కేసీఆర్ తిట్లను యదాతధంగా వాడటం మీడియాకు తగునా?

posted on: Apr 21, 2026 11:14AM

 

నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు? ఈ బూతుల‌ను యాజ్ ఇట్ ఈజ్ మీడియా వాడేయ‌డం పై ఎలాంటి  అభిప్రాయానికి రావాలి?రాజకీయాల్లో నాయకులు వాడే భాష, ముఖ్యంగా కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య సాగుతున్న ఈ  మాటల యుద్ధం. ఇవాళ్టిది  కాదు. అయితే కేసీఆర్ జ‌గిత్యాల స‌భా వేదిక పై నుంచి.. మాట్లాడిన ఈ మాట‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  

నేను చావను కొ*కా ఇది బూతా? అని చూస్తే సాంకేతికంగా కొ*కా అనేది తిట్టు లేదా బూతు పదం కాదు. ఇది  తండ్రి కొడుకును పిలిచే పిలుపు. కానీ, వాడే స‌మ‌యం, సందర్భంతో పాటు ఆ టోన్ ని బట్టి కూడా దాని అర్థం మారుతుంది. నిజానికి నేను నీ తండ్రిలాంటి వాడ్ని.. పెద్దోణ్ణ‌ని చెప్ప‌డం అది కూడా అగౌర‌వంగా చెప్ప‌డం లాంటిది.

రాజకీయ వేదికలపై ప్రత్యర్థిని ఉద్దేశించి  కొ*కా అనడం అనేది అత్యంత అగౌరవకరమైన, హేళన చేసే పదంగానే చూస్తారంతా.కేసీఆర్ శైలిలో ఇది  తెలంగాణ యాస అని ఆయన మద్దతుదారులు సమర్థించుకున్నా, సంస్కారవంతమైన రాజకీయాల్లో ఇది అన్-పార్లమెంటరీ భాష కిందకే వస్తుంది.

కేసీఆర్, రేవంత్ గ‌తంలో వాడిన ఇలాంటి నాటు ప‌దాలు,  భాష తరచుగా వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి.  గతంలో ప్రతిపక్షాలను ఉద్దేశించి కేసీఆర్.. మేక పోతు గంతులు, సన్నాసులు, దద్దమ్మలు,  బొంద పెడతా, నాలిక కోస్తా  వంటి పదాలు వాడారు.ఇక రే.. వంతుగా చూస్తే.. ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీ లోప‌ట‌- బయట.. బిడ్డ, బేవకూఫ్, లంగలు, దొంగలు వంటి పదాలతో పాటు, ఇటీవల కొందరు బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అత్యంత అసభ్యకరమైన ఉదాహరణకు.. భడ్వే  పదాలు వాడారని అసెంబ్లీలో గొడవ జరిగింది.

మీడియా ఈ మాటలను  యాజ్ ఇట్ ఈజ్  వాడటం వెనుక.. మ‌త‌ల‌బు ఏంటో చూస్తే.. మీడియా ఈ బూతులను సెన్సార్ చేయకుండా లేదా హైలైట్ చేస్తూ వాడటంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. టీఆర్‌పీ వేటలో భాగంగా నాయకులు బూతులు తిట్టుకుంటే ఆ వార్తలకు వ్యూస్, రేటింగ్స్ ఎక్కువగా వస్తాయి. అందుకే మీడియా సంస్థలు వాటిని  బ్రేకింగ్ న్యూస్ గా మలుస్తాయి. యాజ్ ఇట్ ఈజ్ ప‌దాల‌తో టైటిళ్లు పెట్టేస్తాయి. 

గతంలో అసభ్య పదాలను  బీప్ చేసేవారు లేదా వార్తల్లో రాయడానికి సంకోచించేవారు. కానీ ఇప్పుడు నాయకుడు అన్నప్పుడు మేమెందుకు దాచాలి? అనే ధోరణి పెరిగింది. మీడియా వీటిని పదే పదే చూపడం వల్ల సామాన్య ప్రజల్లో, ముఖ్యంగా యువతలో రాజకీయాలంటేనే తిట్టుకోవడం  అనే తప్పుడు సంకేతం వెళ్తోంది. ఇది ప్రజాస్వామ్య గౌరవాన్ని తగ్గిస్తోంది.

నాయకులు తమ వైఫల్యాలను లేదా ప్రత్యర్థుల తప్పులను ఎత్తిచూపడానికి లాజిక‌ల్ పాయింట్ల‌ కంటే తిట్ల పై ఎక్కువ ఫోక‌స్ పెడుతున్నారు. దీనిని మీడియా కట్టడి చేయాల్సింది పోయి, మరింత ప్రచారం కల్పించడం వల్ల రాజకీయాల్లో నాణ్యత పడిపోతోంది. ఇది చూసేవారికి వినోదం కలిగించవచ్చు కానీ, సమాజానికి మాత్రం చేటు చేస్తుందని అంటారు ప్ర‌జాస్వామిక వాదులు.

google-ad-img
    Related Sigment News
    • Loading...