Top Stories

వక్ఫ్ బిల్లు చట్టబద్ధత పై స్టే విధించలేం : సుప్రీంకోర్టు

ఎన్డీయే సర్కార్ ఆమోదించిన  వక్ఫ్ బిల్లు చట్టంపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. వక్ఫ్ బిల్లు చట్టభద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు నేడు విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లు చట్టభద్ధతను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, టీఎంసి ఎంపీ మహువా మొయిత్ర, ఎస్పీ ఎంపీ జియా ఉర్ రెహమాన్, అర్జీడి ఎంపీ మనోజ్ కుమార్ ఝ, ఆప్ ఎమ్మెల్యే అమనాతుల్లా ఖాన్, మణిపూర్ ఎమ్మెల్యే షేక్ నూరుల్ హాసన్, వైసీపీ, డిఎంకె, టీవికే అధినేత విజయ్, సిపిఐ సహా కొన్ని ముస్లిం సంఘాలు ఉన్నాయి.  ఇక, పిటీషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ వివాదంపై దాఖలైన పలు పిటిషన్లుపై రేపు మధ్యాహ్నం మధ్యంతర తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. అటు వక్ఫ్ సవరణ చట్టంపై కలెక్టర్లకు ఇచ్చిన అధికారాలతో పాటు పలు ప్రశ్నలకు 2 వారాల్లోనే సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. ముస్లిం సమాజంలో మత, ధార్మిక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన వక్ఫ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మత స్వేచ్ఛకు అడ్డు తగలడమేనని.. ఇది మైనార్టీల హక్కులను కాలరాస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు దుర్మార్గమైందని.. రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడిగా ఈ బిల్లును ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. కొత్త చట్టం వల్ల వక్ఫ్ భూముల సర్వే అధికారాలు కలెక్టర్లకు మారిపోవడంతో భూమి ఆక్రమణలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు. బినామీల ద్వారా వక్ఫ్ భూములను కొట్టేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వక్ఫ్ బిల్లు చట్టబద్ధత పై స్టే విధించలేం : సుప్రీంకోర్టు Publish Date: Apr 16, 2025 4:48PM

తదుపరి సీజేఐ బీఆర్ గవాయ్

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా వచ్చే నెల 13న పదవీ విరమణ చేయనున్న సంగతి విదితమే.  ఆయన స్థానంలో తదుపరి చీఫ్ జస్టిస్‌ ఆఫ్ ఇండియాగా బీఆర్ గవాయ్ పేరును కొలీజియం  సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే నెల అంటే మే 14న భారత ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన దాదాపు ఆరు నెలల పాటు సీజేఐగా సేవలందించనున్నారు. ఈ ఏడాది నవంబర్ లో గవాయ్ పదవీ విరమణ చేస్తారు.   బీఆర్.గవాయ్ పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. 1985లో న్యాయవాదిగా బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో ప్రాక్టీస్ చేశారు. అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు. ఇక నవంబర్ 14, 2003న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మే 24, 2019న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.   కేంద్ర న్యాయశాఖ సూచనల మేరకు గవాయ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. మే 14, 2025 నుంచి నవంబర్ 24, 2025 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గవాయ్ పని చేయనున్నారు.
తదుపరి సీజేఐ బీఆర్ గవాయ్ Publish Date: Apr 16, 2025 4:33PM

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంతోనే ప్రభాకరరావు ఆటలు!

బీఆర్ఎస్ హయాంలో ఇంటెలిజెన్స్ వింగ్ చీఫ్ గా పనిచేసిన టీ.ప్రభాకరరావు  తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తే.. సీఐడీ విచారణకు హాజరయ్యేందుకు వస్తానంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అంటే కేసు దర్యాప్తునకు తాను సహకరించాలంటే తనకు అరెస్టు నుంచి రక్షఏణ కల్పించాలని సుప్రీం కోర్టుకే కండీషన్ పెట్టారాయన అని అర్ధం చేసుకోవలసి ఉంటుంది.   తాను భారత్  వచ్చి  ఫోన్ ట్యాపింగ్  కేసు దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొంటూనే.. తనను అరెస్టు చేయకుండా సీఐడీకి ఆదేశాలివ్వాలని ప్రభాకరరావు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కోరారు.   నిందితుడి తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో ఈ మేరకే తన వాదనలు వినిపించారు. ఇదే కేసులో నిందితుడైన శ్రవణ్ రావును అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చిన విధంగానే ప్రభాకరావుకూ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు.  ఏడాది కాలంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించకుండా అమెరికాలో ఉన్న ప్రభాకరరావు, ఇండియాకు రాకుండా అక్కడే స్థిరంగా ఉండిపోవడానికి చేయగలిగినన్ని ప్రయత్నాలూ చేశారు. అమెరికా శాశ్వత పౌరసత్వం కోసం దరఖాస్తు చేశారు. తనను శరణార్ధిగా గుర్తించి అమెరికాలోనే శాశ్వతంగా నివాసముండేలా చూడాలని అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసుకున్నాడు.  క్యాన్సర్ రోగంతో ఇబ్బందిపడుతున్నందున చికిత్స చేయించుకునేంతవరకు తనను అమెరికా నుండి పంపవద్దనీ కోరారు. ఇలా అమెరికాలోనే ఉండిపోయేందుకు ఆయన చేసుకున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాకరరావు అరెస్టుకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది.  ఇండియా ఆయన పాస్ పోర్టు రద్దు చేసింది. అన్నిటికీ మించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో తీసుకుంటున్న చర్యల కారణంగా ఆయనలో ఖంగారు మొదలైంది. ఏ క్షణంలోనైనా అమెరికా నుంచి తాను బలవంతంగా పంపబడటం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసిన ప్రభాకరరావు,  తనను అరెస్టుచేయకుండా ఆదేశాలిస్తే ఇండియాకు వచ్చేస్తానని సుప్రింకోర్టుకే కండీషన్ పెట్టారు.  ప్రస్తుతం అమెరికాలో ఉన్న పరిస్థితులను గమనించిన ఆయన అమెరికా తనను బలవంతంగా  ఇండియాకు పంపడంకంటే ముందే తనంత తానానుగానే భారత్ కు వచ్చేయాలని భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు ముందు బిల్డన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.  అంతే కాకుండా కిందపడ్డా నాదే పైచేయి అన్నట్లు విచారణకు సహకరించాలంటే అరెస్టు చేయకూడదంటూ తాను పెడుతున్న కండీషన్ ను అంగీకరించాలని ఏకంగా సుప్రీం కోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు.
 ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంతోనే ప్రభాకరరావు ఆటలు! Publish Date: Apr 16, 2025 4:16PM

హెచ్‌సీయూ భూములపై  స్మితా సబర్వాల్ రీట్వీట్..నోటీసులు

. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల  భూమిని చదును చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఏఐని ఊపయోగించి జింకలు, నెమళ్లు దీనస్ధితిలో చూస్తున్నట్లు ఫోటోలు ఎడిట్ చేశారు. అందులో మార్చి31న ఓ నెటిజన్ పోస్ట్ చేసిన తప్పుడు ఫోటోను ఐఎస్ అధికారి స్మితా సబర్వాల్ రీట్వీట్ షేర్ చేసినందున  తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు చేశారు. అయితే ఈ నోటీసులోని విషయాలను ఇప్పుడు బయటకు చెప్పలేమని పోలీసులు తెలిపారు. హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు వీడియోలు, చిత్రాల ద్వారా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తప్పుడు ప్రచారం చేశారని, వీరి వెనుక ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారని ప్రభుత్వానికి నిఘా వర్గాలు నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడిన ఆయా యూట్యూబ్ చానళ్లు, న్యూస్ వెబ్ సైట్లతో పాటు పలువురు నెటిజన్లకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. 
హెచ్‌సీయూ భూములపై  స్మితా సబర్వాల్ రీట్వీట్..నోటీసులు Publish Date: Apr 16, 2025 4:14PM

గోశాలలో కామ్రేడ్ నారాయణ

ఇటీవలి కాలంలో వార్తలలో నిలిచిన ఎస్వీ గోశాలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బుధవారం (ఏప్రిల్ 16) పరిశీలించారు. తిరుమల తిరుపతి  దేవస్థానానికి చెందిన ఎస్వీ గోశాలలో నెలల వ్యవధిలో వందల గోవులు మరణించాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలను టీటీడీ ఖండించింది. అదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టి పారేసింది. టీటీడీ ఈవో శ్యామలరావు అయితే వాస్తవానికి గోవుల దాణా బొక్కేసింది కరుణాకరరెడ్డి హయాంలోనే అని ప్రత్యారోపణలు కూడా చేశారు. కరుణాకరరెడ్డి హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు, అవకతవకలన్నిటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామనీ చెప్పారు. ఆలా టీటీడీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతున్న తరుణంలో  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ  తిరుపతిలోని టీటీడీ ఎస్వీ గోశాలను పరిశీలించారు. గోశాలలో ఆవుల ఆరోగ్య పరిస్థితులు, వాటికి అందుతున్న దాణా తదితర అంశాలను నిశితంగా పరిశీలిం చారు. అనంతరం టీటీడీ ఎస్వీ గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఇసుమంతైనా లేదని చెప్పారు. గోవులకు దాణా కొరత లేదనీ, నిత్యం గోవుల ఆరోగ్యాన్ని పశువైద్య నిపుణులు పర్యవేక్షిస్తున్నారని నారాయణ చెప్పారు. గోశాలలో గోవులన్నీ పుష్ఠిగా ఉన్నాయన్న ఆయన  టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయనీ, ఆయనను సస్పెండ్ చేస్తే సరిపోదు విధుల నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.  గతంలో గోవులకు పురుగుల దాణా పెట్టడం దారుణం అన్నారు.. కమిషన్ల కక్కుర్తితో హరినాథరెడ్డి గోవులను విక్రయించారని నారాయణ ఈ సందర్భంగా ఆరోపించారు. ఇప్పుడు గోశాల నిర్వహణ బ్రహ్మాండంగా ఉందని ప్రశంసించారు. గోశాలను తన రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాడుకోవడం సరి కాదని నారాయణ అన్నారు. అసత్య, అవాస్తవ ఆరోపణలతో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయవద్దని నారాయణ అన్నారు. ఇక తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్లను అందిం చడాన్ని నారాయణ స్వాగతించారు. అలాగే శ్రీవాణి టికెట్ల సంఖ్యను పెంచినందుకు టీటీడీపై ప్రశంసల వర్షం కురిపించారు.  
గోశాలలో కామ్రేడ్ నారాయణ Publish Date: Apr 16, 2025 3:44PM

తండ్రయిన జ‌హీర్ ఖాన్.. చిన్నారి  పేరేంటో తెలుసా?

  టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ తండ్రి అయ్యారు. ఆయన సతీమణి సాగరిక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. చిన్నారికి ఫ‌తేసిన్హ్ ఖాన్ అని పేరు పెట్టిన‌ట్లు తెలిపారు. "ప్రేమ, కృతజ్ఞత, దైవ ఆశీర్వాదాలతో మేము మా చిన్న బాబు ఫతేసిన్హ్ ఖాన్‌ను స్వాగతిస్తున్నాము" అని ఆమె రాసుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ఈ జంట ఓ అందమైన కుటుంబ ఫొటోను కూడా పంచుకుంది. ఫొటోలో జహీర్ ఖాన్ తన బిడ్డను తన ఒడిలో పట్టుకుని ఉండగా, సాగరిక తన చేతులను జహీర్ భుజాల చుట్టూ ఉంచ‌డం చూడొచ్చు. తొలి బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లికిన జ‌హీర్ ఖాన్ దంప‌తుల‌కు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.  కాగా, 2016లో తోటి క్రికెట‌ర్‌ యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ సింగ్ వివాహం సందర్భంగా సాగరిక ఘట్గే, జహీర్ ఖాన్ తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత 2017లో ఈ జంట వివాహబంధంతో ఒక్క‌ట‌య్యారు. కొడుకును కూడా నీలాగే చాంపియన్‌ బౌలర్‌ను చెయ్ అంటూ జహీర్‌ను కోరుతున్నారు ఫ్యాన్స్. కాగా, ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు లెజెండరీ స్పీడ్‌స్టర్. లక్నో సూపర్ జెయింట్స్‌గా మెంటార్‌గా ఉన్న జహీర్.. యువకులతో నిండిన జట్టును ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
తండ్రయిన జ‌హీర్ ఖాన్.. చిన్నారి  పేరేంటో తెలుసా? Publish Date: Apr 16, 2025 3:16PM

కంచ గచ్చిబౌలి భుములపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో షాక్ 

కంచ గచ్చిబౌలి హెచ్‌సీయూ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు మరోసారి షాకిచ్చింది. నేడు ఈ వ్యవహారంపై మరోసారి విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం  కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణం రక్షించడం మన బాధ్యత అని  ఇష్టానుసారంగా చెట్లను నరికి సమర్ధించుకోవడం ఏంటని జస్టిస్ బీఆర్ గవాయి మండిపడ్డారు.చెట్ల పునరుద్ధరణపై ప్రభుత్వం వెంటనే ఓ ప్రణాళికతో రావాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో తాము రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర సీఎస్‌ను కాపాడాలనుకుంటే.. విధ్వంసం సృష్టించిన 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని కోర్టు ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ మను సింగ్విని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ లాయర్ బదులిస్తూ..ఫేక్ వీడియోలతో విపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశాయని కోర్టుకు తెలిపారు.  ప్రస్తుతం పనులు జరగడం లేదని చెప్పారు. వాదోపవాదాలు విన్న ధర్మాసనం తీర్పు విషయంలో స్టేటస్ కో ఉంటుందని చెప్పింది. అనంతరం తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు. వారంతపు సెలవుల్లో మూడు రోజుల్లో చెట్లు కొట్టాల్సిన తొందర ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. మీరు చెట్లు కొట్టడం వల్ల అక్కడ జంతువుల మీద కుక్కలు దాడి చేస్తున్నాయని.. ఆ వీడియోలను చూసి ఆందోళనకు గురయ్యామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవసరమైతే 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టకుండా ఆదేశాలివ్వాల్సి వస్తుందని తెలిపారు. ఆ భూముల్లో పర్యవరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారు? ఎంత టైం పడుతుంది? జంతువులను ఎలా సంరక్షిస్తారో చెబుతూ.. 4 వారాల్లో ప్రణాళికను ఫైల్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు సైతం జారీ చేసింది.   
కంచ గచ్చిబౌలి భుములపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో షాక్  Publish Date: Apr 16, 2025 3:08PM

స్కూల్ పిల్లలపై విష ప్రయోగం.. ఎక్కడంటే?

ఆదిలాబాద్ జిల్లాలోని ఓ పాఠశాలలో విద్యార్థులపై  వి ప్రయోగం జరిగింది. ఇచ్చోడ మండలం ధరంపురి ఎంపీపీ స్కూల్లో విద్యార్ధులు వినియోగించే నీటిలో వంట సామాగ్రిపై గుర్తు తెలియని దుండుగులు పురుగుల మందు చల్లారు. విషప్రయోగం అనంతరం దుండుగులు పురుగుల మందు డబ్బాను అక్కడే పడేశారు. దీనిని ప్రధానోపాధ్యయుడు ముందే గుర్తించడంతో 30 మంది విద్యార్ధులకు పెను ప్రమాదం తప్పింది. ఘటనపై స్కూల్ హెచ్‌ఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు.శనివారం, ఆది వారం సెలవు  కావడంతో స్కూల్లోని వంట గదికి సిబ్బంది తాళం వేసి ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం స్కూలుకు వచ్చిన సిబ్బంది మధ్యాహ్న భోజనం కోసం వంట ఏర్పాట్లు ప్రారంభించారు.  పాత్రలను క్లీన్ చేసే సమయంలో నీటి నుంచి నురగలు, దుర్వాసన రావడంతో అప్రమత్తమయ్యారు. చుట్టు పక్కల పరిశీలించగా.. వాటర్ ట్యాంక్ సమీపంలో పురుగుల మందు డబ్బా కనిపించిందని సిబ్బం ది చెప్పారు. తాగునీటి ట్యాంకులో పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు. దీంతో విద్యార్థులు తాగు నీటి కుళాయిల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్న భోజనం వండలేదు. ఈ ఘటనతో స్కూలుతో పాటు గ్రామంలోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై స్కూలు హెడ్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వాటర్ ట్యాంక్ లో పురుగుమందు కలిపిన దుండగులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
స్కూల్ పిల్లలపై విష ప్రయోగం.. ఎక్కడంటే? Publish Date: Apr 16, 2025 2:28PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. కూటమి సీఎం అభ్యర్థి నితీష్ కుమారేనా?

ఈ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించేశారు. ఈ ఎన్నికలలో ప్రధానంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిల మధ్య పోరా జరగనుంది. ఇప్పటికే ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి కూమార్ యాదవ్ ను కూటమి పార్టీలు అధికారికంగా ప్రకటించేశాయి. మరి ఎన్డీయే కూటమి పరిస్థితి ఏమిటి? అంటే ఇంకెవరు నితీష్ కుమారే అంటున్నారు జేడీయూ నేత  రాజీవ్ రంజన్ ప్రసాద్.  అయితే ఆ విషయంలో ఏకాభిప్రాయం ఇసుమంతైనా లేదన్న విషయం ఇటీవలి పరిణామాల ద్వారా తేటతెల్లమౌతోంది. నితీష్ కుమార్ పట్ల వ్యతిరేకతతో బీహార్ లో ఎన్డీయే కూటమి నుంచి ఇప్పటికే రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ వైదొలగింది. ఈ సారి ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ అధినేత పశుపతి కుమార్ పరాస్ విస్పష్టంగా తేల్చేశారు. గత ఐదేళ్లుగా ఎన్డీయే కూటమిలో ఉన్న లోక్ జనశక్తి పార్టీ పేరుకు బీజేపీ దళిత వ్యతిరేక వైఖరి అంటూ వైదొలగినా.. వాస్తవ కారణం మాత్రం జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై వ్యతిరేకతతోనే అన్నది సుస్పష్టం.  అంతే కాకుండా హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ.. చేసిన వ్యాఖ్యలు కూడా ఎన్డీయేలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనే అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. ఇటీవల హర్యానాలో జరిగిన ఓ కార్యక్ర మంలో ప్రసంగించిన సైనీ.. బీహార్ లో బీజేపీ విజయం తథ్యం అని అంటూనే..  బీహార్ ఉప ముఖ్యమంత్రి  సామ్రాట్ చౌదరి నాయకత్వంలో అది సాధ్యమౌతుందని చెప్పారు. ఆయన ఈ మాట సోమవారం (ఏప్రిల్ 14)న అన్నారు. అంతే వెంటనే అప్రమత్తమైన జేడీయూ.. మంగళవారం (ఏప్రిల్ 15)న బీహార్ లో ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమారే అని ఏకపక్ష ప్రకటన చేసేసింది.  ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను కూటమి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఎదుర్కొంటుందనీ, అటువంటప్పుడు మరో ముఖ్యమంత్రి అభ్యర్థి అనే ప్రశక్తే  లేదని జేడీయూ అంటోంది.  మొత్తం మీద బీహార్ లో ఎన్డీయే కూటమిలో లుకలుకలు ఉన్నాయన్న విషయం ప్రస్ఫుటంగా బయటపడింది.  
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు..  కూటమి సీఎం అభ్యర్థి నితీష్ కుమారేనా? Publish Date: Apr 16, 2025 2:17PM

