కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు.. అందుకేనా..?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాట తప్పను, మడమ తిప్పను అంటారు ..కానీ, మాట, మడమే కాదు మొత్తంగా బాడీనే 360 డిగ్రీలు గిరగిర తిప్పి ఉద్యోగుల నెత్తిన శఠగోపం పెట్టడం మొదలు మాట తప్పి మడమ తిప్పిన అనేక సందర్భాలు కో.. కొల్లలు. జగన్ రెడ్డి వ్యవహారం అలా ఉంటే పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... మెడైనా కోసుకుంటా గానీ, ఇచ్చిన మాట తప్పను అంటారు. దళిత ముఖ్యమంత్రి మొదలు దళిత బందు వరకు ఆయన తప్పిన మాటల చిట్టా తీస్తే, అది ఆయన చదివి పారేసిన 80వేల పుస్తకాలంత దొడ్డుగా తయారవుతదని గిట్టనివారు అంటారు. 

అదలా ఉంటే ..తాజాగా కేసీఆర్, పెద్ద విషయం కాదు గానీ, వరంగల్ జిల్లా పర్యటన విషయంలోనూ  గంటల వ్యవధిలోనే యూ టర్న్ తీసుకున్నారు. నిన్న సోమవారం మంత్రివర్గ సమావేశం జరుగతున్న సమయంలోనే,  ముఖ్యమంత్రి మంగళవారం వరంగల్ జిల్లాలో పర్యతీస్తారని, పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శిస్తారని సీఎంఓ అధికారులు ప్రకటించారు. వెంటనే వరంగల్ అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. 

అయితే, ఇంతలోనే ఏమైందో, ఎలాంటి సమాచారం వచ్చిందో ఏమో కానీ, మంత్రివర్గ సమావేశం ముగిసే సమయానికే, మాట మారిపోయింది. వరంగల్ వెళ్లేది ముఖ్యమంత్రి కేసీఆర్ కాదని, అనివార్య కారణాల వల్ల కేసీఆర్ వెళ్ళడం లేదని వ్యవ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్‌రెడ్డితో నాయకత్వంలో జిల్లా మంత్రుల బృందం ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో పర్యటించి పంట న‌ష్టం అంచ‌నా వేసి.. రైతుల క‌ష్టాల‌ను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అంద‌జేస్తారని చెబుతున్నారు. 

దీంతో ముఖ్యమంత్రి వస్తే, తమ కష్టాలు చెప్పుకుందామని, అయన ఎదో తృణమో పణమో ఇస్తారని ఆశగా ఎదురు చుసిన రైతులు ఇప్పుడు ఉసూరు మంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన రద్దుకు, అధికారికంగా ‘ఇదీ’ కారణమని అధికారులు ప్రకటించలేదు. అయితే, గతంలో వరంగల్ పర్యటన సందర్భంగా ఇల్లిలూ తిరిగి ఇచ్చిన హమీలేవీ నెరవేరక పోవడంతో, ప్రజలు నిరసన తెలిపే అవకాశం ఉందని ఉప్పందడంతోనే ముఖ్యమంత్రి, పర్యటన రద్దు చేస్తుకున్నారని అంటున్నారు.అలాగే, రైతుల్లో కూడా ఆగ్రహం ఉందని వేగులు నుంచి వర్తమానం అందినందునే, ముఖ్యమంత్రి పర్యటన రద్దయిందని సమాచారం. 

అదలా ఉంటే, ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన ఆఖరి నిముషంలో రద్దు కావడం ఇదే మొదటి సారి కాదు. ముఖ్యమంత్రి పర్యటనకు,’అనివార్య’ కారణాలు అడ్డు రావడం వలన జ‌న‌గామ క‌లెక్ట‌రేట్ ప్రారంబోత్సవ కార్యక్రమం  ఇప్పటికి ఓ ఐదు సార్లు వాయిదా పడింది. అలాగే, వరంగల్’లో నిర్వహించాలనుకున్న విజయగర్జన సభ అయితే, హుజూరాబాద్ ఓటమితో పూర్తిగానే రద్దయింది. ముఖ్యమంత్రికి సెంటిమెంట్స్ ఎక్కువ కదా .. అందుకు కూడా ఆయన వరంగల్ పర్యటన రద్దు చేసుకుని ఉండవచ్చని అనేవాళ్ళు అంటున్నారు.