ఒక్క సీటు.. మహాకూటమిలో చిచ్చుపెడుతోంది.!!
posted on Oct 19, 2018 4:26PM
తెరాసను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్.. టీడీపీ, టిజెఎస్, సిపిఐ పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసింది. ఒకవైపు తెరాస ఇప్పటికే 105 మంది అభ్యర్థులను ప్రకటించి, అసంతృప్తులను బుజ్జగిస్తూ, ప్రచారం మొదలుపెడితే.. మహాకూటమి మాత్రం ఇంకా సీట్ల సర్దుబాటు దగ్గరే ఆగిపోయింది. తెరాసలో లాగా మహాకూటమిలో అసంతృప్తుల సెగ తగలకూడదనే ఉద్దేశంతో.. కాంగ్రెస్ కూటమిలోని మిగతా పార్టీలతో చర్చల మీద చర్చలు జరుపుతూ.. ఆచితూచి అడుగులు వేస్తుంది. అయితే కొన్నిసార్లు ఆలస్యం కూడా ప్రమాదమే. ఇప్పటికే టిజెఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా ఇదే చెప్పారు. కాంగ్రెస్ ఆలస్యం చేయకుండా సీట్ల విషయంలో ఎంత త్వరగా స్పష్టత ఇస్తే అంత మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కాంగ్రెస్ మాత్రం కూటమిలోని మిగతా పార్టీలకు తక్కువ సీట్లు కేటాయించాలని చూస్తోందని.. కాంగ్రెస్ చెప్పిన సంఖ్యతో టీడీపీ, టిజెఎస్ సంతృప్తిగా లేవని.. దానివల్లే సీట్ల సర్దుబాటు లేటవుతోందని తెలుస్తోంది. దీంతో అసలు సీట్ల విషయంలో చిచ్చు మొదలై అసలు మహాకూటమి చీలిపోయే ప్రమాదముందనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. మరి కాంగ్రెస్ సీట్ల విషయంలో టీడీపీ, టిజెఎస్ పార్టీలను ఎలా బుజ్జగిస్తుందో తెలీదు కానీ.. ఒక్క సీటు విషయంలో మాత్రం సిపిఐతో పెద్ద తలనొప్పి ఏర్పడిందట. ఆ సీటు మాకే కేటాయించాలని సిపిఐ పట్టుబడుతోందట. ఒకవేళ ఆ సీటు కేటాయించకపోతే అవసరమైతే కూటమికి దూరం అవ్వడానికి కూడా సిద్దమనే సంకేతాలు ఇస్తుందట. సిపిఐ అంతలా పట్టుబడుతున్న ఆ సీటు ఏంటంటే ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గం.
గిరిజన నియోజకవర్గంగా ఉన్న వైరా 2009లో ఆవిర్భవించింది. 2009 ఎన్నికల్లో టీడీపీ, సిపిఎం మద్దతుతో సిపిఐ పోటీ చేయగా కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేసింది. ఆ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా బాణోత్ చంద్రావతి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో సిపిఎం మద్దతుతో వైసీపీ.. కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ పోటీ చేసాయి. టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్ గెలిచారు. తరువాత ఆయన తెరాస తీర్థం పుచ్చుకున్నారు. రానున్న ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా ఆయన్నే ప్రకటించారు. ఇప్పటికే ఆయన ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ మహాకూటమితో దగ్గరయ్యాయి. దీంతో మహాకూటమి నుంచి వైరాలో ఎవరు బరిలోకి దిగుతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సీటు కోసం కాంగ్రెస్, సిపిఐ పోటీపడుతున్నాయి. గతంలో ఇది తమ సిట్టింగ్ స్థానమని తమకు బలముందని తప్పకుండా విజయం సాధిస్తామని సిపిఐ వాదిస్తుండగా.. కాంగ్రెస్ నేతలు తామే అధికార పార్టీని ఢీకొనగలమని, తాము పోటీ చేస్తేనే విజయం తథ్యమనే సంకేతాలు పార్టీ అధిష్ఠానానికి పంపిస్తున్నారు. దీంతో సిపిఐ వైరాలో బలప్రదర్శన నిర్వహిస్తోంది. పార్టీ సీనియర్ నాయకుడు కూనంనేని సాంబశివరావు ఈ స్థానాన్ని తమకు కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు. మరోవైపు వైరాలో తాము పోటీ చేస్తామంటూ కాంగ్రెస్ శ్రేణులు బలమైన సంకేతాలు ఇస్తున్నారు. పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించడంతో పాటు గాంధీభవన్ వద్ద నిరసన తెలిపి వైరా స్థానాన్ని కాంగ్రెస్ వదులుకోకూడదంటూ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీనికితోడు కాంగ్రెస్ కీలక నేత మల్లు భట్టి విక్రమార్క సొంత మండలం వైరా కావడంతో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే వైరా నుండి బరిలోకి దింపితే బాగుంటుందని భావిస్తున్నారట. మొత్తానికి ఈ ఒక్క సీటు కోసం ఇరుపార్టీలు పట్టుపట్టినట్టు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ ఈ సీటు విషయంలో సిపిఐని ఎలా బుజ్జగిస్తుందో చూడాలి.