నెక్ట్స్ వికెట్ కె.కె.?

 

 

 

తెలంగాణ క్రికెట్ గ్రౌండ్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల మధ్య జరుగుతున్న ‘జంప్ జిలానీ’ కప్‌లో తాజాగా అందరూ ముద్దుగా ‘వీ బ్రదర్స్’ అని పిలుచుకునే కాకా వెంకటస్వామి తనయులు వినోద్, వివేక్‌ల వికెట్లు డౌన్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నెక్ట్స్ వికెట్ మీద కాన్సంట్రేట్ చేసింది. టీఆర్ఎస్‌ని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ఆడిన మాట తప్పిన కేసీఆర్‌ని తుక్కుతుక్కుగా ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ ఏనాడో వందేళ్ళు దాటిపోయిన సీనియర్ బుర్రని చాలా తెలివిగా ఉపయోగిస్తోంది.

 

తెరాస నాయకుల మీద ‘ఆకర్ష’ మంత్రాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీలోకి లాక్కునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మొదట కాంగ్రెస్‌లో నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన నాయకుల మీద దృష్టి కేంద్రీకరించిన కాంగ్రెస్ చాలామందిని తనలోకి తిరిగి లాక్కుంది. ఇప్పుడు వీబ్రదర్స్ సొంతగూటికి చేరుకున్నారు. వెంటవెంటనే రెండు వికెట్లు సాధించిన ఆనందంలో వున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం హ్యాట్రిక్ సాధించే ప్రయత్నంలో వుంది. మూడో వికెట్‌గా కేకేని పడేయాలన్న ఆలోచనలో వుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం లేదన్న ఆవేదనతోనే కే. కేశవరావు కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలో చేరారు. ఎప్పటి నుంచో తెరాస పంచన పడి వుంటే కేసీఆర్ ఆయన మొహాన ఒక రాజ్యసభ సీటు పారేశారు. ఎప్పుడైనా పార్టీ మీటింగ్స్ జరిగితే కేసీఆర్ కేకేని తన పక్కనే ఒక చిన్న కుర్చీ వేసి కూర్చోబెడతారు. అంతకు మించి కేకేకి ఒరిగిందేమీ లేదు.



ఒకప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నత పదవులు నిర్వహించిన కేకే ఇప్పుడు ఉప ప్రాంతీయ పార్టీ అయిన తెరాసలో చిన్న చిన్న పంచాయితీలు చేసుకుంటూ గడపాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతోపాటు కాంగ్రెస్‌లో విలీనం విషయంలో కేసీఆర్ మాట తప్పడం కూడా కేకేకి ఎంతమాత్రం నచ్చలేదని సమాచారం. అలాంటి కేకేని మళ్ళీ తనలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేకేకి గవర్నర్ లాంటి కీలక పదవి లేదా ఏదైనా రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ గా నియమించే ఆశ కల్పిస్తూ రాయబారాలు నడుపుతున్నట్టు తెలుస్తోంది. తెరాసలో అసంతృప్తిగా వున్న కేకే కాంగ్రెస్ గూటిలోకి త్వరలో చేరబోతున్నట్టుగా సంకేతాలు అందుతున్నాయి. ఇదే జరిగితే కాంగ్రెస్ ట్రిక్ ఫలించి ‘జంప్ జిలానీ’ కప్‌లో కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.