తెలుగు రైతుపై కన్నడ కాంట్రాక్టర్ పైశాచికం
posted on Feb 6, 2017 5:12PM

పరిహారం పెంచండి అన్న పాపానికి తెలుగురైతును గాలిలో వేలాడదీశాడు కర్ణాటకకు చెందిన కాంట్రాక్టర్. అసలు వివరాల్లోకి వెళితే..అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు అతి సమీపంలో ఉంటుంది. తుముకూరు జిల్లా మధుగిరి నుంచి పావగడకు ఓ హైటెన్షన్ లైను వేసే ప్రాజెక్ట్‌ను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించింది కర్ణాటక ప్రభుత్వం..ఈ నేపథ్యంలో దాని నిర్మాణం కోసం ఏపీ సరిహద్దు గ్రామాల మీదుగా 220 కేవీ టవర్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో మడకశిర మండలం మెళవాయి గ్రామ రైతు నబీరసూల్ పొలంలో కర్ణాటక విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా హైటెన్షన్ వైర్లు వెళుతున్న పొలాలకు చెందిన రైతులకు నష్టపరిహారం ప్రకటించారు.
అయితే నబీరసూల్ అనే రైతు తనకు తగిన నష్టపరిహారం దక్కలేదంటూ కుమారుడితో కలిసి పనులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తగిన నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేయడానికి వీల్లేదంటూ తండ్రికొడుకులు ఇద్దరూ తీగలను పట్టుకున్నారు. ఈ దశలో కనీసం వారిని పట్టించుకోకుండానే జేసీబీతో వైర్లను లాగివేశారు.. దీంతో 15 అడుగుల ఎత్తు వరకు వైర్లను పట్టుకున్న తండ్రి ఇక శక్తి లేక వదిలివేయటంతో కింద పడిపోయాడు. అయితే కుమారుడు వన్నూర్‌సాబ్ మాత్రం తీగను పట్టుకుని 40 అడుగుల వరకు వెళ్లిపోయాడు..సుమారు 15 నిమిషాల పాటు గాల్లోనే వేళాడుతూ.."కాపాడండి..కాపాడండి" అంటూ ఆర్తనాదాలు చేసినా కర్ణాటక విద్యుత్ అధికారులు కానీ..కాంట్రాక్టర్ కానీ పట్టించుకున్న పాపాన పోలేదు.

అలా వేలాడి..వేలాడి కాసేపటికి అతను కూడా కిందపడిపోయాడు. అంత ఎత్తు నుంచి కింద పడటంతో అతని నడుముకు తీవ్ర గాయమైంది. వెంటనే స్పందించిన తోటి రైతులు వన్నూర్‌సాబ్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాజెక్ట్ పని పూర్తయిన తర్వాత తీరిగ్గా సర్వే చేసి పరిహారం అందిస్తామని కాంట్రాక్టర్ ప్రతినిధులు చెప్పడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక విద్యుత్తు శాఖతో మాట్లాడి రైతులకు న్యాయమైన పరిహారం ఇప్పిస్తామని పల్లె హామీ ఇచ్చారు.