ప్రొడ్యూసర్ కమ్ రైటర్ అవతారమెత్తిన రాజ్ కసిరెడ్డి

అజ్ఞాతంలో ఏపీ లిక్కర్ స్కామ్ కింగ్ పిన్ సినీ ఇండస్ట్రీపై మోజుతో ప్రొడ్యూసర్ కమ్ రైటర్ అవతారమెత్తిన రాజ్ కసిరెడ్డి దందాలు వరుసగా బయటపడుతున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్‌ కసిరెడ్డి దోచుకున్న నల్లధనాన్ని వైట్‌లోకి మార్చుకునేందుకు సినిమాల నిర్మాణం చేపట్టారు. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనే సంస్థను నెలకొల్పి, కార్తికేయ-2 ఫేమ్‌ నిఖిల్‌ సిద్ధార్థ్‌  హీరోగా  స్పై అనే పాన్‌ ఇండియా చిత్రాన్ని నిర్మించారు.  తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2023 జూన్‌ 29న ఈ సినిమాను విడుదల చేశారు. దీనికి కథ కూడా రాజ్‌ కసిరెడ్డే సమకూర్చినట్లు టైటిల్స్‌లో వేసుకున్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అదృశ్యం వెనకున్న రహస్యాన్ని స్పృశిస్తూ, ఓ గూఢచారి ఇతివృత్తంతో రూపొందించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఈ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థకు ఉప్పలపాటి చరణ్‌తేజ్‌ అనే ఓ డైరెక్టర్, రచయితను సీఈవోగా పెట్టుకున్నారు. ఒకేసారి భారీగా సినిమాలు నిర్మించడం కోసం పలువురు యువ డైరెక్టర్లు, రచయితలకూ అడ్వాన్సులిచ్చారు. ఆ మధ్య కాలంలో మిడ్‌ రేంజ్, కొత్త హీరోలతో హిట్‌ సినిమాలు తీసిన నలుగురైదుగురు డైరెక్టర్లతో కథలపై చర్చించి సినిమాల నిర్మాణానికి ప్రయత్నించారు. మద్యం కుంభకోణంలో సమకూరిన నగదును దీనిలో కుమ్మరించినట్లు సమాచారం.  ఈ లోగా ఎన్నికలు ముంచుకొచ్చేయడం, ఏపీలో జగన్‌ అధికారం కోల్పోవడం, మద్యం కుంభకోణంపై దర్యాప్తు తీవ్రతరం కావడంతో.. ఆ కొత్త ప్రాజెక్టులన్నింటినీ నిలిపేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు రాజ్ కసిరెడ్డి.   స్పై సినిమాను ఎంత బడ్జెట్‌లో నిర్మించినట్లు చెప్పారు? దానికి వాస్తవంగా చేసిన వ్యయం ఎంత? ఈ సొత్తు ఎక్కడి నుంచి సమకూరింది? ఏయే రూపాల్లో చెల్లించారు? ఈ సినిమాకు జరిగిన వ్యాపారమెంత?  తదితర వివరాలన్నీ ఇప్పటికే సిట్‌ సేకరించింది. ఇంకా ఏయే సినిమాలు నిర్మాణానికి పైప్‌లైన్‌లో పెట్టారు? వాటి కోసం ఎంత వెచ్చించినట్లు లెక్కలు చూపించారు? ఇందుకు మనీ రూటింగ్‌ ఎలా చేశారు? అనే దానిపై సిట్‌ దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు.. 2020 డిసెంబరు 12న ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థను నెలకొల్పిన రాజ్‌ కసిరెడ్డి.. ఆ వెంటనే  స్పై చిత్రం నిర్మాణం చేపట్టారు. దానికి నిర్మాతగా తన పేరు అధికారికంగానే వేసుకున్నారు.  మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా సిట్‌ బృందాలు ఇటీవల ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రిజిస్టర్‌ చిరునామా అయిన హైదరాబాద్‌ మణికొండ ప్రశాంతి హిల్స్‌లోని ప్లాట్లలో తనిఖీలు జరిపాయి. అక్కడ ప్రస్తుతం ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు కొనసాగట్లేదని గుర్తించాయి. ఇదే చిరునామాలో రీసోర్స్‌ వన్‌ ఐటీ సొల్యూషన్స్‌ అనే ఐటీ కంపెనీ ఉంది. దీనికి రాజ్‌ కసిరెడ్డి సతీమణి సోదరి పైరెడ్డి మేఘనా ప్రియదర్శినిరెడ్డి ఎండీగా, ఆమె తల్లి పైరెడ్డి సుజాతరెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కంపెనీకి, ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు మధ్య లావాదేవీలు ఏమైనా సాగాయా అన్నదానిపై కూడా సిట్‌ బృందాలు ఆరా తీస్తున్నాయి. మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డికి సిట్ ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన పోలీసు విచారణకు హాజరు కాలేదు. సిట్ గత నెల 28, 29 తేదీలలో ఇచ్చిన నోటీసులు ఇవ్వగా విచారణకు గైర్హాజరైన రాజ్ కసిరెడ్డి   తనకు సిట్ నోటీసులు పంపడాన్ని సవాల్ చేస్తూ హైకో ర్టును ఆశ్రయించారు. అయితే కసిరెడ్డి రాజ్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సిట్ నోటీసుల విషయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో సిట్ ఆయనకు ఈ నెల 5న మరోసారి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 9న విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొంది. అయితే కసిరెడ్డి రాజ్ ఈ సారీ విచారణకు డుమ్మా కొట్టారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాప్ ఉంది. దీంతో కసిరెడ్డి పరారీలో ఉన్నట్లు నిర్ధారించుకున్న సిట్  అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
ప్రొడ్యూసర్ కమ్ రైటర్ అవతారమెత్తిన రాజ్ కసిరెడ్డి Publish Date: Apr 16, 2025 12:43PM

అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్

అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ఇన్నాళ్లూ కఠిన నిబంధనలు అమలు చేస్తూ వచ్చిన అమెరికా ప్రభుత్వం, తాజాగా వారికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి వలసల విషయంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్రమంగా ఉంటూ స్వీయబహిష్కరణ చేసుకోవాలనుకునే వారికి ట్రంప్‌ ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించారు. అలాంటివారికి విమాన ఖర్చులతో పాటు కొంత నగదు అందిస్తామని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.  ప్రస్తుతం దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటూ నేరాలకు పాల్పడుతున్నవారిపై ఇమిగ్రేషన్‌ అధికారులు దృష్టిసారించారన్నారు. అయితే, చట్టవిరుద్ధంగా ఉంటున్న సాధారణ పౌరుల కోసం స్వీయబహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలా వెళ్లాలనుకునేవారికి తాము విమాన ఖర్చులతో పాటు కొంత నగదును అందిస్తామని ప్రకటించారు. వెళ్లిపోయినవారిలో మంచివారు ఉంటే వారిని వెనక్కి తీసుకోవడం పైనా ట్రంప్‌ మాట్లాడారు. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొట్టడమే తమ ప్రథమ లక్ష్యమని ఆయన ఈసందర్భంగా స్పష్టంచేశారు. అయితే.. సముచితమని భావిస్తే వారు చట్టపద్ధతిలో వెనక్కి తిరిగిరావడానికి అనుమతిస్తామన్నారు. స్వీయ బహిష్కరణకు తుది ఉత్తర్వులు పొంది కూడా 30 రోజులు దాటి అమెరికాలో నివసిస్తున్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెన్ట్స్‌కు  రోజుకు 998 డాలర్లు జరిమానాగా విధిస్తామని అమెరికా ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్వీయ బహిష్కరణ వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించారు. స్వతహాగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లడం వెళ్లాలనేకునే వారికి సాయం అందిస్తామని చెప్పారు. తమ దేశాలకు వెళ్లే క్రమంలో చార్జీలను భరించలేకపోతే.. సబ్సిడీ విమాన సర్వీసుకు కూడా అర్హులవుతారని అధికారులు పేర్కొన్నారు.
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్ Publish Date: Apr 16, 2025 11:09AM

సీఎం రేవంత్ జపాన్ పర్యటన.. లక్ష్యం ఏమిటో తెలుసా?

