రేవంత్ రెడ్డి.. దమ్ముంటే డిపాజిట్ తెచ్చుకో! 

హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ లో తిరుగుబాటు తప్పదని, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ పై తిరుగుబాటు చేయబోతోంది ఎవరు, గులాబీ పార్టీలో ఏం జరగబోతోంది అన్న చర్చ జరుగుతోంది. రేవంత్ వ్యాఖ్యలతో పార్టీలో అలజడి రేగే ప్రమాదం ఉందని గ్రహించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తూనే కీలక వ్యాఖ్యలు  చేశారు. 

రేవంత్ రెడ్డికి ద‌మ్ముంటే డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ చేశారు కేటీఆర్. తెలంగాణ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం జ‌ర్న‌లిస్టుల‌తో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ క‌చ్చితంగా గెలుస్తుంద‌న్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మ‌క్క‌య్యాయి. ఈట‌ల కోసం కాంగ్రెస్ డ‌మ్మీ అభ్య‌ర్థిని నిల‌బెట్టింద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి ద‌మ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోవాల‌ని కేటీఆర్ స‌వాల్ చేశారు. కొంత‌కాలం త‌ర్వాత ఈట‌ల‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారని చెప్పారు. మాజీ ఎంపీ వివేక్ కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తార‌ని వినిపిస్తోంది అని కేటీఆర్ అన్నారు. 

తెలంగాణ ప‌థ‌కాలు దేశానికి దిక్సూచిగా మారాయన్నారు కేటీఆర్.  కేసీఆర్ విజ‌న‌రీ నేత‌.. మిగ‌తా పార్టీల నేత‌లు టెలివిజ‌న‌రీలు. రేవంత్ రెడ్డి చిల‌క‌జోస్యం చెప్పుకుంటే మంచిదన్నారు.  కాంగ్రెస్ పార్టీలో భ‌ట్టి విక్ర‌మార్క ఒక్క‌రే మంచి వ్య‌క్తి అని  కానీ కాంగ్రెస్‌లో భ‌ట్టిది న‌డ‌వ‌ట్లేదని చెప్పారు. గ‌ట్టి అక్ర‌మార్కుల‌దే న‌డుస్తోంది అని కేటీఆర్ అన్నారు.

టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి కేసీఆర్‌ను ప్ర‌తిపాదిస్తూ 10 నామినేష‌న్లు దాఖ‌లు అయ్యాయని చెప్పారు. ద్విద‌శాబ్ది వేడుక‌కు స‌న్నాహ‌కాలు జ‌రుగుతున్నాయన్నారు. విజ‌య‌గ‌ర్జ‌న స‌భ‌కు భారీగా ఆర్టీసీ బ‌స్సులు తీసుకుంటామని తెలిపారు. న‌వంబ‌ర్ 15న ప్ర‌జ‌లు ప్ర‌యాణాలు పెట్టుకోవ‌ద్దు అని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.. 20 రోజుల్లో కొవిడ్ వ్యాక్సినేష‌న్ 100 శాతం పూర్త‌వుతుంద‌ని కేటీఆర్ తెలిపారు.