పాముకు పాలు పోస్తున్న చంద్రబాబు

పాముకు పాలు పొయొద్దు.. పోస్తే అది తిరిగి మనల్నే కాటేస్తుంది. ఇదీ కొన్నాళ్ల క్రితం వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు  తెలుగుదేశం నేతలకు చెప్పిన మాటలు. వైసీపీ నేతలను దగ్గరకు రానీయొద్దు.. తెలుగుదేశం నేతలను ప్రలోభపెట్టాలని వైసీపీ నేతలు,  వారి సానుభూతి పరులు ప్రయత్నిస్తున్నారు, మనతోనే వాళ్ల పనులు చేయించుకుంటారంటూ పార్టీ నేతలకు చాలా పెద్ద ఎత్తునే హితబోధ చేశారు చంద్రబాబు. అలాంటి వాళ్లను దగ్గరకు రానీయొద్దంటూ పెద్ద లెక్చరే పీకారు.  కానీ అదే చంద్రబాబు రెండు రోజులు తిరిగే సరికి.. వైసీపీతో అంటకాగిన వారిని,  గత ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డికి కళ్లు, ముక్కు, చెవులుగా ఉన్న వారిని అక్కున చేర్చుకుంటున్నారు. వారికి ఆర్థికంగా భారీ మొత్తంలో లాభాలు తెచ్చిపెడుతున్నారు. పెద్ద ఎత్తున భూములూ కట్టబెట్టేస్తున్నారు. తాజాగా జరిగిన ఎస్ఐబీపీ సమావేశంలో గత ప్రభుత్వంలో విద్యుత్ రంగం నుంచి, ఆ రంగంలోని వివిధ కాంట్రాక్టర్లు, విద్యుత్ కంపెనీల నుంచి రావాల్సిన అమ్యామ్యాలను వసూలు చేసి పెట్టిన వారికి పెద్ద పీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు ఏపీ సీఎం.  షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ యాజమాన్యానికే చెందిన మరో సంస్థ ఇండోసోల్ కంపెనీకి భారీ ఎత్తున భూములు కట్టబెట్టింది ఏపీ ప్రభుత్వం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 58469 కోట్ల రూపాయలతో ఇండోసోల్ ప్రాజెక్టు పెట్టుబడి పెడుతుందని.. దానికి ఆమోదం తెలిపింది ఏపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఎస్ఐపీబీ సమావేశంలో 119659 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెడుతున్న వివిధ సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇందులో 58469 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్న ఇండోసోల్ ప్రాజెక్టు కూడా ఒకటి. ఓ విధంగా చెప్పాలంటే ఇండోసోల్ కోసం లేటెస్ట్ ఎస్ఐపీబీ సమావేశాన్ని ప్రభుత్వం పెట్టినట్టుగా కన్పిస్తోంది.  ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పిన ఇండోసోల్ ప్రాజెక్టుకు కేటాయించిన భూములు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. 8348 ఎకరాల భూమిని నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో కేటాయింపులు జరుపుతున్నారు. ఇక పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నందుకు ప్రభుత్వం వైపు నుంచి భారీగా ఆర్థిక, ఆర్థికేతర ప్రొత్సహాకాలివ్వాలని ఇండోసోల్ కోరింది. ఆర్థిక ప్రొత్సహకాలు ఎంతో తెలుసా.. ఏకంగా 41254.50 కోట్ల రూపాయలు. ఇది కాకుండా,  ఆర్థికేతర ప్రొత్సహకాలు ఉన్నాయి. వీటిల్లో ఇండోసోల్ పెట్టిన మెజార్టీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ స్థాయిలో జగన్ కు బినామీ అనుకున్న సంస్థకు ఎలా కట్టబెడతారనేది ఇప్పుడు తెలుగుదేశం సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ.  