జూబ్లీ బైపోల్.. సునీతకు మాగంటి అభిమానుల సహాయ నిరాకరణ?

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది.  ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కాంగ్రెస్ అభ్యర్థికే అనుకూలంగా వచ్చాయి. జూబ్లీహిల్స్ ఓటర్లు అధికార పార్టీకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన అన్ని సంస్థలూ అంచనావేశాయి.   మాగంటి మరణం తర్వాత అనివార్యంగా జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అందరికంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం మొదలుపెట్టింది. సిట్టింగ్ సీట్‌ను ఎలాగైనా దక్కించుకునేందుకు, తిరిగి మాగంటి కుటుంబానికే జూబ్లీహిల్స్ టికెట్ కన్ ఫర్మ్  చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. సెంటిమెంటే తమ అస్త్రంగా మాగంటి సునీత, ఆమె కుటుంబ సభ్యులు ప్రచారం చేశారు. అయినా కూడా మాగంటి సునీతకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ వర్గాలలో దీనిపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి.  జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి వరుసగా  మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపినాథ్ కు అనేకమంది అనుచరులు, అభిమానులు ఉన్నారు. అయితే ఆయన అకాల మరణం తర్వాత వచ్చిన ఈ ఉపఎన్నికలో మాత్రం గోపినాథ్ భార్య మాగంటి సునీతకు ఆయన అనుచరులు, అభిమానులు ఎవరూ  గ్రౌండ్ లెవల్ లో సహకరించలేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాగంటి ఎన్నికల్లో నిలబడుతున్నారంటే చాలు ఆయన అభిమానులే ఎన్నికల భారమంతా తమ భుజాల మీద మోస్తూ గోపీనాథ్ ను గెలుపించుకునేవారు. కానీ, ఈ ఉపఎన్నికలో మాత్రం వారంతా నామమాత్రంగానే పనిచేశారనీ, అందుకే సునీత వెనుకంజలో ఉన్నారని గులాబీ పార్టీలో టాక్ నడుస్తోంది. 

మాగంటి సునీత విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ ఎలాగైనా ఆమెను గెలుపించుకోవాలని శతవిధాల ప్రయత్నించింది. ప్రచార బాధ్యతను మొత్తం ఒంటిచేత్తో లాక్కొచ్చిన కేటీఆర్, కింది స్థాయి నాయకత్వాన్ని సమన్యయపరచడానికి సరైన కార్యచరణ చేయలేకపోయారని, మాగంటి గోపీనాథ్ అనుచరులను సునీత విజయం  కోసం పనిచేసేలా మోటివేట్ చేయడంలో విఫలమయ్యారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే సునీత విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డ కేటీఆర్ నాయకుల్లో సమన్వయం తీసుకురావడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారట.

మాగంటి గోపీనాథ్‌ది సహజ మరణం కాదంటూ, ఆయన మరణం వెనుక ఏదో కారణం ఉందంటూ.. గోపీనాథ్ అభిమానుల పేర్లతో జూబ్లీహిల్స్ లో వెలిసిన పోస్టర్లు.. మాగంటి మొదటి భార్య, కొడుకు హైదరాబాద్ కు వచ్చి చేసిన ఆరోపణలు, గోపీనాథ్ తల్లి మహానంద కుమారి ఏకంగా కేటీఆర్ పైనే ఆరోపణలు చేయడం.. ఇవన్నీ సునీత ఓటమికి కారణాలు అయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    గోపీనాథ్ అభిమానులు, అనుచరులు ఈ ఉప ఎన్నికలో సునీత విజయం కోసం అంకిత భావంతో పని చేయకపోవడం  బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగా మారిందని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి.  మరి చూడాలి ఈ ఉపఎన్నిక ఫలితం ఎలా ఉంటుందో..  మాగంటి సునీతకు ఎంతమేర ఓటు పర్సెంటేజ్ నమోదవుతుందో?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu