హుజూరాబాద్ లో పీసీసీ చీఫ్ చేతులెత్తేశారా? షో రాజకీయాలు వద్దన్న కోమటిరెడ్డి..

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరు మారు మారడం లేదు. పార్టీ కేడర్ లో ఉత్సాహం ఉన్నా.. దాన్ని నీరుగార్చేలా కొందరు నేతల వ్యవహారం ఉంటోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీలో దూకుడు పెరగగా.. సొంత పార్టీ నేతలే బ్రేకులు వేసేలా వ్యవహరిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జగ్గారెడ్డిపై హైకమాండ్ సీరియస్ గా ఉందని, ఆయనపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనే చర్చ సాగింది. అయితే జగ్గారెడ్డి తనకు తానుగా తప్పుకుని ఒప్పుకుని సారీ చెప్పడంతో వివాదం ముగిసింది.

జగ్గారెడ్డి కామెంట్ల రచ్చ సమసిపోయిందని కాంగ్రెస్ కేడర్ ఊపిరి పీల్చుకుంటుండగానే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో రచ్చ రాజేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 కొత్త పీసీసీ వచ్చి మూడున్నర నెలలు అయినా, ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు రివ్యూ చేయట్లేదని ప్రశ్నించారు కోమటిరెడ్డి. పీసీసీ నేతలు హుజూరాబాద్ ఎందుకు వెళ్లడంలేదని నిలదీశారు. పార్టీలో అసలేం జరుగుతోందో అర్థంకావడం లేదన్నారు ఎంపీ కోమటిరెడ్డి. హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు భారీగానే ఓటు బ్యాంకు ఉందని, గత మూడు ఎన్నికల్లో 60 వేల వరకు ఓట్లు వచ్చాయని, అందరం కలిసి పనిచేస్తే మరో 50 వేల ఓట్లు రావా? అని ప్రశ్నించారు.

సీనియర్లను ఇన్చార్జిలుగా నియమించి, వారానికి ఒక్కసారి సమావేశం ఏర్పాటు చేస్తే పార్టీ గెలవదా? అని పీసీసీని నిలదీశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జీరోగా ఉన్న దుబ్బాకలో 23 వేల ఓట్లు తెచ్చుకున్నామని, కానీ హుజూరాబాద్ పోరును కాంగ్రెస్ వదిలేస్తే దానర్థం ఏంటి? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. హుజూరాబాద్ లో యుద్ధానికి ముందే చేతులెత్తేస్తామా? ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళతాయి? అంటూ పీసీసీ తీరుపై ఆయన అసహనం ప్రదర్శించారు.ఇలాంటివన్నీ భరించలేకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. తనకు ఇలాంటి షో రాజకీయాలు తెలియవని కోమటిరెడ్డి అన్నారు. 

పీసీసీ అధికార ప్రతినిధుల నియామకంపైనా ఫైరయ్యారు వెంకట్ రెడ్డి. సీనియర్లను సంప్రదించకుండా అధికార ప్రతినిధులను నియమిస్తారా? అని ప్రశ్నించారు. మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తుంటే పార్టీ సన్నద్ధమయ్యేది ఇలాగేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేవారం రాహుల్ గాంధీ, ప్రియాంకలకు ఈ విషయాలు వివరిస్తానని వెల్లడించారు. ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయాలని, అప్పుడే గెలుస్తుందని చెప్పారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలు దుమారం చల్లారుతుండగానే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్లు కాంగ్రెస్ లో కాక రేపుతున్నాయి. మరోవైపు కార్యకర్తలు మాత్రం వీళ్లు మారరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.