పోనీ ఇదేదో పై స్థాయిలో జరుగుతోంది.. చూసీ చూడనట్టు పోదామన్నా.. వీల్లేని పరిస్థితులు కల్పిస్తోంది ఇండసోల్ సంస్థ. ఇండోసోల్ అధినేత విశ్వేశ్వర రెడ్డి నేరుగా చేస్తున్నారో.. లేక ఆయన పేరుతో ఎవరైనా చేస్తున్నారో తెలియదు కానీ,  తెలుగుదేశం పార్టీకి చెందిన   వారు.. పార్టీ సానుభూతి పరులు విద్యుత్ కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన టెండర్లను వేస్తే వాటిని అడ్డుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహరంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావు పెత్తనం చేస్తున్నారట. సదురు సంతోష్ రావు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి భక్తుడు. ఈ సంతోష్ రావు చెప్పిన వారికే కాంట్రాక్టులు దక్కుతున్నాయి. హిందూపురం తోపుదుర్తి గ్రామంలో విశ్వేశ్వర రెడ్డి సోదరుడు బ్రహ్మానంద రెడ్డి విద్యుత్ కాంట్రాక్టర్. దీంతో విశ్వేశ్వర రెడ్డి అండతో.. సంతోష్ రావు సహకారంతో సదురు బ్రహ్మానంద రెడ్డికే పనులు దక్కుతున్నాయట. తెలుగుదేశం పార్టీకి  చెందిన క్లాస్ వన్ కాంట్రాక్టర్ గంగాధర నాయుడు విద్యుత్ కాంట్రాక్టులకు టెండర్లు వేయాలన్నా.. వేయనీయకుండా అడ్డుకుంటున్నారట. మళ్లీ చంద్రబాబు చెప్పిన పాముకు పాలు పోస్తే సామెతను ఇక్కడ గుర్తు చేయాల్సి వస్తోంది. పై స్థాయిలో విశ్వేశ్వర రెడ్డిని బలోపేతం చేస్తున్నారు.. క్షేత్ర స్థాయిలో టీడీపీ వాళ్లను కాదని.. విశ్వేశ్వర రెడ్డి తమ్ముడిని బలోపేతం చేస్తున్నారు. వీళ్లు ఆర్థికంగా బలోపేతమై.. అమరావతిలో కూర్చొన్న విశ్వేశ్వర రెడ్డి చంద్రబాబకు, లోకేషుకు ఎర్త్ పెట్టడమో,  హిందూపురంలో బాలయ్య సీటుకు ఎర్త్ పెట్టడమో చేయరని గ్యారెంటీ ఏంటీ అనే చర్చ జరుగుతోంది. పాము పాలు థియరీ చెప్పడం కాదు.. పాటిస్తే ఇంకా బాగుంటుందని తెలుగుదేశం కేడర్.. లీడర్లు విసుక్కుంటూ సణుక్కుంటున్నారట.
పాముకు పాలు పోస్తున్న చంద్రబాబు Publish Date: Mar 14, 2025 8:03PM

టార్గెట్ మిథున్ రెడ్డి.. భుజం కసిరెడ్డిది!

ఎవరీ రాజ్ కసిరెడ్డి..? జగన్ దగ్గర రాజ్ కసిరెడ్డి అంత ప్రాపకం ఎలా సంపాదించారు..? పెద్దిరెడ్డి అండ్ సన్స్ కు రాజ్ కసిరెడ్డికి ఉన్న లింకులేంటీ..? జూనియర్ పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా..? రాజ్ కసిరెడ్డి.  మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బుధవారం (మార్చి12) సీఐడీ విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ఈ పేరు గురించే ఏపీ రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్టు అంశంలో విజయసాయి రెడ్డి విచారణకు హజరైనా.. మీడియా అడిగిన ప్రశ్నలకు విజయసాయి రెడ్డి బదులిస్తూ లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని తేటతెల్లంగా చెప్పేశారు. దీంతో జగన్ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని వైసీపీలో నెంబర్ టూగా వ్యవహరించి.. ఇప్పుడు రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి చెప్పేశారు. అంటే లిక్కర్ స్కాంను జరిగిందని నిర్ధారించారు విజయసాయి రెడ్డి. ఈ పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి ప్రస్తావించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరు..? అనే చర్చ జరుగుతోంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. వరంగల్ జిల్లా వాస్తవ్యుడు. ఐఐటీ ఖరగ్ పూర్ లో విద్యనభ్యసించాడని వైసీపీ నేతలు చెబుతారు. ముందుగా ఐ-ప్యాక్ టీంలో ఓ సాధారణ మెంబరుగా ఉండేవారట. ఆ తర్వాత తనకున్న సామాజిక వర్గం నేపథ్యం చూపించారో.. లేక తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారో కానీ.. రాజ్ కసిరెడ్డి నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా మారిపోయారని వైసీపీ వర్గాలే చెబుతాయి. అదీ ఎంతగా అంటే.. పార్టీలో చాలా కాలం ఐటీ వింగ్ లో పని చేసిన వారికి కూడా ఇవ్వని ఐటీ సలహాదారు పదవిని రాజ్ కసిరెడ్డికి కట్టబెట్టేటంతగా ఎదిగిపోయారు రాజ్ కసిరెడ్డి.  అయితే ఐటీ సలహలకంటే.. రాజ్ కసిరెడ్డి సంపద సృష్టి సలహలే ఎక్కువ ఇచ్చినట్టున్నారు.. ఎక్సైజ్ శాఖ నుంచి ఎంత వరకు పిండొచ్చు.. ఎన్నిరకాలుగా పిండొచ్చు.. ఏయే దారుల్లో పిండొచ్చనే కథా కమామిషు మొత్తం రాజ్ కసిరెడ్డి ద్వారానే జరిగిదని టాక్. డబ్బులు పిండుకోవడం.. ఆ డబ్బులను మళ్లించడం.. ఆ డబ్బులను అనుకున్న గమ్యస్థానానికి చేర్చడం వంటి పనులను తూచా తప్పకుండా చేసింది అంతా రాజ్ కసిరెడ్డేనని తెలుస్తోంది. ఇదే విషయాన్ని విజయసాయి రెడ్డి కూడా చెప్పేశారు. అయితే రాబోయే ప్రమాదాన్ని రాజ్ కసిరెడ్డి ముందే గ్రహించాడో..  కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని అంచనా వేశాడో కానీ.. ఏడాదిన్నరకు ముందే వైసీపీ క్యాంప్ నుంచి రాజ్ కసిరెడ్డి సైలెంటుగా జంప్ అయిపోయినట్టు తెలుస్తోంది. అయినా లిక్కర్ స్కాంలో రాజ్ కసిరెడ్డి భాగస్వామ్యం పెద్ద ఎత్తున ఉండడంతోపాటు.. లిక్కర్ స్కాం సూత్రధారి-పాత్రధారి కసిరెడ్డేనని విజయసాయిరెడ్డి స్పష్టం చేయడంతో మరోసారి రాజ్ ఎపిసోడ్ మళ్లీ తెర మీదకు వచ్చింది. ఇదంతా ఓ ఎత్తు అయితే.. ఇప్పుడు లిక్కర్ స్కాం రాజ్ కసిరెడ్డి ఎంత వరకు దొరుకుతాడో ఏమో కానీ.. జూనియర్ పెద్దిరెడ్డి అంటే.. మిధున్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టు సమాచారం. ఈ మద్యం కిక్ బ్యాగ్స్ వ్యవహరంలో తమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ మిధున్ రెడ్డి కొన్ని రోజుల క్రితం ప్రెస్ కాన్పరెన్స్ కూడా పెట్టాడు. దీంతో తన అరెస్ట్ గురించి మిధున్ రెడ్డి ముందుగానే ఊహించినట్టున్నారనే చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖకు మంత్రిగా నాటి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి ఉన్నారు. కానీ ఆయన్ను డమ్మి చేసి ఎక్సైజ్ శాఖకు అనధికారిక మంత్రిగా చెలాయించింది పెద్దరెడ్డి రామచంద్రా రెడ్డేనని అందరికీ తెలిసిందేనంటున్నారట. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి రాజ్ కసిరెడ్డి ప్రస్తావించడం.. అదే రోజున మిధున్ రెడ్డి స్పందించడం వంటివి చూస్తుంటే.. మిధున్ రెడ్డికి కటకటాల కష్టాలు తప్పవేమోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.  ఇదే సందర్భంలో మరో అంశం కూడా తెర మీదకు వచ్చింది. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో కీలక అధికారిగా పని చేసిన ఓ ఉద్యోగి అప్రూవర్ గా మారినట్టు సమాచారం. ఇదే నిజమే అయితే.. అతి త్వరలో మిధున్ రెడ్డి కేంద్రంగా అతి పెద్ద డెవలప్మెంట్ జరిగే సూచనలు కన్పిస్తున్నాయి.
