హైకోర్టులో కెటీఆర్ క్వాష్ పిటిషన్ 

ఫార్ములా ఈ కార్ రేస్  కుంభకోణంలో ఎ 1 గా మాజీ మంత్రి కెటీఆర్ ఉన్నట్లు ఎసిబి కేసు నమోదు చేసిన నేపథ్యంలో శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. తనను అరెస్ట్ చేయకూడదని కెటీఆర్ క్వాష్   పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే కెటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.  ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని  కెటీఆర్ మొదట్నుంచి చెబుతూ వస్తున్నారు. కెటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ కావొచ్చు. న్యాయపరంగా పోరాడి గట్టెక్కాలని కెటీఆర్ భావిస్తున్నారు.  కెటీఆర్ పిటిషన్ పై  సింగిల్ బెంచ్ జడ్జి శ్రావణ్ ముందు విచారణకు వచ్చింది. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్ అయిన జడ్జి  శ్రావణ్ ముందు విచారణకు వచ్చింది.
Publish Date: Dec 20, 2024 11:35AM

ఇహనో.. ఇప్పుడో కేటీఆర్ అరెస్ట్

ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్టు రంగం సిద్ధం అయ్యిందా? ఇహనో, ఇప్పుడో ఆయనన అరెస్టు అయ్యే అవకాశం ఉందా? అన్న ప్రశ్నలకు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔనన్న సమాచారమే వస్తోంది. తనపై ఏసీనీ నమోదు చేసిన కేసు క్వాష్ చేయాలంటూ కేటీఆర్ శుక్రవారం (డిసెంబర్ 20) హెకోర్టును ఆశ్రయించనున్న నేపథ్యంలో ఆలోగానే కేటీఆర్ ను అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయమే తెలంగాణ భవన్ వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకోవడం, అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా తెలంగాణ భవన్ కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  అలాగే కేటీఆర్ పై అక్రమంగా కేసు నమోదు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు.   ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదయింది. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే విదేశీ కంపెనీకి రూ. 55 కోట్ల నిధులు చెల్లించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 
Publish Date: Dec 20, 2024 10:24AM

గతంలో జరిగిన గాయాలు ఏవైనా సరే ? ఆ గాయాల నుండి ఇలా బయటపడండి..!

