ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నారు? రేవంత్ టార్గెట్ గా బీజేపీతో ఉమ్మడి వ్యూహమా? 

రెండు వారాల్లోనే తెలంగాణ సీఎం  కేసీఆర్ రెండోసారి ఢిల్లీ వెళ్లడం రాజకీయాల్లో హాట్ టాపిగ్గా మారింది. టీఆర్ఎస్ నేతలు పైకి జల వివాదాలు వంటి కారణాలు చెబుతున్నా కేసీఆర్ పర్యటనలో అసలు ఎజెండా వేరే ఉందన్న పుకార్లు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని, బీజేపీ పెద్దలతో మరోసారి మాట్లాడబోతున్నారని అంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఉమ్మడి శత్రువుగా రేవంత్ రెడ్డి అండ్ కో తయారవడమే.. ఆ ఇద్దరినీ ఒకే పాయింట్ మీద చర్చకు కూర్చుండేలా చేస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.  

టీ-పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాక అటు కేంద్రంలోని బీజేపీని, ఇక్కడ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ను ఏకిపారేస్తున్నారు. కాంగ్రెస్,  టీడీపీ మాజీ కార్యకర్తలు, నాయకులతో పాటు బీజేపీలోని అసంతృప్తవాదులు, అధికార పార్టీలోని అసమ్మతివాదులు రేవంత్ ను ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ శ్రేణుల్లోనైతే ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత హుషారు కనిపిస్తోంది. రేవంత్ అటెండ్ అవుతున్న ప్రతి మీటింగ్ ఒకదాన్ని మించి ఒకటి సక్సెస్ అవుతుండడమే కాక రేవంత్ సభలకు హాజరవుతున్న జనం కూడా విపరీతంగా పెరుగుతోంది. గజ్వేల్ సభనే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ సభలో యువజన ప్రవాహమే కనిపించింది. అంతేకాదు.. రేవంత్ వెంట ర్యాలీ కావడానికి పెద్దసంఖ్యలో జనం సంసిద్ధమవుతున్నట్టు మొన్నటి గజ్వేల్ సభ చెప్పకనే చెబుతోంది. దీంతోనే టీఆర్ఎస్ శ్రేణుల్లో, ముఖ్యంగా కేసీఆర్ వందిమాగధుల్లో వణుకు పుట్టిందన్న టాక్ వినిపిస్తోంది. 

అదే సమయంలో అటు బీజేపీ కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత అజాపతా లేకుండా పోయింది. సెంటిమెంట్లను రంగరించి యూత్ ను ఆకర్షించే బండి సంజయ్ గానీ, ప్రభుత్వం మీద, కేసీఆర్ దొరతనం మీద చెణుకులు రువ్వే అరవింద్ వాయిస్ గానీ వినిపించడమే లేదు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాగలదన్న అంచనాలు ఏర్పరచుకున్న బీజేపీ.. రేవంత్ రాకతో కనిపించడం గానీ, వినిపించడం గానీ లేదన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక హుజూరాబాద్ ఎన్నికల్లో మళ్లీ సత్తా పుంజుకునే అవకాశాలున్నప్పటికీ.. టీఆర్ఎస్ కు అనుకూలించేలా ఆ ఎన్నికను వాయిదా వేయడంలో సైతం బీజేపీ ఢిల్లీ పెద్దల పాత్ర ఉందన్న వ్యాఖ్యానాలకు తాజాగా బలం చేకూరుతోంది. ఇన్ని సానుకూల పరిణామాల మధ్య కేసీఆర్ ఢిల్లీ టూర్ లోగుట్టు ఏంటన్నది బహిరంగ రహస్యమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

రేవంత్ రెడ్డి దూకుడు వల్ల కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలకే ముప్పు  తప్పదన్న అంచనాలు రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి రాహుల్ అండ్ కో స్ట్రాటజీ మారుస్తున్నట్టుగా వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఇటు తెలంగాణలో రేవంత్ కు పూర్తి నిర్ణయాధికారాలు ఇచ్చి, ఏపీలో సైతం సరైన నాయకత్వానికి పగ్గాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి రాజకీయ శత్రువైన రేవంత్ కు అడ్డుకట్ట వేయకపోతే రాబోయే రోజుల్లో రెండు పార్టీలకూ గడ్డుకాలమేనన్న వ్యాఖ్యానాలు స్థానిక రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. అందుకే రేవంత్ వీక్ పాయింట్ మీద కొట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. రేవంత్ వీక్ పాయింట్ ఏంటనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అందరికీ తెలిసిన సంగతే. ఓటుకు నోటు కేసు విచారణను వేగవంతం చేయించి ఆయన్ని ఆ కేసులో ఏదొక స్థాయిలో బాధ్యుణ్ని చేసి కటకటాల్లోకి నెట్టేస్తే తప్ప కేసీఆర్ కు మనశ్శాంతి ఉండదని, అది జరక్కపోతే కేసీఆర్ ఓటు బ్యాంకుకు గణనీయంగా దెబ్బ పడుతుందని సీనియర్ విశ్లేషకులంతా చెప్పుకుంటున్నారు. 

అటు బీజేపీ నేతలకు సైతం అధికారమనే తాడూ-బొంగరం లేని రేవంత్ దూకుడు కన్నా.. అధికార బాధ్యతల్లో అణిగిమణిగి ఉండే కేసీఆర్ అండ్ టీమే క్షేమకరం అన్న అభిప్రాయాలున్నాయి. రేవంత్ వరుస మీటింగులతో కాంగ్రెస్ కు పాత జవసత్వాలు రాకముందే ఆ అధ్యాయాన్ని క్లోజ్ చేయించాలనే సంకల్పంతోనే కేసీఆర్  ఢిల్లీ టూర్ పెట్టుకున్నట్టు సమాచారం. ఓటుకు నోటు కేసులో రేవంత్ కు శిక్ష పడి జైలుకెళ్లేలా చేస్తే అది కాస్తా పబ్లిక్ లో డ్యామేజ్ అంశంగా మారుతుంది. దాంతో మొత్తం కాంగ్రెస్ పార్టీనే ఖతం చేయొచ్చు. కాంగ్రెస్ ను ఖతం చేయడం అనేది కేసీఆర్, మోడీ టీంలో టాప్ ప్రయారిటీ సబ్జెక్ట్ అన్న విషయం అందిరికీ తెలిసిందే. 

ఈ విధంగా ఉమ్మడి ప్రయోజనాలే ఎజెండాగా అనుకున్న పని సాధించుకోవడానికే కేసీఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని, లోపాయికారీగా పైనుంచి ఏదో హామీతోనే తిరిగి వస్తారని హైదరాబాద్ రాజకీయాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. అటు బీజేపీకి కూడా ఈ అంశం కలిసొచ్చేదే కావడం వల్ల కచ్చితంగా ఓకే చెప్తారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ తిరిగొచ్చేనాటికి ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి...