న్యాయం కోసం సంతకాలు చేద్దామా!! 

ఈ ప్రపంచంలో ఏ విషయం ను అయినా రెండు కోణాల్లో చూస్తారు. ఒకటి న్యాయం, రెండోది అన్యాయం. ముఖ్యంగా భారదేశానికి చట్టాలు ఏర్పడ్డాక ప్రతి విషయంలోనూ, ప్రతి పనిలోనూ ప్రతి వ్యవస్థలోనూ న్యాయాన్ని కాపాడటానికి న్యాయవ్యస్థను ఏర్పాటు చేసి, న్యాయం కోసం కృషి చేస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1949 సంవత్సరం నవంబర్ 26 వ తేదీన తొలి ముసాయిదా కమిటీ సభ్యులు సంతకాలు చేశారు. అదే 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. రాజ్యాంగ మౌలిక లక్ష్యం ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాన్ని అందరికీ అందించడం. అలా ముసాయిదా కమిటీ సంతకాలు చేసిన ఆరోజును జాతీయ న్యాయదినోత్సవంగా జరుపుకోవాలని సుప్రీంకోర్టు ప్రకటించింది. అదే నేటి నేషనల్ లా డే. 

న్యాయం ఎక్కడ!!

న్యాయం ఎక్కడుంటుంది అంటే కోర్ట్ లో మాత్రమే అనుకోవడం పొరపాటు. ఈ న్యాయ దినోత్సవం అర్థం న్యాయవాదులు న్యాయం రక్షించడం కోసం కృషి చేయడమే కావచ్చు కానీ నిజానికి ప్రస్తుతం న్యాయాన్ని కూడా కొనుక్కోవాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే తయారయ్యాయి. అందుకే ప్రతి ఒక్కరూ న్యాయాన్ని డబ్బులు పెట్టి కొనేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చేదు నిజం ఏమిటంటే డబ్బు పెట్టి ఏది నమ్మిస్తే అదే న్యాయం అయిపోవడం. అంటే అన్యాయాన్ని కూడా డబ్బు పెట్టి న్యాయంగా మార్చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రస్తుత సమాజంలో కోకొల్లలు. 

మరేం చేద్దాం!!

న్యాయానికి నల్లకోటు ప్రామాణికం కాదు అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. నిజానికి అందరికీ తెలుసు కూడా కానీ తెలియనట్టే ఉంటారు. ఈ సమాజంలో, మన చుట్టుపక్కల జరుగుతున్న ఎన్నో విషయాలు, అవకతవకలు మొదలైన వాటిని ఎవరి శక్తి మేరకు వాళ్ళు పరిష్కరిస్తూ, తమ ప్రమేయం ఉన్న ఏ విషయంలో అయినా నీతిగా ఉండటం అందరూ చేయదగిన పని.

న్యాయం కోసం!!

చాలామంది కొన్ని విషయాలు నేరుగా చూసి అందులో తమ పాత్ర ఉన్నా ఏదో నష్టం జరుగుతుందనో లేక మనకెందుకులే అనే ఆలోచనతోనో ఆ విషయాన్ని చూసి చూడనట్టు ఉంటారు. అది ఎంత తప్పో చాలామందికి అర్థం కాదు. తమ మాట వాళ్లకు ఎంత గొప్ప పరిష్కారాన్ని చూపిస్తుందో అర్థం కాదు. ఎప్పుడో పాఠశాలల్లో చదువుకున్న ఐకమత్యం అనే విషయాన్ని జీవన సరళిలో ఎప్పుడో వదిలేసుకున్న మహానుభావులం మనం. ప్రతీది ఆర్థిక కోణంలో చూసే ఆర్థికశాస్త్ర విశ్లేషకులం. ఇంకా చేస్తున్న పనులను సమర్థించుకుంటూ వాటికి ఉదాహరణలు కూడా బయటకు చెప్పగల గొప్ప ప్రవచనాకారులం. ఇలాంటి మన మధ్య న్యాయం కావాలంటే అంత సులువుగా దొరుకుతుందా??

నమ్మకాల వంతెన!!

నిజానికి న్యాయానికి, నమ్మకానికి ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది. కానీ నమ్మకం ఉన్నచోట న్యాయానికి వెక్కిరింపు ఎదురవుతుంది కూడా. ఎన్నో సమస్యలను ఎదుర్కొని మరీ సహాయం చేసిన చోట ఇచ్చిన నమ్మకాన్ని, పొందిన సహాయాన్ని మరచి నమ్మకద్రోహం జరిగితే ఎవరూ న్యాయం కోసం ముందుకు రారు. ఉదాహరణకు ఈమధ్య కాలంలో కొందరు ఉద్యోగస్తులు లోన్ల విషయంలో ష్యురిటీ సంతకాలు పెట్టడానికి జంకుతున్నారు కారణం తీసుకున్నవారు  వాటిని కట్టడానికి వెనుకడుగు వేసి కట్టడం వదిలేస్తే సంతకాలు పెట్టిన సగటు వ్యక్తిని ఆ సంస్థ వారు కోర్ట్ ల చుట్టూ తిప్పి ఎన్నో ఇబ్బందులకు గురిచేయడం. నమ్మకంతో సంతకాలు పెట్టిన సగటు వ్యక్తికి జీవితమే ప్రశ్నార్థకమైతే మరెక్కడ న్యాయం.కాబట్టి ఇలాంటి  విషయాలలో పూర్వపరాలు పరిశీలించి కోర్ట్ వారు ఇచ్చే తీర్పు సగటు న్యాయమైన వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరూ ఎవరికి వారు బాధ్యతగా ఉండాల్సిన అవసరం అందరిపైనా ఉంది.


◆ వెంకటేష్ పువ్వాడ