మహిళా మంత్రిపై నోరు జారిన మాజీ సీఎం.. ధర్నాకు దిగిన ప్రస్తుత సీఎం  

మధ్యప్రదేశ్ మాజీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ తాజాగా మహిళా మంత్రి ఇమార్తి దేవీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని దబ్రా నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో కమల్‌నాథ్ మాట్లాడుతూ.. శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్‌లో మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న ఇమార్తి దేవీని "ఐటమ్" అని కమల్‌నాథ్ సంబోధించారు. దీంతో ఒక్కసారిగా ఆయనపై తీవ్రమైన రాజకీయ దాడి మొదలైంది. ఉపఎన్నికకు సంబంధించిన సభలో కమల్‌నాథ్ మాట్లాడుతూ... ‘‘ఇక్కడి నుంచి సురేశ్ రాజే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన చాలా సాదాసీదా వ్యక్తి. అయితే ఆమె అలాగా కాదు. ఆమె పేరేమిటి? ఆమె గురించి నా కంటే మీకే బాగా తెలుసు. ఆమె ఐటమ్’’ అంటూ కమల్‌నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 

సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడు, మాజీ సీఎం ఓ మహిళా కేబినెట్ మంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై సీఎం శివరాజ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ ఆ కామెంట్లను చూసి ఒక్కసారి షాక్‌కు గురయ్యా. ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న కమల్‌నాథ్ ఓ మహిళా మంత్రిని అగౌరవపరిచేలా మాట్లాడటం ఏమిటి? ఈ వ్యాఖ్యలు సిగ్గుచేటు. మహిళలను, దళితులను అగౌరవ పరిచేలా అయన వ్యాఖ్యలున్నాయి.’’ అని శివరాజ్ సింగ్ మండిపడ్డారు. అంతేకాకుండా కమల్ నాథ్ కామెంట్స్ కు నిరసనగా ఈరోజు సీఎం శివరాజ్ సింగ్ ధర్నాకు సిద్ధమయ్యారు.

 

మరోవైపు మంత్రి ఇమార్తి దేవీ మాట్లాడుతూ... ‘‘అసలు నా తప్పేంటి? ఓ పేద కుటుంబంలో పుట్టడమే నా తప్పా? నేను దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తిని. అందులో నా తప్పేముంది? ఇలాంటి వ్యక్తులకు పార్టీలో స్థానమివ్వకూడదని సోనియా గాంధీని కోరుతున్నా. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై కథన చర్యలు తీసుకోవాలి" అని ఇమార్తి దేవి కమల్‌నాథ్ పై మండిపడ్డారు.