  రాష్ట్రానికి పెట్టబడును ఆకర్షిండమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు రెడీ అయ్యారు. బుధవారం (ఏప్రిల్ 16) రాత్రి ఆయన జపాన్ పర్య టనకు బయలుదేరనున్నారు.    సీఎం రేవంత్ రెడ్డి  ఈ నెల 22 వరకు అంటే ఆరు రోజుల పాటు రేవంత్ జపాన్ లో పర్యటిం చనున్నారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ వెంట   మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారుల బృందం కూడా ఉంటుంది.   ఈ పర్యటనలో భాగంగా ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అభివృద్ధిపై జపాన్ పర్యటనలో రేవంత్ బృందం అధ్యయనం చేయనుంది.  అలాగే తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతికతను అధ్యయనం చేయడంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడి పారిశ్రామికవేత్తలను, సంస్థలను ఆహ్వానించనున్నారు.  
సీఎం రేవంత్ జపాన్ పర్యటన.. లక్ష్యం ఏమిటో తెలుసా? Publish Date: Apr 16, 2025 11:02AM

లిక్కర్ స్కాం.. రెండు రోజుల ముందుగానే సిట్ విచారణకు విజయసాయిరెడ్డి

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం (ఏప్రిల్ 16) సిట్ విచారణకు హాజరయ్యారు.  లిక్కర్ కుంభకోణం కేసులో ఈ నెల 18న హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆయన రెండు రోజుల ముందుగానే విచారణకు హాజరుకానున్నట్లు ఆయన సిట్ కు సమాచారం ఇచ్చారు. ఇందుకు సిట్ అంగీకరించింది. దీంతో ఆయన బుధవారం (ఏప్రిల్ 16)న   సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడ సీపీ కార్యాలయంలో సిట్ అధికారులు విజయసాయిని విచారిస్తున్నారు. ఇదే మద్యం కుంభకోణం కేసులో కింగ్ పిన్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డి పోలీసుల విచారణకు  హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు.  హైదరాబాద్ లోని కసిరెడ్డి నివాసం, కార్యాలయాలలో సిట్ బృందం ఇటీవల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఈ కేసులో విజయసాయిరెడ్డిని విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కర్త, క్రియ, కర్మ కసిరెడ్డి రాజశేఖరరెడ్డే అని ఆరోపించిన సంగతి తెలిసిందే. అవసరమైన సమయంలో అందుకు సంబంధించిన విషయాలన్నీ వెల్లడిస్తానని కూడా విజయసాయిరెడ్డి అప్పట్లోనే చెప్పారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన విజయసాయి ఇచ్చే వాంగ్మూలం ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారుతుందని సిట్ బృందం భావిస్తోంది.  
లిక్కర్ స్కాం..  రెండు రోజుల ముందుగానే సిట్ విచారణకు విజయసాయిరెడ్డి Publish Date: Apr 16, 2025 10:47AM

పవన్ కల్యాణ్ కు ఏమైంది?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం (ఏప్రిల్ 15)న జరిగిన కేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన సెక్రటేరియెట్ వరకూ వచ్చారు. అయితే సమావేశానికి హాజరు కాకుండా  ఆయన   తన క్యాంప్ ఆఫీస్ కువెళ్లిపోయారు. ఆయన కేబినెట్ భేటీకి హాజరు కాకపోవడానికి బ్యాక్ పెయిన్ కారణంగా చెబుతున్నారు. కొన్ని రోజుల కిందట కూడా ఆయన తీవ్రమైన బ్యాక్ పెయిన్ తో బాధపడిన సంగతి తెలిసిందే. అప్పట్లో వైద్యులు కొన్ని రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని  సూచించారు. ఆయన విశ్రాంతి తీసుకున్నారు కూడా. పవన్ కల్యాణ్ ఒక్క  ఉపముఖ్యమంత్రే కాదు. ఆయన అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి కూడా. కీలక శాఖల మంత్రిగా ఆయన తరచూ విస్తృత పర్యటనలు చేయడంతో ఆయన వెన్నునొప్పి తిరగబెట్టి ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి పవన్  కల్యాణ్ అడవి తల్లి బాట కార్యక్రమంలో ఉన్న సమ యంలో సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయ పడ్డాడు. దీంతో ఆయన అడవితల్లి బాట కార్యక్రమం ముగిసిన వెంటనే హుటాహుటిన సింగపూర్ బయ లు దేరి వెళ్లారు. ఆ తరువాత  తన కుమారుడు మార్క్ శంకర్ ను ఎత్తుకుని విమానాశ్రయంలో కనిపించారు. అదే చివరి సారి ఆయన బహిరంగంగా కనిపించడం. సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన తరువాత పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల వెళ్లారు. అక్కడ తలనీలాలు సమర్పించి, కుమారుడి పేరుమీద అన్నదానం కూడా చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ వెళ్లలేదు. అందుకు కారణం కూడా ఆయన బ్యాక్ పెయినే అని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన మంత్రివర్గ సమావేశానికి కూడా రాకపోవడంతో వెన్ననొప్ప తీవ్రంగా ఉందని భావించాల్సి వస్తున్నది.   
పవన్ కల్యాణ్ కు ఏమైంది? Publish Date: Apr 16, 2025 10:23AM

ఏపిలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్

 విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ 22న నోటిఫికేషన్, మే 9న పోలింగ్ ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విజయసాయి రెడ్డి తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడంలో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నిక జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం (ఏప్రిల్ 15) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల, 29 వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు  తుది గడువు మే 2. పోలింగ్ మే  9న జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.   కాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి జరగనున్న ఉప ఎన్నికలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి విజయం లాంఛనమే. అయితే కూటమి పార్టీలలో ఏ పార్టీ ఈ ఎన్నికలో పోటీకి నిలబడు తుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీ  అయిన రాజ్యసభ స్థానంలో తమ పార్టీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు.  వైసీపీకి సంఖ్యా బలం లేకపోవటంతో ఆ పార్టీ తరఫున ఎవరూ నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి లేకపోవడంతో  రాజ్యసభ ఉప ఎన్నిక ఏకగ్రీవమే అవుతుందనడంలో సందేహం లేదు. అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్థి ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది.  
ఏపిలో  రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్  Publish Date: Apr 16, 2025 10:02AM

ఆడవాళ్ల మాట వినడమంటే చిన్నతనమా? మీకు తెలియని నిజాలు ఇవి..!

  గత కొన్ని సంవత్సరాల నుండి గమనిస్తే ఆడవాళ్లు వంటింటి కుందేళ్ల స్థానం నుండి మల్టీ టాస్కర్లు గా ఎదిగారు.  ఇంటి పని,  వంటి పని, ఉద్యోగంతో పాటు ఆర్థిక విషయాలు కూడా చూసుకుంటున్నారు. అయినా సరే పెళ్లి తర్వాత ఆడవాళ్ల పాత్ర చాలా వరకు తగ్గించాలని చూస్తారు మగవారు. ఇంటి విషయాలలో మగవారు తమ మాటే నెగ్గాలని అనుకుంటూ ఆడవారి మాటను లెక్కచేయరు. కానీ మహిళల గురించి చాలామందికి తెలియని కొన్ని నిజాలను అధ్యయనాలు బయటపెట్టాయి. ఆడవారికి ఏమీ తెలియదు.. వారికి ఏమీ చెప్పక్కర్లేదు అనుకోవడం మాత్రమే కాదు.. ఆడవారి మాట వినకుండా విస్మిరించే మగవారు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు ఉన్నాయి. ఒక అధ్యయనం వెలువరించిన వివరాల ప్రకారం.. మహిళల నుండి సలహాలు తీసుకోవడం వల్ల నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుందట.  మహిళల నుండి సలహాలు తీసుకోవడం వల్ల సమస్యలను పరిష్కరించే సామర్థ్యం మెరుగుపడుతుందని,  తప్పులు చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు. అందుకే పురుషులు స్త్రీల మాట వినాలని అంటారు. మహిళల విషయానికి వస్తే.. మహిళలు  చాలా కోణాలను   పరిగణలోకి తీసుకుంటారు, సహకారాన్ని ఇష్టపడతారు . మహిళల ఆలోచనలు  పురుషుల కంటే సమతుల్య దృక్పథాన్ని అందిస్తాయి, ఇది ఎక్కువ  విజయావకాశాలకు దారితీస్తుంది. వారి ఆలోచనా విధానం పురుషుల ఆలోచనా విధానానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఒక నిర్దిష్ట నిర్ణయం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వారు అంచనా వేయగలరు. పురుషులు ఇంట్లో,  కార్యాలయంలో మరింత సవాలుతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు.  ఇంట్లో,  కార్యాలయంలో మహిళల దృక్పథం  ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది. తన సలహా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక విజయమే కాకుండా, మానసిక ఆరోగ్యం,  ఇరువురి మధ్య  ఆనందం కూడా మెరుగవుతుంది. ఇంట్లో పిల్లలు ఉంటే వారి ముందు భార్యాభర్తలు  ఒక జట్టులా ఉంటారు. తరచుగా పిల్లల ముందు పురుషులు తమ భార్యలను తిడతారు.  ఇది వారి ఆత్మగౌరవాన్ని తగ్గిస్తుంది. అయితే  సమస్యలను ప్రైవేట్‌గా పరిష్కరించుకోవాలి.  భార్య గృహిణి అయినప్పటికీ, ఆర్థిక నిర్ణయాల కోసం  ఎల్లప్పుడూ ఆమె దగ్గరికి వెళ్లాలి. అది పొదుపు అయినా లేదా పెట్టుబడుల గురించి అయినా. ఆమె దాని సాంకేతిక అంశాలలోకి వెళ్ళలేకపోయినా, దానిని ఎలా చేయాలో,  మీరిద్దరూ కుటుంబంగా ప్రతి నెలా ఎంత ఆదా చేయాలో ఆమె మీకు చెప్పగలదు. పిల్లల ముందు ఒక జట్టుగా ఉండాలంటే, అది కిరాణా సామాను కొనడం లాంటి చిన్నదైనా లేదా కారు కొనడం లాంటి పెద్దదైనా  కలిసి మాట్లాడుకోవాలి.  ప్రతిదానిపైనా ఆమె అభిప్రాయాన్ని తీసుకోవచ్చు. దీని వలన    జీవితంలోని ప్రతి అంశంలోనూ తాను కూడా ఉన్నానని భార్య భావిస్తుంది. ఇది ఆడవారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చే అంశం.                                            *రూపశ్రీ.
ఆడవాళ్ల మాట వినడమంటే చిన్నతనమా? మీకు తెలియని నిజాలు ఇవి..! Publish Date: Apr 16, 2025 9:30AM

నాణ్యమైన నిద్రకు ఆటంకం కలిగించే నాలుగు తప్పులు ఇవి ..!

