పింక్ డైమండ్ కథేంటో తేల్చండి మహాప్రభో.. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు లేఖ 

గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి ఆభరణాల్లోని పింక్ డైమండ్ మాయమైందని అప్పటి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో వైసిపి నాయకులు విజయ సాయి రెడ్డి ఐతే ఏకంగా చంద్రబాబు ఇంట్లో వెతికితే దొరుకుతుందని కూడా సీరియస్ కామెంట్స్ చేసిన సంగతి కూడా తెలిసిందే.

 

ఐతే తాజాగా తిరుమల శ్రీవారి ఆభరణాల్లో మాయమైనందంటున్న పింక్‌ డైమండ్‌ కథేంటో తేల్చాలని తిరుపతికి చెందిన న్యాయవాది విద్యాసాగర్‌ కేంద్ర విజిలెన్స్‌ కమిషన్ ‌(సీవీసీ) కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అయన చీఫ్‌ విజిలెన్స్ ‌ కమిషనర్‌కు ఆదివారం ఒక లేఖ రాశారు. శ్రీవారి ఆభరణాలలో అసలు పింక్‌ డైమండ్‌ ఉందా లేదా.. జెనీవా లో వేలం వేసిన వజ్రం తిరుమల శ్రీవారిదో కాదో సీబీఐ లేదా డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) తో విచారణ జరిపించాలని అయన కోరారు. ఒకవేళ ఈ డైమండ్‌ విదేశాలకు వెళ్లి ఉంటే దానిపై దర్యాప్తు చేయడానికి స్థానిక పొలిసు అధికారుల పరిధి సరిపోదని.. కేవలం కేంద్ర ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఈ పని చేయగలవని అందుచేత వాటితోనే దర్యాప్తు చేయించి అసలు సంగతేంటో తేల్చాలని అయన ఆ లేఖలో కోరారు.

 

"తిరుమల ఆలయంలో ప్రధాన అర్చకుడిగా నలభై ఏళ్లపాటు చేసిన రమణ దీక్షితు లు స్వామి వారికి మైసూర్‌ మహారాజులు బహుకరించిన పింక్‌ డైమండ్‌తో కూడిన ఆభరణాలను తానే అలంకరించానని అప్పట్లో మీడియాకు చెప్పారు. అయితే ఆ డైమండ్‌ దేశం దాటి వెళ్లిందని, స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో దానిని రూ.500 కోట్లకు వేలం వేశారని కూడా అయన ఆరోపించారు. చాలా కాలం క్రితం అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి.. విజిలెన్స్‌ అధికారి రమణకుమార్ తో స్వామివారి ఆభరణాలపై విచారణ జరిపించింది. ఆయన ముందు కూడా రమణ దీక్షితులు, నరసింహ దీక్షితులు పింక్‌ డైమండ్‌ ఉండాలని చెప్పారు. తన నివేదికలో రమణకుమార్‌ దీనిని ప్రస్తావించారు. కానీ ఆ తర్వాత ఆయన మాట మార్చి.. తనను ఇద్దరు అర్చకులు తప్పుదోవ పట్టించారని చెప్పారు. 2009లో అప్పటి టీటీడీ ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూ ర్తి వాధ్వాతో స్వామివారి ఆభరణాలపై విచారణ చేయించారు. ఆ తర్వాత రాష్ట్రప్రభుత్వం కూడా విడిగా జగన్నాథరావు కమిషన్‌తో ఇదే అంశంపై విచారణ జరిపించింది. ఈ రెండు విచారణ సంఘాలు లోతుగా విచారణ జరిపి అక్కడ పింక్‌ డైమండ్‌ అనేది లేనే లేదని తేల్చాయి. ఇదే సమయంలో ఆర్కిలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థకు చెందిన చెన్నారెడ్డి అనే అధికారి కూడా దీనిపై విచారణ జరిపి స్వామివారికి మహారాజాలు సమర్పించిన ఆభరణాల్లో కొన్ని కనిపించడం లేదని నివేదిక ఇచ్చారు. అయితే పింక్‌ డైమండ్‌ ఉందని రమణ దీక్షితులు అప్పట్లో ఫొటో లు కూడా చూపించారు.

 

దీంతో ఎవరి మాటలను నమ్మాలో ఇటు ప్రజలకు, అటు భక్తులకు అర్థంకాని సమస్యగా మారింది. ఒకవేళ రమణ దీక్షితులు కనుక అబద్ధం చెబుతుంటే ఎవరి ప్రోద్బలంతో అయన లా చెబుతున్నారో కూడా తేలాలి. తాజాగా తిరుమల ఆలయానికి అనుబంధంగా ఉన్న కోదండరామస్వామి ఆలయం, గోవిందరాజులస్వామి ఆలయంలో ఇటీవల ఆభరణాలు, కిరీటాలు చోరీ అయిన ఘటనలు కూడా వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం పై సమగ్ర విచారణ జరిపించి ఇందులో నిజానిజాలు వెలికి తీసి భక్తుల అనుమానాలు నివృత్తి చేయాలి" అని విద్యాసాగర్‌ సీవీసీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.