రేవంత్ భయంతో ఏకమవుతున్నారా? మోడీ, కేసీఆర్ డైరెక్షన్ లో ముందస్తు ఎన్నికలా? 

అవునంటే కాదనిలే.. కాదంటే అవుననిలే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు అలాగే ఉంటాయంటారు. తాజాగా పార్టీ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై ఆయన చేసిన ప్రకటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముందస్తు ఎన్నికలు ఉండవని చెప్పడం ద్వారా.. కేసీఆర్ ముందస్తు సంకేతమిచ్చారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. బీజేపీ హైకమాండ్ డైరెక్షన్ లోనే కేసీఆర్ ముందుకు వెళుతున్నారనే వాదన వస్తోంది. 

హుజూరాబాద్ ఉప ఎన్నిక..  తెరాస ద్విశతాబ్ది వేడుకలు, ప్లీనరీ సన్నాహాలు ... ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి  కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని చెప్పారు.  మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా రెండేళ్లు సమయం ఉంది. ఈ రెండేళ్లలో చేయవలసిన  అన్ని పనులు  చేసుకుని, సరైన సమయంలోనే ఎన్నికలకు పోదాం” అంటూ ముఖ్యమంత్రి తేనెతుట్టెను కదిల్చారు.  అయితే, ముందస్తు ఎన్నికల గురించి పొలిటికల్ సర్కిల్స్’లో కొంత కాలంగా జరుగతున్న చర్చకు సమాధానంగా, క్లారిటీ ఇచ్చే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పార్టీ సమావేశంలో ముందస్తు ప్రస్తావన చేశారా? లేక వ్యూహాత్మకంగా, అనుమానిస్తున్న తిరుగుబాటుకు చెక్ పెట్టేందుకు, మరో రెండు సంవత్సరాలు తానే అధికారంలో ఉంటామని చెప్పుకునేందుకు వ్యుహాత్మకంగా   ఈ ప్రస్తావన తీసుకొచ్చారా అంటే, వ్యూహాత్మకంగానే, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ముచ్చట తెచ్చారనే అభిప్రాయం, అనుమానాలే రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. 

ముఖ్యమంత్రి ముందస్తు ఉండదు అని ప్రకటించిన కొద్ది సేపటికే, బీజేపీ నాయకురాలు  విజయశాంతి, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవు అన్నారంటే, ఖచ్చితంగా ఉంటాయనే అనుకోవచ్చని ట్వీట్ చేశారు. అందుకు ఆమె ముఖ్యమంత్రి నిజం చెప్పరాదని శపధం చేశారనే సైటైరిక్ రీజన్ చెప్పారనుకోండి. ఇక తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే, ముందస్తు తథ్యం అనే అభిప్రాయంతో ఉన్నారు. అంతే కాదు, బల్లగుద్ది మరీ ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు వెళతారని అంటున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ ముందస్తు ఎన్నికల దిశగానే ఉన్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. గుజరాత్‌ ఎన్నికల సమయానికి ముఖ్య మంత్రి కేసీఆర్‌ తన ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని, గుజరాత్‌ ఎన్నికలతో పాటే, వచ్చే సవత్సరం, 2022 చివర్లో  తెలంగాణ ఎన్నికలూ వస్తాయని చెప్పారు. ఇదంతా ప్రధాని మోదీ డైరెక్షన్‌లోనే జరుగుతోందని ఆరోపించారు. 

రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే కుట్ర జరుగుతోందన్నారు రేవంత్ రెడ్డి. ఈ సమయంలో ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలు రావని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్న రేవంత్ రెడ్డి ముందస్తు ఎందుకు, ఎలా వస్తుందో కూడా చెప్పుకొచ్చారు, 2022 ఆగస్టు 15తో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందని, ఆ సందర్భంగా కొత్త శకానికి నాంది అని చెబుతూ కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళతారని రేవంత్ రెడ్డి ముందస్తుగా, ముందస్తు ఎన్నికల గుట్టు విప్పారు. అయితే  రేవంత్ రెడ్డి అన్నట్లుగా, ముఖ్యమంత్రి కేసీఆర్, మునుపటి బక్కోడు కాదు. ఆయన బలం పెరిగింది. అదే స్థాయిలో, అంతకంటే కొంచెం ఎక్కువగా బలహీనతలు పెరిగాయి .. అన్నిటీనీ మించి భయంపెరిగింది. 

ముందుగా చెప్పి మరీ ముఖ్యమంత్రి నెత్తిన కాలు పెట్టేందుకు  ఇంతై.. ఇంతింతై ..అన్నట్లుగా  వామనునిలా పాదం ఎత్తిపెట్టిన రేవత్ రెడ్డి భయం కేసీఆర్’ను భయపెడుతోందని అంటున్నారు. అందుకే ... బీజేపీతో జట్టు కట్టి కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని దెబ్బ తీసే వ్యూహంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు పోతున్నారని చెబుతున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం డైరెక్షన్లో ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకువెళతారని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. చివరకు ఏమవుతుంది అనే విషయంలో ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కొంత క్లారిటీ వస్తే రావచ్చని పరిశీలకులు  భావిస్తున్నారు. అయితే కేసీఅర్ లో అంతర్యుద్ధం, అంతర్మధనం రెండూ సమాంతరంగంగా  సాగుతున్నాయని అంటున్నారు.