  శరీరం,  మెదడు తో పాటు మిగిలిన భాగాలకు నిద్ర అవసరమని చాలా మందికి తెలుసు. కానీ నిద్ర  బరువును, ఆలోచనా శక్తి, రోగనిరోధక శక్తితో పాటు  అనేక రకాల హార్మోన్లు మొదలైన వాటిని కూడా ప్రభావితం చేస్తుందని చాలా మందికి తెలియదు.  తక్కువ నిద్రపోతే లేదా నాణ్యత లేని నిద్ర వస్తే, అది  మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. వీటిలో మధుమేహం, ఊబకాయం, నిరాశ వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నాయి. నిద్రలేమికి అనేక కారణాలు ఉండవచ్చు. మంచి నిద్రకు ఆటంకం కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి.  అవేంటో తెలుసుకుని అధిగమిస్తే.. నాణ్యమైన నిద్రను పొందడం సాధ్యమవుతుంది. టీ, కాఫీలు తాగే సమయం.. భారతదేశంలో ప్రతి వీధిలో టీ ప్రియులు, కాఫీ ప్రియులు బోలెడు కనిపిస్తారు. ఇంట్లో కూడా రోజుకు కప్పుల కొద్ది కాఫీ, టీ తాగే వారు ఉంటారు.  కానీ ఈ రెండు పానీయాల వినియోగ సమయాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అవి  ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత కాఫీ, సాయంత్రం 5 గంటల తర్వాత టీ తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇది నిద్ర మీద చాలా దారుణ ప్రభావం చూపిస్తుందట. మద్యం.. మద్యం తాగడం చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. మద్యం తాగడం వల్ల బాగా నిద్రపడుతుందని  చాలా మంది నమ్ముతారు. కానీ మద్యం తాగడం వల్ల త్వరగా నిద్ర వదిలిపోతుందట. నిద్ర నాణ్యత తగ్గిపోతుందట.  నిద్ర.. తరచుగా ఉదయం చాలా త్వరగా నిద్రలేవడం వల్ల మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో నిద్ర పోవడం కొందరి అలవాటు.  దీని కారణంగా చాలా మంది 1 లేదా 1.5 గంటలు నిద్రపోతారు. కానీ ఇలా చేయడం వల్ల రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది. రాత్రిపూట నిద్రకు అంతరాయం కలగకుండా ఉండటానికి మద్యాహ్నం పడుకుంటే కేవలం అరగంట లోపే ఈ సమయాన్ని పరిమితం చేయాలట. 7-9 గంటల నిద్ర.. నిద్ర అవసరం వయస్సు మీద ఆధారపడి ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన వయోజన వ్యక్తికి 7-9 గంటలు నిద్రపోవడం మంచిదట.  6 గంటల కన్నా తక్కువ నిద్రపోతే అది చిరాకును పెంచుతుందని అంటున్నారు.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
నాణ్యమైన నిద్రకు ఆటంకం కలిగించే నాలుగు తప్పులు ఇవి ..! Publish Date: Apr 16, 2025 9:30AM

ఆంధ్ర నవయుగ వైతాళికుడు.. 

  కందుకూరి విరేశలింగం అనగానే అందరికీ ఉద్యమ స్పూర్తి గుర్తుకు వస్తుంది.  స్త్రీల కోసం పాటు పడిన సంఘసంస్కర్తలలో కందుకూరి విరేశలింగం తెలుగు ప్రజల గుండెల్లో గొప్ప స్థానం సంపాదించారు.  ఈయనను నవయుగ వైతాళికుడు అని పిలుస్తారు. భారత ప్రభుత్వం కందుకూరి విరేశలింగం ను రావు బహదూర్ అనే బిరుదుతో సత్కరించింది.  ఏప్రిల్ 16, 1848లో ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో జన్మించారు. ఆయన జయంతి సందర్బంగా ఆయన గూర్చి తెలుసుకుంటే.. కందుకూరి విరేశలింగం గూర్చి.. వీరేశలింగం ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన కేవలం నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు  తండ్రి మరణించాడు. దీంతో ఈయన  తన మామ వద్ద పెరిగాడు. విరేశలింగం గారి  విద్యా నైపుణ్యం,  స్నేహపూర్వక స్వభావం  పాఠశాల రోజుల్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 1869లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన తర్వాత, ఒక గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. వీరేశలింగం తెలుగు, సంస్కృతం,  ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. ఆయన తెలుగులో మొదటి నవలను రచించారు,  తెలుగు సాహిత్యానికి ఆత్మకథ,  వ్యాస ప్రక్రియలను పరిచయం చేశారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంపై మొదటి తెలుగు పుస్తకాన్ని కూడా రాశారు.  అనేక ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు. తెలుగు సమాజ సంస్కరణకు ఆయన చేసిన గణనీయమైన కృషి ఎంతో గౌరవనీయమైనది. అయితే రాజా రామ్ మోహన్ రాయ్,  కేశుబ్ చంద్ర సేన్ వంటి సామాజిక సంస్కర్తలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వెలుపల ఆయన కీర్తి పరిమితం. ఆయన మహిళల హక్కులకు చాలా మద్దతు ఇచ్చారు.  మహిళల హక్కుల గురించి చాలా  విస్తృత రచనలు చేశారు. బాల్య వివాహాలను,  యువతులను వృద్దులతో  వివాహం చేసే ఆచారాన్ని ఆయన ఖండించారు. వితంతు పునర్వివాహాన్ని కూడా ఆయన సమర్థించారు. విరేశలింగం గారి  రాడికల్ ఆలోచనలు,  పదునైన విమర్శలు అతన్ని చాలా మంది విమర్శకులకు,  ప్రజల ఎగతాళికి గురి చేశాయి. స్త్రీలను ఎల్లప్పుడూ ద్వితీయ పౌరులుగా పరిగణించరని వాదించడానికి ఆయన పురాతన గ్రంథాలను ఉపయోగించారు. రామాయణంలో, శ్రీరాముడు ఎల్లప్పుడూ సీతతో సభలో ఎలా ఉండేవాడో ఆయన నొక్కి చెప్పారు.   మహిళల పరిస్థితి దిగజారినప్పుడు భారతదేశం యొక్క క్షీణత ప్రారంభమైందని ఆయన నమ్మాడు. ఆయన బాలికలు,  మహిళల కోసం పాఠశాలలను స్థాపించాడు.  డిసెంబర్ 11, 1881న ఆంధ్రప్రదేశ్‌లో మొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపించాడు.  ఇది సంప్రదాయవాద సమాజం నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. సమాజం ఎంతగానో అవమానించినా, ఆయన తన జీవితకాలంలో దాదాపు 40 మంది వితంతువులకు పునర్వివాహం చేయించాడు. మహిళల హక్కులు,  విద్యను ప్రోత్సహించడానికి ఆయన వివిధ పత్రికలు,  జర్నల్స్‌ను ప్రచురించారు.  1887లో రాజమండ్రిలో బ్రహ్మ మందిరాన్ని ప్రారంభించాడు. 1885లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభ సమావేశానికి హాజరైన వారిలో వీరేశలింగం మొదటి వ్యక్తి.  1893లో భారత ప్రభుత్వం ఆయనను 'రావు బహదూర్' బిరుదుతో సత్కరించింది. ఆయన మే 27, 1919న 71 సంవత్సరాల వయసులో మరణించారు.                                               *రూపశ్రీ.
ఆంధ్ర నవయుగ వైతాళికుడు..  Publish Date: Apr 16, 2025 9:30AM

అభినయానికి ప్రాణమిచ్చిన నాటక రంగం.. 

