ఆనవాయితీకి చెల్లు చీటీ.. సీజే ప్రమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్ దూరం

ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య దూరం రోజు రోజుకూ పెరుగుతోందనడానికి మరో తార్కానం, మంగళవారం రాజ్ భవన్ లో తెలంగాణ కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమత్రి కేసీఆర్ దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడమే. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులైన సంగతి విదితమే. ఆయన మంగళవారం అంటే జూన్ 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చేత గవర్నర్ తమిళి సై రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి  రాజ్ భవన్ నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆహ్వానం అందింది.

అయితే ఆయన సీజే ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే విషయంలో సీఎంవో నుంచి ఎటువంటి సమాచారం లేదు. అయితే విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కోబోవడం లేదు.  ఇందుకు ఆయన తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీ శాట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు.  అయితే టీశాట్ ప్రారంభం సాకు మాత్రమేనని, ఆయన ఉద్దేశపూర్వకంగానే సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కాగా గతంలో తెలంగాణ తొలి  సీజేగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారాన్ని సంప్రదాయానికి భిన్నంగా రాజ్ భవన్ లాన్స్ లో ఘనంగా నిర్వహించేందుకు చొరవ చూపిన కేసీఆర్ ఇప్పుడు రాజ్ భవన్ లో సీజేగా ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టడమే రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య పెరిగిన అగాధానికి తార్కానంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం కావాలనుకుంటే అంటే లేదా కేసీఆర్ సీజే ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలనుకుంటే టీశాట్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసుకోవడం ప్రభుత్వం చేతిలో పని.. ఒక వేళ వాయిదా వద్దనుకుంటే సమయాన్ని మార్చుకునే వీలు కూడా ఉంటుంది.

అయితే కేసీఆర్ ఆ రెండూ చేయకుండా ఏకంగా సీజే ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండటానికే నిర్ణయించుకోవడాన్ని పరిశీలకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ తొలి సీజేగా రాథాకృష్ణన్ ప్రమాణ స్వీకారం సమయంలో అప్పటి గవర్నర్ తో సీఎం కేసీఆర్ కు సత్సంబంధాలు ఉండేవి, దాంతో తొలి సీజే ప్రమాణ స్వీకారోత్సవాన్ని అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటంతో రాజ్ భవన్ లోకి అడుగు పెట్టేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడటం లేదు. అందుకే ఆనవాయితీకి భగం  కలిగినా భే పర్వా అన్నట్లుగా కేసీఆర్ సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉండేందుకే నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.