ఆ అరెస్టు వెనుక భారీ కుట్ర!?

దేశ రాజ‌కీయాల్లో అత్యంత పలుకుబడి, విశ్వసనీయత   క‌లిగిన అతికొద్ది మంది నేత‌ల్లో ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు ఒక‌రు. ఆయ‌న హ‌యాంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ, ఆ  త‌రువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లోనూ అభివృద్ధి పరుగులు పెట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని యువ‌త నేడు ఐటీ రంగంలో ప్ర‌పంచ వ్యాప్తంగా రాణిస్తున్నారంటే అందుకు చంద్రబాబు దార్శనికతే కారణం అనడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.  చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్నారంటే అధికారులు  ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని ప‌ని చేస్తారు. తాను నిజాయితీగాఉంటూ, త‌న ప‌రిధిలో ప‌ని చేసే ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు నిజాయితీగా ప‌నిచేసేలా చంద్ర‌బాబు పాల‌న ఉంటుంది. అలాంటి నిజాయితీ క‌లిగిన, నిబద్ధత ఉన్న నేత‌ను వైసీపీ  హ‌యాంలో అనేక ఇబ్బందుల‌కు గురి చేశారు. అక్ర‌మ కేసులు పెట్టి 53 రోజులు జైల్లో  పెట్టారు. జైల్లోనూ స‌రైన సౌక‌ర్యాలు క‌ల్పించకుండా నానా ఇబ్బందులూ పెట్టారు.   చంద్ర‌బాబు జైల్లో ఉన్న స‌మ‌యంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాక‌, దేశ వ్యాప్తంగా, ప్ర‌పంచం నలుమూలలా తెలుగు వారు ఉన్న ప్రతి దేశంలోనూ ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చి ఆయ‌న అరెస్టును ఖండిస్తూ నిరసనలకు దిగారు. వైసీపీ ప్ర‌భుత్వం అక్ర‌మ కేసులు బ‌నాయించి చంద్ర‌బాబును అరెస్టు చేసింద‌ని తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 53 రోజుల త‌రువాత బెయిల్ రావ‌డంతో చంద్ర‌బాబు జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే, అప్ప‌ట్లో చంద్ర‌బాబు అరెస్టు వెనుక భారీ కుట్ర జ‌రిగింద‌న్న విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.  2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టారు. ఐదేళ్ల పాల‌న‌లో అవినీతి, అక్ర‌మాల‌తో పాటు.. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్టి జైళ్ల‌కు పంపించారు. దోచుకోవడం, దాచుకోవడం, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపే పాలన అన్న చందంగా జగన్ హయాంలో అరాచకం రాజ్యమేలింది. ముఖ్యంగా జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించిన నాటి నుంచి చంద్ర‌బాబు నాయుడును అరెస్టు చేసి జైలుకు పంపించాల‌న్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా చంద్ర‌బాబు త‌న హ‌యాంలో త‌ప్పు చేసిన‌ట్లు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఆధారాలు దొర‌క‌లేదు. దీంతో స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కేసులో చంద్ర‌బాబును అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైల్లో చంద్ర‌బాబును హ‌త‌మార్చేందుకు కుట్ర‌లు సైతం జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత చంద్ర‌బాబు ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించాడు. త‌న‌కు స‌రైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌కుండా ఇబ్బందులు పెట్టార‌ని, ఒకానొక స‌మ‌యంలో త‌న‌ను హ‌త‌మార్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిగిన‌ట్లు అనుమానం వ్య‌క్తం చేశారు. అప్ప‌ట్లో చంద్ర‌బాబుపై పెట్టిన కేసులు అక్ర‌మేన‌ని మెజార్టీ ప్ర‌జ‌లు న‌మ్మారు. ప్ర‌స్తుతం అదే నిజమ‌వుతోంది. స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కేసులో నాటి ప్ర‌తిప‌క్ష  నేత చంద్ర‌బాబు నాయుడును అరెస్టు చేయ‌డం వెనుక పెద్ద కుట్ర జ‌రిగింద‌ని సీనియ‌ర్ ఐఏఎస్‌, నాటి ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పీవీ ర‌మేశ్ తాజాగా స్ప‌ష్టం చేశారు.  చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స్కిల్ డెవ‌ల‌ప్ మెట్ ప్రాజెక్టు ద్వారా 2016-19 మ‌ధ్య కాలంలో నాలుగు ల‌క్ష‌ల మంది నిరుద్యోగ యువ‌త‌, విద్యార్థుల‌కు నైపుణ్య శిక్ష‌ణ ఇచ్చింది. ఇంజ‌నీరింగ్‌, పాలిటెక్నిక్, ఇత‌ర కాలేజీల్లో వంద‌ల కోట్ల విలువైన మౌలిక స‌దుపాయాలు, ల్యాబ్ లు ఏర్పాటుచేసి శిక్ష‌ణ కేంద్రాలు నెల‌కొల్పింది. ఈ శిక్ష‌ణ కేంద్రాల ద్వారా సుమారు 1.82  ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు ల‌భించాయి. అయితే, ఈ ప‌థ‌కంలో రూ. 241 కోట్ల నిధులు చేతులు మారి సూట్‌కేసు కంపెనీల‌కు వెళ్లాయ‌ని, దీనికి నాటి సీఎం చంద్ర‌బాబు నాయుడే ప్ర‌ధాన కార‌కుల‌ని గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిరూపించాల‌నుకుంది. ఈ క్ర‌మంలో ఆయ‌న‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించింది. చంద్ర‌బాబు అరెస్టు చేయ‌డం కోసం సీఎంవో, సీఐడీ, స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ శాఖ‌ల్లో పైళ్ల‌ను మాయం చేశార‌ని, ఏక‌కాలంలో మూడు విభాగాల్లో పైళ్లు క‌నిపించ‌కుండా పోయాయ‌ని  ఓ తెలుగు మీడియా న్యూస్ ఛాన‌ల్ జ‌రిపిన‌ డిబేట్ లో పీవీ ర‌మేశ్ స్ప‌ష్టం చేశారు. అలాగే  నిధుల విడుదలకు సంబంధించి అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు ఆదేశించారని, తాను స్టేట్మెంట్ ఇచ్చానంటూ జగన్ సర్కార్ తప్పుడు సమాచారం ఇచ్చిందని పీవీ రమేష్ చెప్పారు.   ఇదే విషయాన్ని  తాజాగా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి మంగళవారం (నవంబర్ 19) ప్ర‌స్తావించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో  అప్ప‌ట్లో చంద్ర‌బాబు నాయుడు అరెస్టు వెనుక భారీ కుట్ర జ‌రిగింద‌ని, అప్పటి సీఎంవో, సీఐడీ, స్కిల్ అధికారులు కలిసి కీలక ఫైళ్లు మాయం చేశారని అసెంబ్లీలో శ్రీ‌ధ‌ర్ రెడ్డి ప్ర‌స్తావించారు. చంద్రబాబులాంటి జాతీయ స్థాయి నేత‌కే అలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని అసెంబ్లీలో ప్రశ్నించారు. చంద్ర‌బాబుకు వ్యతిరేకంగా జరిగిన కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉందని, అవ‌స‌ర‌మైతే జీరో అవ‌ర్ ను నిలిపివేసి, ఈ విష‌యంపై అసెంబ్లీలో ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌జ‌ర‌పాల‌ని, చంద్ర‌బాబు కుట్ర వెనుక కుట్ర‌దారుల‌ను అరెస్టు చేయాల‌ని శ్రీ‌ధ‌ర్ రెడ్డి స‌భ‌ దృష్టికి తీసుకెళ్లారు. అంతే కాదు.. చంద్ర‌బాబు జైల్లో ఉన్న స‌మ‌యంలో.. బాబు జైలు గ‌దిలో ఏం చేస్తున్నారో తాడేప‌ల్లి ప్యాలెస్ నుంచి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వీక్షించే వార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ సందర్భంగా వైసీపీ రెబల్ ఎంపీ,  ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును అప్పట్లో జగన్ సర్కార్ కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పట్లో రఘురామకృష్ణం రాజును కస్టడీలో చిత్రహింసలకు గురి చేస్తూ ఆ దృశ్యాలను వీడియో కాల్ ద్వారా జగన్ కూ చూపించారు. ఈ విషయాన్ని రఘురామకృష్ణం రాజు పలు సందర్భాలలో చెప్పారు. దానిని బట్టి చూస్తే చంద్రబాబును జైల్లోఇబ్బందులు పెడుతున్న దృశ్యాలను కూడా జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి చూసి రాక్షసానందం పొందేవారన్న ఆరోపణలు వాస్తవమే అనిపించక మానదు.  మొత్తానికి చంద్ర‌బాబు అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ అరెస్టు చేసి జైలుకు పంపించిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం, అందుకు త‌గ్గట్లుగా ఎటువంటి ఆధారాలనూ  కోర్టుకు స‌మ‌ర్పించ‌లేక పోయింది. తాజాగా చంద్ర‌బాబు అరెస్టు వెనుక భారీ కుట్ర జ‌రిగింద‌ని ఆధారాలు  వెలుగులోకి వ‌స్తుండ‌టంతో.. కుట్ర‌దారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ వినిపిస్తోంది. అసెంబ్లీలో ఈ అంశంపై చ‌ర్చించి స‌భ విచార‌ణ‌కు ఆదేశిస్తే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న అనుచ‌రులు, కుట్ర‌లో భాగ‌మైన అధికారులు జైలు ఊచలు లెక్కించ‌డం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.
Publish Date: Nov 20, 2024 5:58AM

