ఏపీ ప్రభుత్వానికి షాక్.. ప్రాజెక్టులు ఆపాలని కృష్ణా బోర్డు ఆదేశం

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని జల వివాదంలో కీలక పరిణామాం చోటు చేసుకుంది. తెలంగాణ సర్కార్ ఫిర్యాదుపై కృష్ణా నది మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ స్పందించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ముందుకు వెళ్లకూడదని తెలిపింది. దీనిపై డీపీఆర్‌ సమర్పించాలని కృష్ణా మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ సూచించింది. . డీపీఆర్ ఇవ్వకుండా, అత్యున్నత మండలి ఆమోదం లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టరాదని బోర్డు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ, ఫొటోలను దీనికి జత చేసింది బోర్డ్‌. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శికి బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా లేఖ రాశారు. పనులు చేపట్టవద్దంటూ ఫిబ్రవరిలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను ఈ లేఖలో హరికేశ్ మీనా గుర్తు చేశారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు జరుగుతున్నాయో, లేదో చెప్పాలని అప్పట్లో జాతీయ హరిత ట్రైబ్యునల్ కృష్ణాబోర్డు నిపుణుల కమిటీని ఆదేశించింది. అయితే, నిపుణుల కమిటీ పర్యటనకు ఏపీ అవకాశం ఇవ్వడం లేదన్నారు  మీనా. ఎన్జీటీ ఆదేశాల ఉల్లంఘన జరుగుతుందా లేదా అన్న విషయాన్ని తేల్చేందుకు బోర్డుకు ఏపీ సహకరించలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను సమర్పించాలని, అది ఆమోదం పొందాకే ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లాలని ఆ లేఖలో స్పష్టం చేశారు. 

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ జలవివాదం రాజేసుకుంది.  ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలోనే కృష్ణనదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బోర్డు చైర్మన్‌కు నీటిపారుదల శాఖ స్పెషల్‌ సెక్రటరీ రజత్‌ కుమార్ లేఖ రాశారు. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పోతిరెడ్డిపాడు విస్తరణ పనులపై ఫిర్యాదు చేసింది. ఎన్జీటీ స్టే విధించినా పనులు కొనసాగుతున్నాయని, కృష్ణా బోర్డు వాటిని అడ్డుకోలేకపోయిందని తెలంగాణ ప్రభుత్వం లేఖలో పేర్కొంది.

ఏపీ చర్యలతో తెలంగాణలో కృష్ణా బేసిన్‌లో ఉన్న కరవు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతుందని తెలంగాణ కేబినెట్ పేర్కొందని లేఖలో రజత్ కుమార్ తెలిపారు. డీపీఆర్‌లు సమర్పించకుండా ఎటువంటి పనులు చేపట్టారదాని గతంలోనే జలశక్తి శాఖ స్పష్టం చేసిందని ఈ సందర్భ్మగా గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను తక్షణమే ఆపాలని తెలంగాణ నీటిపారుదలశాఖ స్పెషల్ సెక్రెటరీ రజత్ కుమార్ కోరారు.