Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రాణాల కంటే ఆట ముఖ్యం కాదు ... టోర్నమెంట్ నుండి వైదొలిగిన హంపి
posted on: Mar 24, 2026 7:17PM

భారత మేటి చెస్ క్రీడాకారిణి, గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో సైప్రస్‌లో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక 'ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్' నుండి ఆమె తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, భద్రతాపరమైన ఆందోళనల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
ప్రస్తుతం సైప్రస్ సమీపంలోని ప్రాంతాల్లో యుద్ధం ముదురుతుండటంతో అక్కడ భద్రతపై హంపి మొదటి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బాంబుల మోతలు, క్షిపణి సైరన్ల మధ్య ప్రశాంతంగా కూర్చుని చెస్ ఆడటం సాధ్యం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. నిర్వాహకులు భద్రతపై హామీ ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
ప్రాణాలే ముఖ్యం.. ఆట కాదు
ఈ నిర్ణయంపై హంపి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, "ఎంతటి ముఖ్యమైన టోర్నమెంట్ అయినా ప్రాణాల కంటే, క్షేమం కంటే ఎక్కువ కాదు" అని వెల్లడించారు. ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ బాధాకరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఏకాగ్రతతో ఆడలేనని ఆమె వివరించారు.
హంపి స్థానంలో ముజిచుక్
హంపి వైదొలగడంతో ఆమె స్థానాన్ని ఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ అన్నా ముజిచుక్‌తో భర్తీ చేస్తున్నట్లు అంతర్జాతీయ చెస్ సమాఖ్య ప్రకటించింది. నిబంధనల ప్రకారం తదుపరి అత్యుత్తమ ర్యాంకింగ్ ఉన్న క్రీడాకారిణికి ఈ అవకాశం కల్పించారు. మార్చి 28 నుంచి సైప్రస్‌లోని పాఫోస్‌లో ఈ టోర్నీ ప్రారంభం కానుంది.
ఈ టోర్నమెంట్ కోసం హంపి గత మూడు నెలలుగా కఠినంగా శ్రమించారు. తన కుటుంబానికి, ముఖ్యంగా తన కూతురికి కూడా సమయం కేటాయించకుండా సిద్ధమయ్యారు. అయితే, సైప్రస్‌లోని బ్రిటీష్ ఎయిర్ బేస్‌పై ఇటీవల జరిగిన డ్రోన్ దాడులు క్రీడాకారుల్లో భయాందోళనలు రేకెత్తించాయి. హంపి మాత్రమే కాకుండా అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ హికారు నకమురా కూడా అక్కడి పరిస్థితులపై పెదవి విరిచారు.
భవిష్యత్తు పరిణామాలు
నిబంధనల ప్రకారం టోర్నీ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నందుకు హంపిపై దాదాపు 10,000 యూరోల (సుమారు రూ. 10 లక్షలు) జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే, తాను జరిమానాలకు భయపడటం లేదని, కేవలం డబ్బు కోసం తాను ఆడటం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ టోర్నీ నుంచి హంపి తప్పుకోవడం భారత చెస్ రంగానికి పెద్ద లోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్ తరఫున మహిళల విభాగంలో వైశాలి, దివ్య దేశ్‌ముఖ్.. ఓపెన్ విభాగంలో ప్రజ్ఞానంద బరిలో నిలవనున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ రేసులో కీలకమైన ఈ టోర్నీలో హంపి లేకపోవడం ఆమె అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.