వరంగల్ స్మశాన వాటికలో కోడిని బలి ఇచ్చి అఘోరీ వింత పూజలు

మంగళగిరి జనసేన కార్యాలయం సమీపంలో నానా రచ్చచేసిన అఘోరీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.  వ్యక్తిగత బెయిల్ పై బయటకు వచ్చిన ఆమె వరంగల్ స్మశానవాటికలో ప్రత్యక్షమైంది. శవం దగ్గర ఆమె పూజలు చేసి కోడిని బలి ఇచ్చింది.  మంగళవారం రాత్రి ప్రారంభమైన ఈ క్రతువును  చూడటానికి భక్తులు స్మశానవాటికకు చేరుకుంటున్నారు. . కొన్ని రోజుల క్రితం   వరంగల్ భద్రకాళీ దేవాలయంలో  పూజలు చేసిన అఘోరీ  మంగళవారం వరంగల్ స్మశానవాటికలో  పూజలు చేస్తుంది. రాత్రి పూట స్మశానవాటికలో పూజలు చేయడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. స్మశాన వాటిక సిబ్బంది వారించినప్పటికీ అఘోరీ వినడం లేదు. శవాన్ని కాల్చిన చోట పూజలు చేసి చితాభస్మం రాసుకుంది. తాంత్రిక పూజలు చేస్తుందన్న భయంతో స్థానికులు ఆమె దగ్గరకు వెళ్లడానికి జంకుతున్నారు. 
Publish Date: Nov 19, 2024 9:00PM

 తెలంగాణ  బిజెపీ  సారథిగా ఎన్ రామ్ చందర్ రావు ?

తెలంగాణ బిజెపి  అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ పదవికి ఈటెల రాజేందర్ పేరు వినిపించినప్పటికీ ఆయన మల్కాజ్ గిరి లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందడంతో కేంద్రమంత్రి పదవి లభిస్తుందని అందరూ ఊహించారు. అయితే ఆయనకు కేంద్రమంత్రి పదవి వరించలేదు. బండి సంజయ్ కు ఈ పదవి వరించడంతో ఈటెల తీవ్ర నిరాశ చెందారు. ఇదే సమయంలో బిజెపి నూతన సారథి ఈటెల అని ప్రచారం జరిగింది. అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు పేరు తెరపైకి వచ్చింది. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రాంచందర్ రావు బిజెపీలో సీనియర్ నేత. పార్టీలో ఆయనకు మంచి పేరు ఉంది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచి సంచలనం రేపారు. అంతేకాదు మల్కాజ్ గిరి ఎంపీగా  రెండు సార్లు బీజేపీ తరుపున ఎన్నికల బరిలో నిలిచారు. ఈటెలకు బదులు డికె అరుణ, రఘునందన్ రావు పేర్లు కూడా వినిపించాయి.  సుప్రీంకోర్టు న్యాయవాది అయిన రాంచందర్ రావు నల్గొండ జిల్లా వాస్తవ్యుడు. చట్టాలపై మంచి అవగాహన ఉన్న రాంచందర్ రావు పార్టీకి విధేయుడిగా పేరు ఉంది. ఆయన గత లోకసభ ఎన్నికలలో మల్కాజ్ గిరిస్థానం నుంచి పోటీచేయాలనుకున్నారు. ఈటెల పేరు ఖరారు కావడంతో డ్రాప్ అయ్యారు
Publish Date: Nov 19, 2024 4:52PM

