50 వేల రుణం మాఫీ.. రైతులకు సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. హుజురాబాద్ ఎన్నికో మరో కారణమో కాని... పెండింగ్ సమస్యలను వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. విపక్షాలకు ఆయుధంగా మారిన  రైతు రుణమాఫీపైనా కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ కేబినెట్. ఈ ఏడాది రూ.50 వేల లోపు రైతు రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి నెలాఖరులోపు రైతు రుణమాఫీ పూర్తి చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు.సర్కార్ తాజా నిర్ణయం రుణమాఫీ నిర్ణయంతో 6 లక్షల మంది రైతులకు ప్రయోజనం దక్కనుంది. 2108 ఎన్నికల సమయంలో లక్ష రుపాయల రైతు రుణ మాఫీ ప్రకటించారు కేసీఆర్. కాని అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా రుణమాఫీ అమలు చేయలేదు. 25 వేల లోపు రుణాలను మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకున్నారు.

ఇటీవల కాలంలో దూకుడు పెంచిన ప్రతిపక్షాలు రైతు రుణమాఫీపై సీఎం కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నాయి. రైతుల నుంచి దీనిపై వ్యతిరేకత వస్తోంది. దీంతో రైతు రుణమాఫీ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, రుణమాఫీ, ఇతర వ్యవసాయ అంశాలతోపాటు పత్తిసాగుపైనా సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. తెలంగాణ పత్తికి ప్రత్యేక డిమాండ్‌ ఉన్న దృష్ట్యా సాగు విస్తీర్ణం పెంచాలని, ఇందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

కేంద్రం తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తెలంగాణలో అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ కింద ఐదేళ్ల సడలింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై మంత్రిమండలి చర్చించింది. ఈ ఆసుపత్రుల సత్వర నిర్మాణం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటివరకు జరిగిన పురోగతిపై మంత్రిమండలి సభ్యులు చర్చించారు. త్వరలో వీటి నిర్మాణం కోసం శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.