  కళలకు భారతదేశం పెట్టింది పేరు.  ఇప్పుడు సినిమా హాళ్లలో సినిమాలు ఇంతగా వస్తున్నాయి కానీ.. కొన్ని సంవత్సరాల క్రితం వీధులలో నాటకాల రూపంలో వివిధ కథలు, చారిత్రాత్మక సంఘటనలను ప్రదర్శించేవారు. ఇలా పుట్టిందే నాటక రంగం. రాత్రి సమయాల్లో లాంతర్లు,  దివిటీలు పెట్టి నాటకాలను ప్రదర్శించేవారు.  పగలంతా కష్టం చేసిన ఆనాటి ప్రజలకు రాత్రయ్యే సరికి ఇదొక మంచి వినోదంగా ఉండేది. ఈ కోవలో హరికథలు,  బుర్రకథలు, తోలుబొమ్మలాట వంటివి ఎన్నో ఉన్నాయి. కానీ సినీ పరిశ్రమ ఇంత ఎత్తు ఎదగడానికి కారణమైనది మాత్రం నాటక రంగమే..  ప్రతి ఏడాది ఏప్రిల్ 16వ తేదీని తెలుగు నాటక రంగ దినోత్సవం గా జరుపుకుంటారు.  అయితే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఈ తెలుగు నాటక రంగ దినోత్సవం అనేది ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి విరేశలింగం పంతులు గారి జన్మదినోత్సవం సందర్బంగా  జరుపుకుంటారు.  తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కందుకూరి విరేశలింగం పంతులు గారి జన్మదినోత్సవం తెలుగు నాటక రంగ దినోత్సవంగా ఎలా మారింది?   తెలుగు నాటక రంగ దినోత్సవం గురించి పూర్తీగా తెలుసుకుంటే.. కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు నాటక రంగానికి మార్గదర్శకుడు (రచయిత). బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన నాటకాలు, నవలలు,  సామాజిక వ్యంగ్య రచనలు రాశారు. ఇవి తెలుగు సాహిత్యంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. అన్నింటికంటే మించి వీరేశలింగం గొప్ప సంఘ సంస్కర్త కూడా. ఆయన తన రచనల ద్వారా జాతి వివక్ష,  అనేక ఇతర సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ సమయంలో అరుదుగా ఉండే వితంతు పునర్వివాహాలను ఆయన ప్రోత్సహించారు.  మొదటి తెలుగు నాటకం కందుకూరి రాసిన వ్యవహార ధర్మ బోధని మొదటిసారిగా ప్రదర్శించబడింది. 2007లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కందుకూరి వీరేశలింగం పుట్టినరోజును 'తెలుగు నాటకరంగ దినోత్సవం'గా జరుపుకుంటామని ప్రకటించింది. అప్పటి నుండి నాటక కార్యకర్తలు ఏప్రిల్ 16ని తెలుగు నాటక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. కందుకూరి విరేశలింగం పంతులు గారు ఆధునిక నాటక ప్రదర్శనకు రూపం ఇచ్చిన వారిలో ఒకరు. విరేశలింగం పంతులు గారు డైలాగ్స్ రూపంలో బ్రాహ్మ వివాహము అనే నాటకాన్ని హాస్య సంజీవని అనే పత్రికలో రచించారు.  ఆ తరువాత వ్యవహార ధర్మభోధిని  అనే నాటకాన్ని ప్రకటించారు. ఆనాటి గ్రాంథిక భాష కాలంలో వ్యవహారిక బాషలో ఒక నాటకాన్ని సాగించడం పెద్ద సాహసమనే చెప్పాలి.  వేదిక మీద ప్రదర్శించిన తొలి నాటకం ఇది. తెలుగు రాష్ట్రంలో  తొలి నాటక సమాజాన్ని స్థాపించిన ఘనత కందుకూరి విరేశలింగం పంతులు గారిదే. ఈ కారణంగానే కందుకూరి విరేశలింగం పంతులు గారి జన్మదినోత్సవాన్ని తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.                                 *రూపశ్రీ.  
అభినయానికి ప్రాణమిచ్చిన నాటక రంగం..  Publish Date: Apr 16, 2025 9:30AM

చాహల్ స్పిన్ మ్యాజిక్.. కోల్ కతా నైట్ రైడర్స్ గింగిరాలు

16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం ఐపీఎల్ లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 15) పంజాబ్ కింగ్స్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చాహల్ స్పిన్ తో మ్యాజిక్ చేశాడు. దాంతో కోల్ కతా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. ఐపీఎల్ అంటేనే బంతిపై బ్యాట్ ఆధిపత్యం.. పరుగుల వరద పారుతుంది. కానీ మంగళవారం ( ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్ అందుకు పూర్తి భిన్నంగా సాగింది. ఈ మ్యాచ్ లో బంతిదే ఆధిపత్యం. పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ లో బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది. ఫలితంగా తక్కువ స్కోర్లే నమోదయ్యాయి.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111పరుగులకే కుప్పకూలింది. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో హర్షిత్ రాణా రాణించాడు. మూడు ఓవర్లు వేసిన హర్షిత్ రాణా కేవలం పాతిక పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, నరైన్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వైభవ్ అనిరిచ్ లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్ సిమ్రాన్ సింగ్ 30 పరుగులు, ప్రియాన్స్ ఆర్యా 22 పరుగులు చేశారు.మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. దీంతో కోల్ కతా ముందు 112 పరుగుల స్వల్ప విజయలక్ష్యం ఉంది. అందరూ కూడా కోల్ కతా నైట్ రైడర్స్ విజయం లాంఛనమే అని భావించారు. అయితే పంజాబ్ బౌలర్లు అందరి అంచనాలనూ తల్ల కిందులు చేశారు. కోల్ కతా నైట్ రైడర్స్ ను వంద పరుగులలోపే కట్టడి చేశారు. ఐపీఎల్ చరిత్రలోఇంత తక్కువ స్కోరును కాపాడుకుని గెలవడం ఇదే ప్రథమం. ఆ విషయంలో పంజాబ్ కొత్త రికార్డు సృష్టించింది. ఇక పంజాబ్ బౌలర్లలో యుజువేంద్ర చాహల్ మాయ చేశాడు. తన స్పిన్ మాయా జాలంతో కోల్ కతా బ్యాటింగ్ లైనప్ నడ్డి విరిచాడు. నాలుగు ఓవర్లు వేసిన చాహల్ 28 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. చాహల్ తను వేసిన చివరి ఓవర్లో రస్సెల్ రెండు సిక్స్ లు ఓ ఫోర్ బాదడంతో ఆ దశలో కోల్ కతాకు గెలుపుపై ఆశలు చిగురించాయి. అయితే జాన్సన ఆ ఆశలను చిదిమేశాడు. 3.1 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ 15.1 ఓవర్లలో కేవలం 95 పరుగులకే ఆలౌట్ అయ్యి 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ చాహల్ ను వరించింది. 
చాహల్ స్పిన్ మ్యాజిక్.. కోల్ కతా నైట్ రైడర్స్ గింగిరాలు Publish Date: Apr 15, 2025 12:37AM

టీ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల రచ్చ

జానా X రాజగోపాల్... ప్రేమ్‌సాగర్ X వివేక్ తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో చర్చలు జరిగాయి. ఇక అప్పటి నుంచి విస్తరణ .. అదిగో, ఇదిగో అన్న ప్రచారం చక్కర్లు కొట్టింది. ఆశావహులాంతా హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సామాజిక వర్గాల వారీగా నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. అయితే విస్తరణ జాప్యం అవుతుండటంతో ఆశావహుల్లో అసంతృప్తి బయటపడుతోంది. తమకు పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని బహిరంగంగానే విమర్శలు చేస్తుండటం నాయకత్వానికి తలనొప్పిగా మారుతున్నదట. అలాంటి వారి జాబితాలో తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు చేరారు.  ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి అడ్డుపడుతున్నారని అక్కసు వెళ్లగక్కారు. మంచిర్యాల ఎమ్మెల్యే  ప్రేమ్‌సాగర్‌రావ్ కూడా తనకు మంత్రి పదవి వస్తుందో రాదో  అని అనుమానపడుతున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా  ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన నేత అన్యాయం చేస్తున్నారని బహిరంగంగానే స్టేట్‌మెంట్ ఇచ్చారు. ప్రేమ్‌సాగర్‌రావు మంచిర్యాల సభలో చేసిన ఆ వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. పార్టీలు మారి వచ్చిన వారికి పదవులు ఇస్తారా? కష్టకాలంలో పదేళ్ళు పార్టీని కాపాడిన వారికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.  తన అభిమానులు కార్యకర్తలు పార్టీ మారి వచ్చిన వారికి మంత్రి పదవి వస్తుంది అనే వార్తలతో డిప్రెషన్ లో ఉన్నారని, కష్ట కాలంలో పార్టీ తో ఉన్న తమ పరిస్థితి ఏంటని తనను ప్రశ్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు ఈ కామెంట్స్ రాష్ట్ర కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టినట్లు అయ్యిదంట. పార్టీ కోసం పని చేసిన ప్రేమ్‌సాగర్ రావు ఎన్నికల ప్రచార సమయంలో ఇంద్రవెల్లి సభ మొదలు, మంచిర్యాలలో ఖర్గే సభలు విజయవంతం చేశారన్న గుడ్‌విల్ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రేమ్ సాగర్‌రావ్‌కి మంత్రి పదవి ఇవ్వకుంటే కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ పోతుందోనని  కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనలో పడిందంట. జిల్లా నుంచి ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌కు కేబినెట్‌ బెర్త్ ఖరారైందన్న  ఉహగానాల నేపథ్యంలో ప్రేమ్‌సాగర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయంశంగా మారింది. వివేక్‌ టార్గెట్‌ గానే ప్రేమ్‌ సాగర్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారనే టాక్ జిల్లాలో నడుస్తుందట. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన నేతలు మంత్రి పదవులు కోరుతున్నారని పరోక్షంగా వివేక్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారంటున్నారు.  ఇటీవల మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా సిఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ జనాభాకు అనుగుణంగా పదవులు దక్కలేదని ...ఈసారైనా మంత్రి వర్గ విస్తరణలో చోటు కల్పించాలని కోరారు. ఈ ఈక్వేషన్‌లను దృష్టిలో ఉంచుకుని వివేక్‌కు ఈసారి కేబినెట్ బెర్త్‌ ఖాయం అనే ప్రచారం జరగుతోంది. ఈ సందర్భంలో వివేక్‌ టార్గెట్‌గా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కామెంట్స్ చేశారంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ విస్తరణలో జరుగుతున్న జాప్యం నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యే బాహాటంగా ప్రభుత్వ పెద్దల సమక్షంలోనే విమర్శించే స్థాయికి రావడంతో నేతల మధ్య గ్యాప్‌ ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో అని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.
టీ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల రచ్చ Publish Date: Apr 15, 2025 11:37PM