లగచర్ల దాడి కేసులో లొంగిపోయిన ఎ 2 సురేశ్

లగచర్ల దాడి కేసులో ఎ 2గా ఉన్న సురేశ్ కొడంగల్ కోర్టులో లొంగిపోయాడు. ఈ నెల 11 నుంచి సురేశ్ పరారీలో ఉన్నాడు. అతనిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి.  ఇదే కేసులో ఎ1 గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్  రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలుకు తరలించారు. కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కారు  నిర్ణయించింది. ఈ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేసే క్రమంలో వికారాబాద్ కలెక్టర్ పై దాడి జరిగింది. గ్రామస్థులను సురేశ్ రెచ్చగొట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సురేశ్ కెటీఆర్ కు అత్యంత సన్నిహితుడు.   దాడికి ముందు పలుమార్లు కెటీఆర్ , పట్నం నరేందర్ రెడ్డితో సురేశ్ మాట్లాడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా లగచర్ల సంచలనమైంది. 
Publish Date: Nov 19, 2024 4:41PM

కేసీఆర్, హరీష్, కేటీఆర్ ల అరెస్టుకు ముహూర్తం ఫిక్సయ్యిందా?

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్  ఈ నెలాఖరులో  మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విచారించనున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలపై విచారణ జరిపేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నెల 21 న మరోసారి హైదరాబాద్ రానుంది. వచ్చే నెల అంటే డిసెంబర్  5 వరకు ఇక్కడే ఉండి పలువురిని విచారించనుంది. అన్నిటికీ మించి ఇప్పటి వరకూ అధికారుల విచారణకే పరిమితమైన కమిషన్ ఇక ముందు రాజకీయ నేతల నిర్వాకం పై దృష్టి సారించి వారినీ విచారణకు పిలిచే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావును కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచీ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అవకతవకలపై గురిపెట్టింది. అందులో భాగంగానే అధికారంలో ఉండగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును టార్గెట్ చేసింది.  కాళేశ్వరం విషయంలో జరిగిన అవకతవకలకు కేసీఆర్, హరీష్ రావులను, ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అక్రమాలకు కేటీఆర్ ను బాధ్యులుగా చట్టం ముందుక నిలబెట్టే లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకు సాగుతోంది.  కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసి ఘోష్ కమీషన్‌ ఈ నెలాఖరులోగా లేదా డిసెంబర్‌ మొదటి వారంలో మాజీ నీటిపారుదల, ఆర్ధిక శాఖల మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఆ తరువాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వంతు అని తెలుస్తోంది.  అంతే కాకుండా యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌ఘడ్‌ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో అవకతవకలపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్‌ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కమిషన్ గతంలోనే  మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో మదన్ బి లోకూర్ కమిషన్ కు విచారణ అర్హతే లేదంటూ కేసీఆర్ లేఖ రాశారు. ఆ కమిషన్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టుకు  కూడా వెళ్లారు. అయితే సుప్రీం కోర్టు కేసీఆర్ పిటిషన్ ను కొట్టేసింది. ఇప్పుడు ఇక కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసి ఘోష్ కమిషన్ నోటీసులకు కేసీఆర్ స్పందించి విచారణకు హాజరౌతారా అన్నది తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక   ఫార్ములా1 రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌ని అరెస్ట్ చేయడం ఖాయమని ముఖ్యమంత్రి, మంత్రులు బాహాటంగానే చెబుతున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ అగ్రనేతలు ముగ్గురికీ ఏక కాలంలోనే చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
Publish Date: Nov 19, 2024 4:39PM

విశాఖలో న్యాయ విద్యార్థిపై గ్యాంగ్ రేప్ 

విశాఖపట్నంలో న్యాయవిద్యార్థిపై గ్యాంగ్ రేప్ జరిగింది.  నలుగురు  యువకులు సామూహిక అత్యాచారానికి  పాల్పడ్డారు.  విశాఖ పట్నం రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి న్యాయవిద్యార్థిపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు వెలుగులోకి వచ్చింది.  ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీసి న్యాయవిద్యార్థిని ఆ యువకులు కొన్ని నెలలుగా  బ్లాక్ మెయిల్ చేసినట్టు సమాచారం. గత రాత్రి కూడా అవే ఫోటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసినట్టు తెలుస్తోంది.  రాత్రంతా నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ జరపడంతో ఆ యువతి పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఘటనపై  రాష్ట్ర హోం మంత్రి   అనిత  సీరియస్ అయ్యారు. విశాఖ పోలీస్ కమిషనర్ పై అగ్రహం వ్యక్తం చేసారు.  ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని హోం మంత్రి హెచ్చరించారు. న్యాయ విద్యార్థితో సన్నిహితంగా ఉన్న యువకుడే ఈ గ్యాంగ్ రేప్ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అందరూ మేజర్లేనని అన్నారు. 
Publish Date: Nov 19, 2024 4:09PM