తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత

తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేశారు.  సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ గడువు శనివారంతో ముగియనుండగా.. ఈనెల 20 నుంచి లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైద్యశాఖ ఇచ్చిన నివేదిక మేరకు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇకపై నిర్భందం అవసరం లేదని మంత్రివర్గం భావించినట్లు తెలుస్తోంది. రాత్రి కర్ఫ్యూ కూడా ఉండబోదని కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.

కాగా అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్థత తో, జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో, రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, సానిటైజర్ ఉపయోగించడం.. తదితర  కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని, అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు., ప్రజలు  సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర ప్రజలను కేబినెట్ కోరింది.

తెలంగాణలో మే 12 నుంచి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. మొదటి 10 రోజులు నాలుగు గంటలు మాత్రమే మినహాయింపు ఇచ్చి లాక్ డౌన్ అమలు చేశారు. తర్వాత కొన్ని రోజులు సడలింపు పెంచి.. మధ్యాహ్నం 1 గంట వరకు మినహాయింపులు ఇచ్చారు. గత 10 రోజుల నుంచి మాత్రం ఉదయం 6 గంటల నుంచి సాయత్రం 6గంటల (ప్రజలు ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట) వరకు సడలింపులతో కూడిన లాక్‌డౌన్ అమలులో ఉంది. పగటి పూట్ లాక్ డౌన్ తొలగించి.. నైట్ కర్ఫ్యూ విధిస్తారని భావించారు. కాని కేబెనిట్ సమావేశంలో మాత్రం పూర్తిగా లాక్ డౌన్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

సీఎం కేసీఆర్‌ జూన్ 20 జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ అంశం తెలంగాణ కేబినెట్ లో చర్చకు వచ్చింది. సిద్దిపేట, కామారెడ్డిలో సీఎం ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. 21న వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తారు. ఇక 22న తన దత్తత గ్రామం వాసాలమర్రికి వెళ్లనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి.. భవిష్యత్‌లో చేయాల్సిన పనులపై గ్రామస్తులతో సీఎం చర్చించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లు ఈ భేటీలో చర్చకు వచ్చాయి . సాగునీటి అంశాలతోపాటు, ఏపీ నిర్మిస్తోన్న ప్రాజెక్టులపైనా తెలంగాణ క్యాబినెట్లో చర్చ జరిగింది.