వైసీపీలో సజ్జలకే మళ్లీ అందలం

 పీఏసీ కన్వీనర్‌గా మాజీ సలహాదారు వైసీపీ ఓడిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టినట్టు కనిపించిన జగన్ మళ్లీ ఆయననే అందలమెక్కిస్తున్నారు. ఇక నుంచి పార్టీకి దిశానిర్దేశం చేసే బాధ్యత సజ్జల భుజాలపై పెట్టారు  మాజీ సీఎం జగన్ తాజాగా నియమించిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కన్వీనర్‌గా సజ్జలను నియమించడంతో పార్టీలో ఆయన  ప్రాధాన్యతను మరింత పెరిగినట్లైంది. పార్టీలో మళ్లీ సజ్జల పెత్తనమే కొనసాగనుండటంతో కొందరు సీనియర్ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారంట.  మరోవైపు సదరు కమిటీలో ముద్రగడ పద్మనాభంకు స్థానం కల్పించడం, దానికి ఆయన సంబరపడిపోతూ ప్రకటనలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.  వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని నియమించారు. మొత్తం 33 మంది సభ్యులతో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్‌గా ఈ పీఏసీని ప్రకటించారు. ఎంపీలు అవినాశ్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు రోజా, విడదల రజని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేశ్, నారాయణస్వామి, అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు ముద్రగడ పద్మనాభం, సాకే శైలజానాథ్, నందిగం సురేశ్ తదితరులకు ఈ కమిటీలో స్థానం కల్పించారు. ఈ రాజకీయ సలహాల కమిటీకి ఇప్పటికే పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్ గా నియమించారు.  దాదాపు వైసీపీలో కీలక నేతలందరికీ ఈ కమిటీలో స్థానం లభించినట్లైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా అన్నీ తానై జగన్‌ ప్రభుత్వాన్ని నడిపించారు. ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్‌లపై వైసీపీ నేతలు చెలరేగిపోయేవారు. ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాలో తన ప్రెస్‌మీట్‌లను వైరల్ చేసేవారని  పోసాని కృష్ణమురళి స్వయంగా పోలీసు విచారణలో వెల్లడించారు. అంటే ప్రత్యర్ధులపై దాడుల నుంచి పార్టీ వ్యవహారాలన్నీ ఎలా డీల్ చేయాలనే విషయం వరకు అన్నీ సజ్జల రామకృష్ణా రెడ్డే స్వయంగా చూసుకునేవారన్నమాట. వైసీపీని వీడిన కోటంరెడ్డి, విజయసాయిరెడ్డి నుండి మొన్న పోసాని వరకూ అందరూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి వంటివారు శల్య సారథ్యం చేస్తూ జగన్‌ను ముంచేస్తున్నారని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతుంటాయి. గత ఎన్నికల్లో టికెట్ల పంపిణీ సమయంలో కూడా పలువురు నేతలు జగన్ కోటరీ అంటూ సజ్జలను టార్గెట్ చేశారు. అయితే వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత కూడా జగన్‌ మేల్కొలేదన్న అభిప్రాయం  వ్యక్తమవుతోంది.  ఓటమి తర్వాత జగన్ సజ్జలని పక్కన పెట్టినట్లు కనిపించారు. అయితే విజయసాయిరెడ్డి వంటి ముఖ్యనేత పార్టీని వీడి వెళ్ళిపోవడం సజ్జలకు బాగా కలిసి వచ్చిందంటున్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్కరికీ రూ. లక్షల చొప్పున ప్రభుత్వ సొమ్ము జీతభత్యాలుగా చెల్లిస్తూ 50 మందికిపైగా సలహాదారులని నియమించుకున్నారు. ఇప్పుడంత సీన్ లేకపోవడంతో 33 మంది సీనియర్ నేతలతో ఓ రాజకీయ సలహా కమిటీని ఏర్పాటు చేసుకున్నారంట. దానికి సజ్జల రామకృష్ణా రెడ్డిని సమన్వయకర్తగా నియమించారు. అంటే పార్టీలో ఇప్పటికే స్టేట్ కోఆర్డినేటర్‌గా ఉన్న సజ్జల పెత్తనం మళ్లీ మొదలైనట్లే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని మెజారిటీ నేతలు భావిస్తున్నారట..   సకల శాఖల మంత్రి పాత్ర పోషిస్తూ సజ్జలే చాలా సందర్భాల్లో సీఎంలా వ్యవహరించరన్న టాక్ ఉంది.. విజయసాయిరెడ్డి కూడా పదేపదే కోటరీ అని విమర్శలు చేయడానికి అదే కారణమంటారు. ఓడిపోయిన తర్వాత సజ్జలను, కోటరీని పక్కన పెట్టినట్లు కనిపించిన జగన్ మళ్లీ ఆయనకు ప్రధాన బాధ్యతలు అప్పగించడం వైసీపీ సీనియర్లకు మింగుడుపడటం లేదంట.  జగన్ తాజా నిర్ణయంతో పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందంట. జగన్ లో మార్పు వచ్చింది కోటరీని దూరం పెడుతున్నారని భావించే లోపే ... మళ్లీ పాత బ్యాచ్ అందరికీ పగ్గాలు అప్పగిస్తుండడంతో, నిలకడలేని నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ పార్టీలో ఉండడం కంటే ఆపార్టీని వీడడమే మేలని మెజార్టీ నేతలు భావిస్తున్నారంట. 
వైసీపీలో సజ్జలకే మళ్లీ అందలం Publish Date: Apr 15, 2025 11:20PM

17 నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సకుటుంబ సమేతంగా ఈ నెల 16న ఢిల్లీకి వెడుతున్న చంద్రబాబు  అక్కడ నుంచి విదేశీ పర్యటనకు వెడతారు. ఈ నెల 20న  ద్రబాబు 75వ జన్మదినం. తన వజ్రోత్సవ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలలో జరుపుకుంటారు.   మోదీ అమరావతి పర్యటన మే 2న ఖరారైన సంగతి విదితమే. మోడీ ఏపీ పర్యటనకు ముందే చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చేస్తారు. కాగా చంద్రబాబు విదేశీ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనది కావడంతో వివరాలను వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు.  
17 నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన Publish Date: Apr 15, 2025 11:18PM

సొంత వైద్యం వంటబట్టదు అంటే ఇదేనా?

