Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కొడాలి నాని.. అంబటి రూటే బెటరనుకుంటున్నారా?
posted on: Mar 2, 2026 3:50PM
.webp)
అంబటి రాంబాబు.. ఇటీవలి కాలంలో వైసీపీలో జగన్ తరువాత అత్యంత ప్రాధాన్యత ఉన్న నేతగా తన స్థానాన్ని పదిల పరుచుకున్నారు. ఇందుకు ఆయన చేసినదేమిటంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కీలక నేత నారా లోకేష్ పై నోరు పారేసుకోవడం. అనుచిత భాషలో వారిని దూషించడం. ఆ కారణంగా అరెస్టై జైలుకు వెళ్లడం. ఈ కారణంగా అంబటి రాంబాబుకు గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత పార్టీలో, పార్టీ అధినేత జగన్ వద్ద లభించింది. పార్టీ నేతలు ఆయన నివాసానికి పరామర్శల పేరుతో క్యూ కడుతున్నారు.
ఇవన్నీ చూసి గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఇంత కాలం అంటే పార్టీ పరాజయం తరువాత దూకుడును తగ్గించుకుని తప్పు చేశానా అని నాలిక కరుచుకున్నట్లు కనిపిస్తోంది.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు.
అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు. సొంత నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి హైదరాబాద్ లో మకాం పెట్టారు. మధ్యలో కొన్నాళ్లు అనారోగ్యం కారణంగా రాష్ట్రానికే దూరంగా ఉన్నారు. ఇక ఆ తరువాత కూడా మీడియా కంటపడకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. అటువంటి కొడాలి నాని అంబటి ఎపిసోడ్ తరువాత.. తాను తప్పచేశానని ఫీలైనట్లున్నారు. అరెస్టుకు భయపడటం వల్ల తాను గుర్తింపు కోల్పోయాననీ, పార్టీలో కూడా ప్రాధాన్యత లేకుండా పోయిందనీ మధనపడి, ఇక తాను పూర్వపు నానిగా ప్రజల ముందుకు రావాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే జైలుకు వెళ్లి వచ్చిన అంబటిని పరామర్శించే నెపంతో ఆదివారం (మార్చి 1)ఆయన నివాసానికి వెళ్లిన నాని మీడియా ముందుకు వచ్చి తన ‘వాగ్ధాటి’ ప్రదర్శించారు. బూతులు లేకపోయినా దానికి సమానం అనిపించే భాషను ఆ మీడియా సమావేశంలో ప్రదర్శించారు.
బాలకృష్ణ సినిమా డైలాగులతో మంత్రి లోకేష్ పై విమర్శలు గుప్పించారు. రెడ్ బుక్ కు భయపడేవారెవరూ లేరంటూ.. ఎవరూ భయపడడం లేదని చెప్పారు. రెడ్‌బుక్‌లు వంద రాసుకున్నా మమ్మల్నేం చేయలేరన్నారు. ఇక లోకేష్ పై విమర్శలు గుప్పిస్తూ జగన్ కు లోకేష్ ఎదురొచ్చినా, లోకేష్ కు జగన్ ఎదురొచ్చినా లోకేష్ కే రిస్క్ అని హెచ్చరించారు. 2029లో ఎంత మంది కట్టకట్టుకుని వచ్చినా జగన్ ప్రభంజనాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. కొడాలి నాని తీరు చూస్తుంటే.. ప్రభుత్వాన్ని, పోలీసులను రెచ్చగొట్టి అయినా సరే అరెస్టై.. పార్టీలో మళ్లీ తన స్థానాన్ని తిరిగి తెచ్చుకోవాలన్న ఆరాటంలో ఉన్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.


.webp)