  ప్రజలు చాలావరకు మానసిక సమస్యలతోనే  ఎక్కువగా డిస్టర్బ్ అవుతారు.   చాలామందిని గమనిస్తే కాలంతో పాటు అలా సాగుతుంటారు.. కానీ వారిలో మానసిక సమస్యలు అలాగే ఉంటాయి.  అవన్నీ గతంలో జరిగిన గాయాల తాలూకు బాధాకర పరిస్థితులు.  కాలం అయితే గడుస్తోంది కానీ.. మానసికంగా ఒకచోటే చిక్కుబడిపోయి ఉంటారు. ఆ గాయపడిన పరిస్ఖితుల నుండి బయటకు రాలేకపోవడం వల్లనే చాలా వరకు డిప్రెషన్ వంటి సమస్యలకు లోనవుతుంటారు.  అయితే గతం చేసిన గాయాలు తగ్గంచలేనివే అయినా వాటి నుండి బయటపడం చాలా అవసరం. లేకపోతే జీవితంలో ఎదుగుదల అంతగా ఉండదు.  మానసికంగా బలహీనంగా ఉన్నవారు దాన్ని అధిగమించాలంటే ఈ గతం తాలూకు గాయాల నుండి బయటపడాలి. గతంలో జరిగిన గాయాలు ఏవైనా సరే.. వాటి నుండి బయటపడటం చాలా ముఖ్యం.  ఈ మానసిక గాయాలు మనిషిని లోపలి నుండి చాలా బలహీనంగా మారుస్తాయి.  దీని కారణంగా వ్యక్తులు ఎప్పుడూ నిరాశ,  ఆందోళన, మనుషుల మీద నమ్మకం లేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. గతం తాలూకు గాయాలతో ఇబ్బంది పడుతున్నవారిలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి.  ఇవి వ్యకులలో తొందరగా కోపం, విచారం,  భయం వంటివి కలిగిస్తుంటాయి.  ఈ ఎమోషన్స్ ను బయట పెట్టలేక,  మనసులోనే అణుచుకోలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయితే ఎమోషన్స్ ను అణుచుకోవడానికి ప్రయత్నించకూడదు.  వీటిని బయటకు వ్యక్తం చేయడం వల్ల మనసులో భారం ఏర్పడదు. కౌన్సెలింగ్.. కౌన్సెలింగ్ తీసుకోవడం వల్ల మనసులో మానసిక బాధను, గాయాల తాలూకు పరిస్థితులను అధిగమించడం సులువు అవుతుంది.  గాయం తాలూకు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. సహకారం.. కుటుంబ సభ్యులు, స్నేహితులు,  ఆప్తుల సహాయంతో  మానసిక గాయాల నుండి బయట పడేందుకు ప్రయత్నించాలి.  చుట్టూ ఉన్నవారి సపోర్ట్ ఉంటే వీటి నుండి బయటపడటం తేలిక. వాతావరణాన్ని చాలా ఆహ్లాదంగా ఉంచడంలో అందరూ సహాయపడతారు. నిద్ర.. మానసిక సమస్యలకు మంచి ఔషదంగా నిద్రను చెప్పవచ్చు.  రోజూ కంటినిండా నిద్రపోవడం,  సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.  మానసిక సమస్యలు ఏర్పడినా అవన్నీ తర్కంగా,  ఆలోతనాత్మకంగా పరిష్కరించుకోగలుగుతారు.  శరీరంలో ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. సెల్ఫ్ నోట్.. మనసులో ఉన్న భావాలను,  మనసు పడే బాధను అక్షరరూపంలో రాస్తుంటే మనసు భారం చాలా వరకు తగ్గుతుంది.  వీటిని ఇలా రాస్తూ ఉంటే ఆ తరువాత ఎప్పుడైనా పునఃపరిశీలన చేసుకున్నప్పుడు ఆలోచనల పరంగా మారడానికి చాలా ఉపయోగపడతాయి.  అప్పట్లో నేను ఇలా ఉన్నాను, ఇప్పుడెందుకు ఇలా అయ్యాను.. అప్పట్లో ఇంత బాధలో ఉన్నాను.. ఇప్పుడు ధైర్యంగా ఉన్నాను.. ఇలాంటి మాటలు మనసుకు చాలా ఊరట ఇస్తాయి. హాబీ.. మానసిక సమస్యల నుండి, గతం గాయాల నుండి బయట పడాలంటే దానికి చక్కని మార్గం మనసుకు, మెదడుకు ఆలోచించే అంత సమయం ఇవ్వకపోవడం.  ఇందుకోసం  కొత్త పనులు, హాబీలు,  కొత్త విషయాలు నేర్చుకోవాలి.  దీని వల్ల రెండు లాభాలున్నాయి.  ఒకటి గతం గాయాలు మర్చిపోవడం, రెండవది కొత్త నైపుణ్యాలు సాధించడం ద్వారా జీవితంలో  ఆర్థిక భద్రతవైపు అడుగేయడం.                                       *రూపశ్రీ.
Publish Date: Dec 20, 2024 9:30AM

చలికాలంలో అరటిపండ్లు తినడం మంచిది కాదా?

