్నికల తరువాత ఫలితాలు వెలువడక ముందేజగన్ తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లారు.  ఇప్పుడు మరోసారి ఆయన తన కుమార్తెల వద్దకు వెళ్లడానికి కోర్టు అనుమతి కోరారు. అయితే ఈ సారి జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలుపుతూ సీబీఐ కోర్టులో గట్టిగా వాదించే అవకాశాలు ఉన్నాయి. అధికారంలో లేకపోవడం, జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు త్వరిత గతిన పూర్తి చేయాలని ఇప్పటికే సుప్రీం సీబీఐకి విస్పష్ట ఆదేశాలు జారీ చేసినందున ఆయన విదేశీ పర్యటనకు అనుమతి లభించడం అంత సులువుకాదని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ పండుగ వేళ ఏపీని వదిలి విదేశాలకు వెళ్లాలనుకోవడం చూస్తుంటే ఆయన రాష్ట్రంలో వైసీపీని బలోపేతం చేయాలన్న ఉద్దేశానికి తిలోదకాలిచ్చేసినట్లే కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 
Publish Date: Jan 4, 2025 1:32PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ ఆటలో అరటిపండేనా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది రోజులలో షెడ్యూల్ వెలువడనుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆప్, బీజేపీ అస్త్రశస్త్రాలతో సన్నద్ధమైపోయాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక చాలా వరకూ పూర్తి చేయడమే కాకుండా, విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఎన్నికలకు ఇంకా సమాయత్తమైనట్లు కనిపించడం లేదు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను తప్పించాలంటూ ఆప్ చేసిన వ్యాఖ్యలు ఆ రెండు పార్టీల మధ్యా సంబంధాలు పూర్తిగా చెడ్డాయన్న విషయాన్ని తేటతెల్లం చేసేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పోటీ పరిస్థితి ఆటలో అరటిపండులా ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాన పోటీ ఆప్, బీజేపీల మధ్యే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి.  గత దశాబ్దంగా ఢిల్లీ పీఠం అప్ చేతిలోనే ఉంది. దీంతో బీజేపీ ఆప్ లక్ష్యంగా వ్యూహాలు రచించి అందుకు అనుగుణంగా తన ప్రచార ప్రణాళికను రచించుకుంటోంది. బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం విషయంలో పూర్తిగా మోడీ కరిష్మాపైనే ఆధారపడిందనడంలో సందేహం లేదు. హిందుత్వ అజెండాను ప్రముఖంగా తెరపైకి తీసుకురావడం, అలాగే ఆప్ అవినీతి పార్టీ అంటూ చాటడమే లక్ష్యంగా ప్రచార వ్యూహాలను సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఆప్ యమున ప్రక్షాళనకు వ్యతిరేకం అంటూ ఉద్ఘాటించడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులుగా కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు అరెస్టైన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించడంపైనే బీజేపీ దృష్టి పెట్టింది. ఆ దిశగా ఇప్పటికే ప్రధాని మోడీ తన ప్రచార శంఖారావాన్ని పూరించారు.  ప్రధాని మోడీ శుక్రవారం (జనవరి 3)న ఢిల్లీలో పర్యటించారు. ఢిల్లీలో కేంద్రం నిర్మించిన గృహాలను పేదలకు పంపిణీ చేయడం కోసం చేసిన ఈ పర్యటనను ఆయన ఎన్నికల ప్రచారం కోసం పూర్తిగా వాడుకున్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తోందనీ, స్వయంగా ఆ పార్టీ అగ్రనేతలో పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారనీ విమర్శలు గుప్పించారు.  గుజరాత్ వ్యాపారి ఇచ్చిన పది లక్షల రూపాయల విలువైన సూటు ధరించారనీ, సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో బాగంగా ప్రధాని తన నివాసాన్ని నిర్మించుకున్నారనీ ఘాటు విమర్శలు చేశారు. ఆ విమర్శలు, ప్రతి విమర్శలతో శీతాకాలంలో వణికించే చలిలో కూడా ఢిల్లీ రాజకీయం వేడెక్కింది. అయితే ఇంత జరుగుతున్నా ఢిల్లీ రాజకీయ వేదికపై కాంగ్రెస్ ఎక్కడా కనిపించడం లేదు.  దీంతో త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పాత్ర, పోటీ నామమాత్రంగానే ఉంటుందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. 
Publish Date: Jan 4, 2025 1:04PM

మహాకుంభమేళాకు ఉగ్రముప్పు?!

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరిగే మహాకుంభమేళాకు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచీ 40 కోట్ల మందికి పైగా హాజరౌతారన్న అంచనాలు ఉన్నాయి. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద జరగనున్న ఈ కుంభమేళాపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘావర్గాల హెచ్చరికలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉగ్రవాదులు సాధువుల రూపంలో దాడులకు తెగబడే అవకాశం ఉందన్నహెచ్చరికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా సందర్భంగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు కుంభమేళాకు వచ్చే భక్తులను కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది.  
Publish Date: Jan 4, 2025 11:44AM