స్వరాష్ట్రంలో  పని చేయని పీకే వ్యూహాలు! ప్రశాంత్ కిషోర్, పీకే.. పేరు చాలు. పరిచయం అవసరం లేదు.పీకే అంటే చాలు, ఆయన ఎవరో, ఆయన ఏమిటో అందరికీ అర్థమైపోతుంది.ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు అంత మంచి గుర్తింపు వుంది. అయితే అది ఆయన గతం. ప్రస్తుతం ఆయన, వేషం మార్చారు. రాజకీయ అరంగేట్రం చేశారు. సో.. ఇప్పడు పీకే పొలిటీషియన్, రాజకీయ నాయకుడు.  జన సురాజ్  పార్టీ (జేఎస్పీ) వ్యవస్థాపక అద్యక్షుడు. ఈ సంవత్సరం చివర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య భూమికను పోషించేందుకు తహతహ లాడుతున్న రాజకీయ నాయకుడు. ఈ ఎనికల్లో ఎలాగైనా కింగ్, కాదంటే కనీసం కింగ్ మేకర్ కావాలని కలలుకంటున్నారు.   అవును గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలు, ఏపీ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి  వరకు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదలు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరకు ఎందరో నాయకులకు, ఎన్నో పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్  ఇప్పడు స్వయంగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. వ్యూహాత్మకంగా పావులు  కదుపుతున్నారు.అయితే  అదేదో సామెత చెప్పినట్లు  అందరికీ వర్కౌట్ ఆయన  వ్యూహలు, సొంతానికి వచ్చేసరికి అతంగా పనిచేస్తున్నట్లు లేదని అంటున్నారు.   ఔను పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు.. సొంత వైద్యం వంటబట్టదు అని పెద్దలు ఊరికే అన్నారా? ఇప్పడు తాను స్వయంగా రాజకీయవేత్తగా మారిన పీకేకు ఆయన వ్యూహాలు ఆయన సోంత పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడటం లేదు.. ఫలించడం లేదు.   నిజానికి నాలుగేళ్ళ కిందట (2021)పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి పని చేసిన పీకే  ఇక పై  ఏ రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా పని చేయనని ప్రకటించారు. అలాగే  క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేది లేదనీ అన్నారు. అంతే కాదు,  నేను రాజకీయాలకు పనికిరాను  అని తనకు తానే   సెల్ఫ్  సర్టిఫికేట్  ఇచ్చుకున్నారు. అయితే, ఆ తర్వాత కొద్ది కాలానికే  ఆ ఒట్టు తీసి గట్టున పెట్టారు. కాంగ్రెస్  పార్టీలో చేరేందుకు,  బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు  ప్రయత్నాలు సాగించారు. కాలికి బలపం కట్టుకుని దేశం అంతా తిరిగారు. శరద్ పవార్ మొదలు కేసీఆర్  వరకు ప్రముఖ నేతలు అందరినీ కలిశారు. అందరినీ కలిపారు. మరోవంక కాంగ్రెస్ పునర్జీవనానికి ఉడతా భక్తిగా   ఉచిత  సలహాలు కూడా ఇచ్చా రు. చివరకు  తాతకు దగ్గులు నేర్పినట్లు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సిడబ్ల్యుసి) సభ్యులను కూర్చోపెట్టి పాఠాలు చెప్పారు. ఇలా దేశ రాజకీయాల్లో  తన కంటూ ఒక స్థానం సంపాదిం చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు.  సరే ఆ ప్రయత్నాలు ఏవీ అంతగా పని చేయలేదు. మధ్యలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అప్పటి అధికార పార్టీలతో డీల్  కుదుర్చుకున్నారు. అయితే  అక్కడా కథ అడ్డం తిరిగింది. ఉభయ రాష్ట్రాల్లో ఆయన వ్యూహాలు ఉడక లేదు.ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ బండ్లు బోల్తా కొట్టాయి. అక్కడ ఏపీలో  జగన్ రెడ్డి, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఇద్దరి కిద్దరు చిత్తుగా ఓడి పోయారు. జగన్ రెడ్డి పరిస్థితి అయితే మరీ ఘోరం, పదకొండు పరుగులకే ఔటై పోయారు. ఇక చివరి ప్రయత్నంగా స్వరాష్ట్రం బీహార్ లో సొంత జెండా ఎగరేశారు. జన సురాజ్  పార్టీని స్థాపించారు. సంవత్సరం పైగా రాష్ట్రంలో పాద యాత్ర చేస్తున్నారు. అయితే  అదేమిటో కానీ, శకునం చెప్పే బల్లి  కుడితిలో పడింది అన్నట్లుగా.. యూపీ, బెంగాల్, ఢిల్లీ, ఏపీ ఇలా ఎక్కడెక్కడో, ఎవరెవరినో గెలిపించిన  ప్రశాంత్ కిషోర్ వ్యూహం  స్వరాష్టంలో,  పని చేస్తున్నట్లు లేదని అంటున్నారు.  ఇటీవల బీహార్ లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో జేఎస్పీ తొలిసారిగా ఎన్నికల బరిలో దిగింది.అయితే  నలుగు స్థానాలకు ఒంటరిగా పోటీ చేసిన జేఎస్పీకి  ఒక్క సీటు దక్కలేదు. కానీ  జేఎస్పీ ఖాతాలో పది శాతం ఓట్లు అయితే పడ్డాయి. అలా జేఎస్పీ చీల్చిన ఓట్లు ప్రతిపక్ష కూటమిని దెబ్బతీశాయి. మూడు సిట్టింగ్ స్థానాలతో పాటుగా మొత్తం నాలుగు స్థానాలలో ఆర్జేడీ సారధ్యంలోని మహా ఘటబంధన్ ఓడిపోయింది. రెండు నియోజక వర్గాల్లో అయితే  అధికార ఎన్డీఎ కూటమి అభ్యర్ధులకు వచ్చిన మెజారిటీ కంటే జేఎస్పీకి వచ్చిన ఓట్లు ఎక్కువని లెక్క తేలింది. దీంతో  పీకే అసలు రంగు బయట పడిందని బీహార్ ప్రజలు పీకే పార్టీని, బీజేపీ బీ  టీమ్ గా భావిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపధ్యంలో ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో జేఎస్పీ ఓటు షేర్  ఏకంగా  పది నుంచి మూడు శాతానికి పడి పోయిది. దీంతో కింగ్ ఆర్ కింగ్ మేకర్ కావాలనే పీకే   కల కలగానే మిగిలి పోతుందని అంటున్నారు. అలాగే ఇటీవల పాట్నాలో జేఎస్పీనిర్వహించిన తొలి భారీ బహిరంగ సభకు లక్షల్లో జనం వస్తారని  భావించి ఏర్పాట్లు చేస్తే వేలల్లో కూడా జనం రాలేదు. అందుకే పీకే పట్టుమని పది నిముషాలు అయినా మాట్లాడకుండానే తట్టా బుట్టా సర్దేశారు. సో .. బీహార్ ఎన్నికల్లో పీకే పాత్ర ఏమిటన్నది ఇప్పడు ప్రశ్నార్ధకంగా మారిందని అంటున్నారు. అలాగే, ఉప ఎన్నికల్లో పోటీ చేయడం వ్యూహకర్త చేసిన వ్యూహాత్మక తప్పిదంగా భావిస్తున్నారు.
సొంత వైద్యం వంటబట్టదు అంటే ఇదేనా? Publish Date: Apr 15, 2025 5:53PM

వైజాగ్ టు అమరావతి వయా హైదరాబాద్!

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రద్దుపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ, విశాఖపట్నంల మధ్య నడిచే రెండు విమాన సర్వీసులను రద్దు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. విశాఖపట్నం, విజయవాడల మధ్య ఉదయం నడిచే రెండు విమాన సర్వీసులను రద్దు చేయడం వల్ల ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆ విమాన సర్వీసులు రద్దు చేయడం వల్ల తనకు ఎదురైన ఇబ్బందిని ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ పట్నం నుంచి విజయవాడ వెళ్లాలంటే ముందు హైదరాబాద్ చేరుకోవలసి వస్తోందని, అక్కడ నుంచి మళ్లీ మరో ఫ్లైట్ ఎక్కి విజయవాడకు రావాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇప్పుడు విశాఖపట్నం టు అమరావతి వయా హైదరాబద్ లా పరిస్థితి మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  విశాఖ-విజయవాడ నగరాల మధ్య ఉదయం నడిచే రెండు విమాన సర్వీసులు రద్దు చేయడం వల్ల తీవ్ర అసౌకర్యం కలుగుతోందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తనకు, ఇతర ప్రయాణికులకు ఎదురైన అనుభవాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆంధ్రాలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే తెలంగాణ మీదుగా వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.  "ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం నుంచి   ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి వెళ్లాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా ప్రయాణించాల్సి రావడం బాధాకరమని గంటా ఆపోస్టులో పేర్కొన్నారు. మంగళవారం (ఏప్రిల్ 15) ఉదయం తాను విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు విమానంలో చేరుకుని, అక్కడ నుంచి విజయవాడ విమానం అందుకుని గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యిందని చెప్పారు.  ఈ మేరకు తాను ప్రయాణం చేసిన విమానం టికెట్లను కూడా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా తనలాగే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరుకున్నారని వివరించారు. విశాఖ-విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతోనే  ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. 
 వైజాగ్ టు అమరావతి వయా హైదరాబాద్! Publish Date: Apr 15, 2025 5:23PM

నెల్లూరు జిల్లాలో నాటకీయ పరిణామాలు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై రాజకీయ వైరంతో ప్రత్యర్థి పెట్టించిన 17 కేసులకు సర్వేపల్లి శాసన సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చట్టాన్ని గౌరవించి కోర్టుకు హాజరౌతుంటే.. వీటికి కారణంగా చెబుతున్న ఆయన ప్రత్యర్థి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయనపై లుకౌట్ నోటీసులు ఇచ్చి పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.  సోమిరెడ్డి నేడు కూడా ఆనందయ్య కరోనా కేసు విచారణకు హాజరయ్యారు.  కాకాణి పరారీపై సోమిరెడ్డి మంగళవారం (ఏప్రిల్ 15) ఆక్షేపణలు తెలిపారు. గతంలో కాకాణి వాడిన భాషపైనా, తిట్లపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే పోలీసు నోటీసులు తీసుకుని విచారణకు హాజరు కావాలని సవాల్ చేశారు.  కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు.   
నెల్లూరు జిల్లాలో నాటకీయ పరిణామాలు Publish Date: Apr 15, 2025 5:10PM

ఏపీ లిక్కర్ స్కాం.. విజయసాయికి సిట్ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వేగం పెంచింది. ఓ వైపు ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజా కసిరెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడుతూనే, హైదరాబాద్ లోని ఆయన నివాసం కార్యాలయాలలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నది. మరో వైపు ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా మాజీ ఎంపీ, ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 18న విజయవాడలోని సీపీ కార్యాలయంలో హాజరు కవాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొంది.  ఇప్పటికే విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం కర్త, కర్మ, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖరరెడ్డే అని మీడియా ముఖంగా చెప్పిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టు షేర్ల వ్యవహారంలో విజయసాయి గతంలో సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కసిరెడ్డి రాజశేఖరరెడ్డే ఈ కుంభకోణానికి కర్త, కర్మ క్రియ అని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. 
ఏపీ లిక్కర్ స్కాం.. విజయసాయికి సిట్ నోటీసులు Publish Date: Apr 15, 2025 5:02PM

వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిలు పిటిషన్ ను విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదు దారు హర్షవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. కాగా వంశీకి బెయిలు ఇవ్వవద్దంటూ పటమట పోలీసలు కౌంటర్ దాఖలు చేశారు. దీంతో వాదనలు వినడం కోసం వంశీ బెయిలు పిటిషన్ ను విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టు ఎల్లుండికి అంటే గురువారం (ఏప్రిల్ 17)కు వాయిదా వేసింది. ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.  
 వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌  విచారణ వాయిదా  Publish Date: Apr 15, 2025 4:29PM

ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు.  7.5 కోట్ల రూపాయల విలువైన గుర్గావ్ ల్యాండ్ స్కామ్  వ్యవహారంలో రాబర్ట్ వాద్రాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. తొలుత జారీ చేసిన నోటీసుల ప్రకారం ఈ నెల 8న విచారణకు హాజరుకావాల్సి ఉండగా వాద్రా గైర్హాజరయ్యారు.  దీంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసి ఈ రోజు హాజరు కావాలని పేర్కొంది. దీంతో రాబర్ట్ వాద్రా మంగళవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.  బీజేపీ రాజకీయ ప్రతికారంలో భాగంగానే తనకు ఈడీ నోటీసులు జారీ చేసిందని ఆ సందర్భంగా రాబర్ట్ వాద్రా ఆరోపించారు.  తాను ప్రజల తరఫున గళమెత్తిన ప్రతి సందర్భంలోనూ బబీపీ అణచివేయడానికి ప్రయత్నిస్తోందని వాద్రా అన్నారు.  అన్నారు.
ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా Publish Date: Apr 15, 2025 4:09PM