టార్గెట్ మిథున్ రెడ్డి.. భుజం కసిరెడ్డిది! Publish Date: Mar 14, 2025 5:49PM

ఇంట్లోకి ప్రవేశించిన చిరుతపులి.. ఏం చేసిందంటే?

అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత కారణంగా వన్యప్రాణలు ఆవాసాలు కోల్పోతున్నాయి. జనావాసాలపై పడుతున్నాయి. ఆహార, నీటి కోసం అవి వనాలను వదిలి జనాల నివాసాలవైపు వస్తున్నాయి. ఈ పరిణామం అటు వన్యప్రాణులకు, ఇటు మనుషులకూ కూడా ప్రమాదకరంగానే మారుతోంది. తాజాగా అలా జనావాసాలపై వైపు వచ్చిన ఓ చిరుత పులి.. ఓ ఇంట్లోకి దూరి ఆ ఇంటి పెంపుడు కుక్కను నోట కరుచుకుని పారిపోయింది. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయ్యింది. చిరుతపులి ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో ఆ ఇంటి యజమాని ఫోన్ లో బిజీగా ఉన్నారు. చిరుత మాత్రం పిల్లిలా ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఆడుకుంటున్న కుక్క పిల్లను నోట కరుచుకుని పారిపోయింది. ఈ సంఘటన పుణెలోని భోర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. జయానంద్ కాలే అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన చిరుత జయానంద్ కాలే పడుకుని ఉన్న మంచం కింద ఉన్న కుక్కపిల్లను నోట కరుచుకుని ఉడాయించింది.   ఈ వీడియోపై నెటిజనులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పెంపుడు కుక్కను కోల్పోయిన జయానంద్ కాలేపై సానుభూతి వ్యక్తం చేస్తూనే, అతడు అదృష్టవంతుడని కామెంట్లు పెడుతున్నారు. కుక్కపై కాకుండా అతనిపై దాడి చేసి ఉంటే పరిస్థితి ఏంటని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల నుంచి ప్రజలకు రక్షణ కరవైందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.  
ఇంట్లోకి ప్రవేశించిన చిరుతపులి.. ఏం చేసిందంటే? Publish Date: Mar 14, 2025 3:42PM

కొందరు అధికారుల తీరు.. కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దిగజారు!

ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడుతూ జనం తెలుగుదేశం కూటమికి అద్భుత విజయాన్ని అందించి అధికారం కట్టబెట్టారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దివ్యంగా ఉంది. జనం స్వేచ్ఛగా, నిర్భయంగా, ప్రశాంతంగా బతుకుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి. ప్రజలలో సంతృప్తి స్థాయి పెరుగుతోంది. అయినా ఎక్కడో ఏదో వెలితి.. తెలుగుదేశం శ్రేణుల్లో కించిత్తు అసహనం, అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు కూడా అన్నీ బాగా ఉన్నా కూటమి సర్కార్  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు అధికారుల పట్ల ఉదాశీనంగా ఎందుకు ఉంటోందన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాలనాయంత్రాంగంపై పట్టు కోల్పోయిందా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. కొందరు అధికారుల తీరు కూటమి సర్కార్ ప్రతిష్ఠ మసకబారేలా వ్యవహరిస్తున్నా.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి  అధికారులపై నియంత్రణ లేకుండా పోయిదా అన్న భవం కలిగేలా కొందరుర అధికారుల తీరు ఉంటోంది.  తాజాగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి అధికారులపై నియంత్ర లేదన్న భావన వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో అధికారులు ఆయా శాఖల మంత్రులను కూడా లేక్క చేయకుండా వ్యవహరించిన ఉదంతాలపై రాష్ట వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకటి రెండు శాఖలని కాకుండా పీఎంవో సహా దాదాపు అన్ని శాఖల్లోనూ కొందరు అధికారుల వ్యవహార శైలి కూటమి సర్కార్ కు చెడ్డ పేరు తీసుకువచ్చేలా, ప్రభుత్వ ప్రతిష్టను మసకబరిచేలా ఉందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు.  తాజాగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ కాంట్రాక్టర్లతో వ్యవహరించిన తీరుపై  సెక్రటేరీయేట్, రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. బిల్లుల బకాయిలపై మాట్లాడేందుకు తన వద్దకు వచ్చి విజ్ణప్తి చేసిన కాంట్రాక్టర్లతో పియూష్ కుమార్ దురుసుగా   కాంట్రాక్టుల్లో లాభాలు వచ్చినప్పుడు బానే తీసుకున్నారు కదా? ఇప్పుడు బిల్లుల కోసం కొంత కాలం వేచి చూడలేరా అంటూ మండిపడ్డారట.  ప్రజలకు, ప్రభుత్వానికీ వారథులుగా ఉండాల్సిన అధికారి ఇలా వారి మధ్య అగాధం సృష్టించేలా మాట్లాడటమేమిటన్న విస్మయం వ్యక్తం అవుతోంది. పియూష్ కుమార్ తీరు వల్ల ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజీ అయ్యిందని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.  ఈ సందర్భంగానే పీయూష్ కుమార్ గతంలో చేసిన నిర్వాకాలను కూడా గుర్తు చేసుకుంటున్నాయి.  కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలోనే  పులివెందులకు చెందిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరిపేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా కొందరు కాంట్రాక్టర్లకు ఎలా చెల్లింపులు జరుపుతారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే పులివెందుల కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకు నిశ్శబ్దంగా ఆమోద ముద్ర వేసింది పియూష్ కుమారే అని తరువాత తేలింది.  సాంకేతిక తప్పిదంగా పీయూష్ కుమార్ అప్పట్లో వివరణ ఇచ్చుకున్నారు. అలాగే రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్ కు సంబంధించి వేరు బి్ల్లుల హడావుడి చెల్లింపుల వెనుక కూడా పీయూష్ కుమారే ఉన్నారని తేలింది. ఇలా పియూష్ కుమార్ ప్రభుత్వ ప్రతిష్ట మసకబార్చడం, వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా పని చేస్తాన్నారా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.   ఇక సీఎంఓలోని ఒకరిద్దరు ఉన్నతాధికారుల అండతో పీయూష్ ఆర్థిక శాఖను తన ఇష్టం వచ్చిన రీతిలో నడుపుతున్నారన్న ఆరోపణలు ప్రభుత్వ వర్గాల నుంచే వస్తున్నాయి.  ఒక్క పియూష్ కుమార్ అనే కాకుండా మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ కూడా తమతమ శాఖలలో కొందరు ఉన్నతాధికారుల తీరు వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.  ఇటువంటి అధికారులపై అధికారులపై చర్యలు తీసుకోకుండా ఇంకా ఉపేక్షిస్తే ప్రభుత్వ ప్రతిష్ట, వ్యక్తిగతంగా చంద్రబాబు ప్రతిష్ట కూడా మసకబారుతుందని తెలుగుదేశం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
కొందరు అధికారుల తీరు.. కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దిగజారు! Publish Date: Mar 14, 2025 2:47PM

రాజ్యసభకు వెళ్తానంటున్న యనమల .. చంద్రబాబు ఛాన్స్ ఇస్తారా?