  చలికాలంలో  తరచుగా ఆహారం మార్చుకుంటాం. ఈ సీజన్‌లో కొన్ని ఆహారాలు తినమని సలహా ఇస్తారు, కొన్ని తినవద్దని చెబుతారు. వీటిలో అరటిపండు ఒకటి. చలికాలంలో అరటిపండు తినకూడదని చాలా మంది చెబుతుంటారు.  మరికొందరు అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది, తింటే పర్లేదు అనుకుంటారు. చలికాలంలో అరటిపండు తినడం ఎంతవరకు సరైనదో, దాని వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏమిటో తెలుసుకుంటే.. అరటిపండు తినడం వల్ల చాలా మందికి శ్లేష్మం పెరగడం వల్ల జలుబు, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఆటంకం ఏర్పడుతుంది.  రొమ్ము భాగం అంతా చాలా భారంగా ఉంటుంది.   అరటిపండు చాలా తియ్యగా ఉంటుంది.  ఇది కాస్త పచ్చిగా ఉన్నప్పుడు పర్లేదు కానీ బాగా పండేకొద్దీ ఇందులో చక్కెరల శాతం ఎక్కువగా ఉంటుంది.  దీని కారణంగా అరటిపండులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి అరటి పండ్లను ఎక్కువ మోతాదులో తినడం వల్ల బరువు పెరుగుతారు . అరటి పండ్లు కాస్త దోరమాగనప్పటి కంటే పండే కొద్దీ  చాలా తియ్యగా మారుతుంది.  ఈ కారణంగా ఇందులో చక్కెరల శాతం ఎక్కువగా ఉంటుంది.  సాధారణ వ్యక్తులు దీన్ని రోజుకు ఒకటి లేదా రెండు పండ్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు.  ఇక డయాబెటిక్ రోగులు అరటిపండును పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అరటి పండు ఎప్పుడు తినకూడదంటే.. జలుబు, దగ్గు... మీకు జలుబు, దగ్గు లేదా జలుబు ఉంటే, మీరు అరటిపండు తినకుండా ఉండాలి, ఎందుకంటే కొంతమంది దాని వల్ల శ్లేష్మం పెరుగుతుందని ఫిర్యాదు చేయవచ్చు. రాత్రి.. రాత్రిపూట అరటిపండు తినడం మానుకోవాలి, ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి బరువును పెంచుతాయి. ఎన్ని అరటి పండ్లు తినవచ్చు.. రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లను తినవచ్చు. అయితే బరువు తగ్గాలనుకుంటే ఎక్కువ అరటిపండ్లను తినకూడదు. చలికాలంలో అరటిపండు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. అయితే, కొంతమందికి ఇది అలెర్జీ కావచ్చు. కాబట్టి, అరటిపండు తినే ముందు శరీర పరిస్థితిని బట్టి తినాలి,  ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించాలి.                                        *రూపశ్రీ.  
Publish Date: Dec 20, 2024 9:30AM

జమిలీ పై తొలిఅడుగు .. ఇక్కడ నుంచి ముందడుగు అనుమానమే!?

భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికల ప్రక్రియ లో తొలి అడుగు వేసింది. 129వ రాజ్యాంగ సవరణకు ప్రథమ అంకాన్ని పూర్తి చేసింది.  వారం క్రితం  వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేబినెట్  ఆమోదించిన అనంతరం దీనిని పార్లమెంట్ లో  ప్రవేశపెట్టింది.  220-148 ఓట్లతో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుమతి లభించింది. దాంతో జేపీసీ కి బిల్లు పంపడానికి మార్గం సుగమం అయింది. జాయింట్ పార్లమెంట్ కమిటీ ఈ బిల్లుపై కేవలం ప్రజలు,అధికారులు,మాజీ స్పీకర్లు తదితరుల  అభిప్రాయాలను సేకరిస్తుందే తప్ప నిర్ణయం తీసుకోదు. దానికి 90 రోజుల గడువు ఇస్తారు. అవసరమైతే గడువు పోడిగిస్తారు.ఈ కమిటీలో 31 మంది సభ్యులుంటారు. అత్యధికంగా అధికారపార్టీ సభ్యులు ఉంటారు. ఈ బిల్లుకు అనుకూలంగా తెలుగు రాష్ట్రాలలోని టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఓటు వేశాయి.  బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్,సమాజ్ వారీ పార్టీ, వామపక్షాలు సహా ఇండియా కూటమి పార్టీలు ఓటు వేశాయి.జమిలీ ఎన్నికలకు ఐదు రాజ్యాంగ సవరణలు చేయాలి. 129వ రాజ్యాంగ సవరణ చేయాలంటే సభలో మూడింట రెండు వంతుల మేజార్టీ లభించాలి.  .అలాగే 82ఏ నిబంధన, 83 నిబంధన, అసెంబ్లీ ఎన్నికల కాలపరిమితికి 172వ నిబంధన, 327 నిబంధన లకు పార్లమెంట్ ఆమోదిస్తేనే జమిలీ ఎన్నికలు సాధ్యమౌతుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ప్రస్తుత లోక్ సభ  ఎన్నికల తర్వాత రాష్ట్ర పతి గెజిట్ నోటిఫికేషన్ చేయాలి. అప్పటి నుంచి ఐదేళ్ల కాల పరిమితి లెక్కిస్తారు. ఆ తరువాతే జమిలి ఎన్నికలు .అంటే టెక్నికల్ గా 2034 వరకూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యం కాదు.  పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 67 శాతం మంది సభ్యుల  మద్దతు అవసరం. అంటే 362మంది లోక్ సభలో,164మంది రాజ్యసభలో ఈ బిల్లుకు మద్దతు పలకాల్సి ఉంటుంది. కాని 543 సభ్యులున్న లోక్ సభ లో ఎన్డీఏకు 293, ఇండియాకూటమి 234 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో245 సభ్యుల్లో ఎన్డీఏకు 125,మిగిలిన పార్టీలకు 88 మంది సభ్యుల బలం ఉంది. ఈ పరిస్థితుల్లో రెండు సభల్లో బిల్లు ఆమోదం పొందడం దాదాపు అసాధ్యం. ఈ బిల్లు చట్టమయితే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఇవి జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఒకే సారి జరుగుతాయి. కాని ఐదేళ్ల కాలపరిమితి లోగా అసెంబ్లీలో  అధికార పార్టీ బలం తగ్గితే ఏమి చేయాలన్న దానిపై స్పష్టత లేదు. .అలాగే పార్లమెంటులో హంగ్ ఏర్పడి మధ్యలో ప్రభుత్వం కుప్ప కూలితే మధ్యంతర ఎన్నికలకు అవకాశం ఉంటుందా? అప్పుడు అసెంబ్లీల పరిస్థితి ఏమిటని ప్రశ్నకూ సమాధానం లేదు. జమిలీ  ప్రస్తావన రాజ్యాంగంలో లేకపోవడం కూడా  ఒక అవరోధమేనని చెప్పాలి. అన్నిటికీ మించి జమిలి ఎన్నికలు అన్నది ఏదో కొత్తగా కొండను తవ్వి కనుగొన్నది కాదు.  స్వాతంత్య్రానంతరం 1952,1967లలో దేశంలో జరిగినవి జమిలి ఎన్నికలే. కనుక జమిలి అంటూ ఇప్పుడు బీజేపీ చేస్తున్న హడావుడి అఃసంబద్ధంగానే కనిపిస్తోంది. రాష్ట్రాలలో లేదా కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే పరిస్థితి ఏమిటన్నదానిపై స్పష్టత లేకుండా కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ చేస్తున్న హడావుడి ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 
Publish Date: Dec 20, 2024 9:09AM

