ఆయన గ్రూపులో ఉంటే యూపీఎస్సీలో టాప్ ర్యాంకే! వాట్సాప్ గురు.. మహేష్ భగవత్ 

దేశ ప్రజాస్వామ్య రాజముద్రలో కనిపించేవి మూడు సింహాలే. ఆ కనిపించని నాలుగో సింహాన్నే పోలీస్ గా భావిస్తారు. అయితే కొందరు పోలీస్ అధికారులు వృత్తిరీత్యా ఖాకీ బట్టలు ధరించి కఠినమైన పరిస్థితుల్లో సైతం అలవోకగా విధులు నిర్వహించినా.. ప్రవృత్తి రీత్యా వారిలో అనేక ఇతర కోణాలు కూడా ఉంటాయి. అలాంటి అరుదైన కోణం కలిగిన పోలీసాఫీసరే రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్. స్కూలు విద్యార్థుల దగ్గర నుంచి ఐఏఎస్ కు ప్రిపేరయ్యే ఉన్నత విద్యావంతుల వరకు ఆయన కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన రీతిలో తర్ఫీదు ఇస్తున్నారు. ఆయన క్లాసుల ద్వారా యూపీఎస్సీ పరీక్షల్లో వందలాది మంది టాప్ ర్యాంక్స్ కొట్టేశారు. ఇది ప్రతి సంవత్సరం ఆయన క్రమం తప్పకుండా ఆచరిస్తున్న బోధనా మార్గం.. గురుమార్గం. 

మహేశ్ భాగవత్ వాట్సాప్ ద్వారా వందలాది మందికి ఆయన మెంటార్ గా మారిపోయారు. తాజాగా విడుదలైన యూపీఎస్సీ ప్రవేశ పరీక్షల్లో ఆయన మెంటారింగ్ లో వంద మందికి  పైగా అభ్యర్థులకు అత్యుత్తమ ర్యాంకులు దక్కాయి. అంకితా జైన్ కు 3వ ర్యాంకు రావడం ఆయనలోని వాట్సాప్ గురు ప్రతిభకు నిదర్శనం. తొలి వంద ర్యాంకుల్లో ఏకంగా 14 మంది ఉండడం విశేషం. 2017లో ఆయన మెంటారింగ్ ద్వారా 93 మందికి అత్తుత్తమ ర్యాంకులు దక్కాయి. వారంతా ఇప్పుడు దేశ అత్యున్నత సర్వీసుల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. 2019లో 39 మంది ఆయన క్లాసుల ద్వారా సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. 

అంతేకాదు.. మహేశ్ భాగవత్ కేవలం యూపీఎస్సీ యాస్పిరెంట్స్ కు మాత్రమే గాక పాఠశాల, కళాశాల విద్యార్థులకు సైతం ప్రిపరేషన్స్ మీద అవగాహన కల్పిస్తూ వారిలో చిన్నప్పట్నుంచే ఐఏఎస్, ఐపీఎస్  ల పట్ల ఆసక్తి  కల్పిస్తున్నారు. పరీక్షా సమయాల్లో ఒత్తిడిని ఎలా  అధిగమించాలి.. వ్యక్తిత్వ వికాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి.. బాధ్యత గల పౌరులుగా ఎలా తయారవ్వాలి.. ముఖ్యంగా మన దేశానికి, ప్రజలకు పోలీసు విధుల ఆవశ్యకత  ఏంటి.. ఇలా అనేక కోణాల్లో ఆయన బోధన జరుగుతుంది. 

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆయన వాట్సాప్ గ్రూపులు  క్రియేట్ చేసి ఎందరో విద్యార్థులకు టాప్  ర్యాంక్స్ వచ్చేలా కృషి చేశారు. అందుకే  ఈ 1995 బ్యాచ్ ఐపీఎస్  ఆఫీసర్ని అందరు కూడా వాట్సాప్ గురు అని పిలుస్తారు.

Related Segment News