నీ ‘గిల్లు’డు ఆపవయ్యో!

 

 

 

పోలీసు పెద్దాయన కేపీఎస్ గిల్ తాజాగా నోటికొచ్చిన ఓ స్టేట్‌మెంట్ పారేశారు. గవర్నర్లు వయసుడిగిన వేశ్యలతో సమానం అనేది ఆయన వ్యాఖ్యల సారాంశం. కేపీఎస్ గిల్ ఫ్లాష్‌బ్యాక్ తెలియనివాళ్ళు అబ్బ ముసలాయన భలే కామెంట్ చేశాడే.. ఎంత సిన్సియరో అనుకుంటారు. అయితే గిల్లుగారి గిల్లుడు గురించి తెలిసినవారు మాత్రం నీ గిల్లుడు ఆపవయ్యో అని విసుక్కుంటారు. ఐపీఎస్ చదివి పోలీసు శాఖలో ఉన్నత స్థానాలను చేపట్టిన గిల్లు గారికి మొదటి నుంచి నోటికొచ్చింది మాట్లాడే అలవాటుంది. సిన్సియర్ ఆఫీసర్ కాబట్టి అలా మాట్లాడేవాడేమో అని అపోహపడకండి.. ఈయన అన్నిరకాలుగా గ్రంథసాంగుడే.

 

1996లో రూపన్ డియోల్ బజాజ్ అనే ఒక సీనియర్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ని కేపీఎస్ గిల్లు గారు గిల్లారు. ఆమెని లైంగిక వేధింపులతో మానసికంగా హింసించాడు. ఐపీఎస్ అధికారులు జరుపుకున్న ఒకపార్టీలో గిల్లు గారు తప్పతాగి, అసభ్యకరంగా మాట్లాడుతూ డియోల్ బజాజ్‌ని లైంగికంగా వేధించాడు. దాంతో ఆమె గిల్ మీద కంప్లయింట్ చేసి న్యాయస్థానానికి ఈడ్చింది. న్యాయస్థానం ఇతగాడికి రెండు లక్షల రూపాయల జరిమానాతోపాటు మూడు నెలల జైలుశిక్ష కూడా విధించింది. అయితే కోర్టుని, డియోల్ బజాజ్‌ని బతిమాలుకుని బామాలుకుని జైలుశిక్ష నుంచి మాత్రం బయటపడ్డాడు.



అంతేకాదు ఈయనగారు ఇండియన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు భోంచేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంత గొప్ప వ్యక్తిని ఒకనాటి కేంద్ర మంత్రి రాజేష్ పైలెట్ మణిపూర్ గవర్నర్‌గా సేవలందించాలని ఆఫరిస్తే ఈయనగారు తిరస్కరించారట. ఈయన చెప్పినవాటిని ఖండించడానికి రాజేష్ పైలట్ బతికి లేడు కాబట్టి ఏవైనా చెప్పేయచ్చని గిల్ అనుకున్నట్టున్నాడు. మొత్తమ్మీద ఏమిటంటే, ప్రస్తుతం ఖాళీగా కూర్చుని గోళ్ళు గిల్లుకుంటున్న గిల్లు ఆ గోళ్ళు గిల్లుకునేదేదో గవర్నర్ కుర్చీలో కూర్చుని చేస్తే ఓ పనైపోతుంది కదా అని భావించినట్టున్నాడు. దానికోసం ప్రయత్నిస్తే గవర్నమెంట్ చాల్లే పోవయ్యో అన్నట్టుంది.



అందుకే అందని ద్రాక్ష పులుపు అన్నట్టు తనకి దక్కకుండా పోయిన గవర్నర్ పదవిని పోల్చకూడని వృత్తితో పోల్చి తన అక్కసు తీర్చుకున్నాడు. నోటితోపాటు అన్ని రకాల దురదలూ ఎక్కువగా వున్న కేపీఎస్ గిల్‌కి గతంలో పద్మశ్రీ అవార్డు అనవసరంగా ఇచ్చారు. ఇప్పుడు దాన్ని తిరిగి లాక్కుంటే గానీ ఈయనగారి తిక్క కుదరదు!