తన రాజకీయ భవిష్యత్ పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. యనమల రామృకృష్ణుడు తొలిసారి 1983లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. మంత్రిగా, స్పీకర్‌గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గా అనేక కీలక పదవులు నిర్వహించారు.  యనమల కుమార్తె దివ్య ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా తుని శాసనసభ్యురాలి గా ఉన్నారు. 1983 నుండి 2004 వరకూ 6 సార్లు ఎమ్మెల్యే గా యనమల రామకృష్ణుడు గెలిచిన నియోజకవర్గం అది. 2009 లో తొలిసారి ఓటమి చెందినా ఆయనకు చంద్రబాబు 2013లో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యనమల శాసనమండలి సభ్యుడుగా కొనసాగుతున్నారు.  2014లో ఎమ్మెల్సీగా ఉంటూనే చంద్రబాబు కేబినెట్‌లో యనమల కీలక బాధ్యతలు నిర్వర్తించారు.  పార్టీ అధికారంలో లేనప్పుడు సైతం పీఏసీ చైర్మన్ వంటి పదవులు ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామకృష్ణుడి పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది.  అయితే ఈసారి ఆయనకు ఎమ్మెల్సీగా చాన్స్ ఇవ్వకపోవడంతో పొలిటికల్ గా యనమల కెరీర్ కు చెక్ పడినట్టే అని ప్రచారం మొదలైంది. తెలుగుదేశం పార్టీకి దక్కిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు బీసీలకు కేటాయించినా యనమలకు మాత్రం ఛాన్స్ దక్కలేదు. బీటీ నాయుడు,  బీద రవిచంద్రలను బీసీ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎంపిక చేశారు.  ఆ క్రమంలో యనమల తన పొలిటికల్ ఫ్యూచర్‌పై నోరు విప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అవకాశమిస్తే రాజ్యసభకు వెళతానని, లేకపోతే విశ్రాంత జీవితం గడుపుతానని యనమల రామకృష్ణుడు తెలిపారు. శాసనమండలి సభ్యుడిగా ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న తనను.. ఆ తర్వాత ఏం చేస్తారని అడుగుతున్న సన్నిహితులు, శ్రేయోభిలాషులకు ఇదే సమాధానం చెబుతున్నానని పేర్కొన్నారు. ఆయన గురువారం శాసనసభ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తెలుగుదేశం అభ్యర్థుల్ని ప్రకటించిన రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఫలానా వారిని ఎంపిక చేశామని ఆయన చెబితే... స్వాగతించానన్నారు. తనకు రెండుసార్లు శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పానన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి సేవలందించానని తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు ఖరీదైనవిగా మారిపోయాయని, ప్రజాస్వామ్యానికి ఇది మంచి పరిణామం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తమ్మీద యనమల రాజ్యసభ కోరిక తీరుతుందో లేదో చూడాలి
రాజ్యసభకు వెళ్తానంటున్న యనమల .. చంద్రబాబు ఛాన్స్ ఇస్తారా? Publish Date: Mar 14, 2025 12:59PM

నెక్స్ట్ ఏంటి?

రాష్ట్ర ముఖ్యమంత్రులు తరచూ ఢిల్లీ వెళ్ళడం కొత్త విషయం కాదు. ఇప్పుడే కాదు గతంలోనూ వుంది. ముఖ్యంగా  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పడు, ముఖ్యమంత్రులు ఒక కాలు ఢిల్లీలో మరో కాలు హైదరాబాద్ లో అన్నట్లు ఇటూ అటూ చక్కర్లు కొడుతూ ఉండేవారని అంటారు. అందులోనూ ప్రధానంగా అధిష్టానం మొక్కులు చెల్లించుకోవడంకోసమో,  రాష్ట్రం నుంచి అధిష్టానికి చేరిన ఫిర్యాదులకు, సంజాయిషీ ఇచ్చుకోవడం కోసమో అప్పట్లో ముఖ్యమంత్రుల ఢిల్లీ యాత్రలు సాగేవని అప్పటి రాజకీయాలు ఎరిగిన సీనియర్ పాత్రికేయ మిత్రులు అంటుంటారు.  అయితే రాష్ట్ర విభజన తర్వాత వరసగా రెండు మార్లు ముఖ్యమంత్రిగా ఉన్న  బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావు మాత్రం ఢిల్లీ వెళ్ళిన సందర్భాలు తక్కువనే చెప్పుకోవాలి. ఒక విధంగా చూస్తే ఆయన వెళ్ళిన సందర్బాలను వేళ్ళ మీదలెక్క పెట్ట వచ్చునేమో. ఢిల్లీ వెళ్ళినా, పంటి నొప్పి, కంటి నొప్పి పేరున వెళ్లి రావడమే కానీ, ప్రత్యేకించి  అధికారిక కార్యకలాపాల కోసంగా  ఢిల్లీ వెళ్లిన సందర్భాలు,  ప్రధాని లేదా ఇతర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలు, రాష్ట్రానికి  రావలసిన నిధుల గురించి చర్చించిన సందర్భాలు  చాలా చాలా తక్కువ. అలాగని  కేంద్రంతో ఏ సంబంధాలు లేకుండా కాలం వెళ్ళ దీశారా, అంటే లేదు. రాజకీయ శతృమిత్ర సంబంధాల విషయంలో ఆయన చేయాల్సిన రాజకీయం ఆయన చేశారు.  కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి రాష్ట్ర మంత్రులు,అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వంతో అధికారిక స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరపడం, అవసరం అయితే వారే ఢిల్లీ వెళ్లి పని కానిచ్చుకోవడమే కానీ, ముఖ్యమంత్రి స్వయంగా ఫైల్స్ చంకన పెట్టుకుని ఢిల్లీ వెళ్ళడం అప్పట్లో అంతగా లేదు.   అలాగని కేంద్రంతో సయోధ్యంగా ఉన్నారా అంటే అదీ లేదు. ధాన్యం కొనుగోలు విషయం మొదలు అనేక విషయాల్లో కేంద్రంపై రాష్ట్రంలోనే కాదు, ఢిల్లీ వెళ్లి మరీ వీధి పోరాటాలు చేశారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చిన అనేక సందర్భాలలో  బీఆర్ఎస్ సిటీ అంతా నల్ల జెండాలు కట్టి, గో బ్యాక్ మోడీ నినాదాలతో నిరసన వాతావరణం సృష్టించింది. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్  కనీస మర్యాద పాటించలేదు. ప్రోటోకాల్ నిబంధనలను బేఖాతర్ చేశారు. ప్రధాని పర్యటనకు వచ్చిన ప్రతి సారీ ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు. ప్రధానమంత్రి వట్టి చేతులతో వస్తే ఎంత పోతే ఎంత, మూటలతో వస్తేనే స్వాగతం లేదంటే, నల్ల జెండాలు, గో బ్యాక్ నినాదాలే స్వాగతం చెపుతాయి అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ , ప్రభుత్వం వ్యవహరించాయి. అప్పట్లో  బీఆర్ఎస్ వ్యవహార శైలి,   మా ఇంటికొస్తే, మాకేం తెస్తావ్, మీ ఇంటి కొస్తే మాకేం పెడతావ్  అన్నట్లు ఉండేది.  సరే, అప్పట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి ఇచ్చింది, ఏమి ఇవ్వలేదు అనేది వేరే చర్చ. వదిలేద్దాం.  అదలా ఉంటే  టీఆర్ఎస్  పేరును బీఆర్ఎస్ గా మార్చి జాతీయ జెండా ఎత్తిన తర్వాత కేసీఆర్  బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకం చేసేందుకు కాలికి బలపం కట్టుకుని దేశం అంతా తిరిగొచ్చారు. సరే,  ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించక పోగా, ఉన్నదీ పోయింది, ఉంచుకున్నదీ పోయింది అన్నట్లు  రాష్ట్రంలో అధికారం పోయింది. లోక్ సభలో బీఆర్ఎస్ కు కనీస ప్రాతినిధ్యం  కూడా  లేకుండా పోయింది.  అది వేరే విషయం.  ఇక ఇప్పడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే.. గత కొంత కాలంగా ఆయన  ఢిల్లీ పర్యటనలు ఎక్కువయ్యాయి. ఒక పూట ఇక్కడ ఒక పూట అక్కడ అన్నట్లుగా అటూ ఇటూ పరుగులు పెడుతున్నారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళితే  పార్టీ అధిష్టాన్ని కలవకుండా వెనక్కి రావడం చాలా అరుదు. కానీ రేవంత్ రెడ్డి ఒకటి రెండు సందర్భాలలో అది కూడా అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లి నప్పడు మినహా  అధిష్టానాన్ని కలిసింది లేదని అంటున్నారు. మరో వంక  గత ఆరేడు నెలలుగా  రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అప్పాయింట్ మెంట్ దొరకడం లేదని తెలుస్తోంది. నిజానికి  రేవంత్ రెడ్డికి, ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రుల అప్పాయింట్మెంట్ అయినా దొరుకోతోంది కానీ, రాహుల్ గాంధీ అప్పాయింట్మెంట్ దొరకడం లేదని అంటున్నారు.  ఈ నేపధ్యంలోనే  రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్రల రహస్యం ఏమిటనేది, కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. అలాగే, రేవంత్ రెడ్డి  రాజకీయ ఎత్తుగడ ఏమిటి? అన్న విషయంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెక్స్ట్ ఏంటి ? ఒక విధంగా ఇదే  ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా వినిపిస్తోంది.
నెక్స్ట్ ఏంటి? Publish Date: Mar 14, 2025 12:46PM