వెంకటాపురం.. వంద శాతం తెలుగుదేశం సభ్యత్వం

ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచీ బలపడేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పార్టీ ఇప్పటికే అన్ని వర్గాల మద్దతూ సాధించింది. ఆ సంగతి ఇటీవల  టీడీపీ తన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నిర్ద్వంద్వంగా రుజువైంది. తెలుగుదేశం సభ్యత్వ నమోదు డ్రైవ్ ద్వారా దాదాపు 73 లక్షల మంది  పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వీరిలో   54శాతం మంది కొత్త వారే.  ఒక రాజకీయ పార్టీ సభ్యత్వ నమోదు లో ఇంత పెద్ద సంఖ్యలో కొత్త వారు సభ్యత్వం తీసుకోవడం ఒక రికార్డు అనుకుంటే..దానిని తలదన్నే రీతిలో ఒక గ్రామంలో మొత్తం జనాభా అంతా తెలుగుదేశం సభ్యులుగా నమోదు చేసుకోవడం ద్వారా నభూతో.. నభవిష్యతి అన్న రికార్డు కూడా తెలుగుదేశం వశమైంది. ఇంతకీ ఆ గ్రామం ఏదో తెలుసా.. దివంగత పరిటాల రవి స్వగ్రామం వెంకటాపురం.  ఆ  గ్రామంలోని ఓటర్లందరూ తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారు. ఇలా ఒక గ్రామంలో నమోదైన ఓటర్లందరూ పార్టీ సభ్యత్వం తీసుకుని అనితర తెలుగుదేశం పార్టీకి అనితర సాధ్యమనదగ్గ రికార్డును అందించారు.   వెంకటాపురంలో మొత్తం 581 మంది ఓటర్లు ఉండగా, వారిలో  11 మంది మరణించారు. మిగిలిన 570 మంది ఓటర్లు అందరూ తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారు. తద్వారా తెలుగుదేశం పార్టీ, పరిటాల కుటుంబం పట్ల తమకున్న అభిమానాన్ని చాటారు. ఈ విషయంపై రాప్తాడు ఎమ్మెల్యే, పరిటాల రవి భార్య పరిటాల సునీత మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత   ఈ ఘనత సాధించిన మొదటి గ్రామం వెంకటాపురం అని చెప్పారు. పార్టీ పట్ల, తమ కుటుంబం పట్ల ప్రజలు చూపుతున్న అభిమానానికి కృతజ్ణతలు తెలిపారు. 
Publish Date: Dec 20, 2024 6:32AM