మూడేళ్ళ ముచ్చట!

 

 

 

మూడేళ్ళ క్రితం స్పీకర్‌గా వున్న కిరణ్ కుమార్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చాప కిందకి నీరులా ప్రవేశించి, ఆయన్ని తమిళనాడు గవర్నర్‌గా పంపించి తాను ముఖ్యమంత్రి అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ముచ్చట తీరి మూడు సంవత్సరాలు అవుతోంది. రాష్ట్రంలో పరిపాలనను కుంటుపడేలా చేసిన విభజన ఉద్యమాన్ని గాడిలో పెడతానని, పరిస్థితులు మొత్తం చక్కదిద్దుతానని అధిష్ఠానానికి పెద్ద స్క్రీన్ ప్లే ఇచ్చి కిరణ్ ముఖ్యమంత్రి సీట్‌లో కూర్చున్నారు.

 

అయితే ఈ మూడేళ్ళ కాలంలో ఆయన ఏరకంగా అయినా సాధించిందేమైనా వుందా అని ప్రశ్నిస్తే ఫలానా వుందని చెప్పే సాహసం ఎవరికీ లేదు. ఈ మూడేళ్ళ కాలంలో ఆయన తెలుగు ప్రజలకు మూడు నామాలు పెట్టి, కాంగ్రెస్ పార్టీకి మూడేలా చేయడం మినహా సాధించిందేమీ లేదని ఆయన రాజకీయ ప్రత్యర్థులు అంటున్నారు. తాను హైదరాబాద్‌లో పుట్టినవాడు కాబట్టి తాను కూడా తెలంగాణ వాడినేనని, తనకున్న హైదరాబాద్ పవర్‌తో విభజనవాదులను కంట్రోల్ చేస్తానని అధిష్ఠానం దగ్గర చెప్పుకున్న కిరణ్ విభజనవాదుల్ని ఎంతమాత్రం అదుపులో పెట్టలేకపోయారు. బయటివారి సంగతి సరే, తన మంత్రివర్గ సహచరులను కూడా అదుపు చేయలేకపోయారు.




అటు తెలంగాణ మంత్రులతోపాటు ఇటు సీమాంధ్ర మంత్రలు కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకం అయిపోయారు. ఇదిలా వుంటే, పరిపాలన పరంగా ఆయన సాధించింది కూడా ఏమీ లేదు. పాత పథకాలకే కొత్త పాలీష్ కొట్టి అవేవో తన సొంత పథకాలన్నట్టు బిల్డప్ అయితే ఇచ్చుకున్నారు. అయితే ఆ పథకాలేవీ సక్రమంగా అమలు కావడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఎలా పరిపాలిస్తేనేం కిరణ్ కుమార్ రెడ్డి తాను కలలు కన్న ముఖ్యమంత్రి సీటు సాధించారు. మూడేళ్ళ ముచ్చట తీర్చుకున్నారు.



కిరణ్‌కి ముఖ్యమంత్రి పదవిలో ఇంకా మూడునాళ్ళ ముచ్చట మిగిలి వుంది. ఆయన్ని త్వరలో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పదవి నుంచి తప్పించకపోయినా నాలుగైదు నెలలలో అసెంబ్లీయే రద్దవుతుంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోనున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు.