ఎంత మాట అన్నాడు!

తమిళ నాట చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఓ వైపు అధికార పార్టీ రెండు ముక్కలై... అగ్గి రాజేస్తుంటే, ప్రతిపక్షం అదనుకోసం చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కమల్ హాసన్.. విజయదశమికి కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు మీడియాకు తెలిపి.. తమిళ రాజకీయాల్లో ఎక్కడ లేని ఆసక్తిని రేకెత్తించాడు. 


మరో వైపు... రజనీకాంత్ కూడా పార్టీ పెట్టడానికి సమాయత్తమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే.. సినిమాలను చకచకా పూర్తి చేస్తున్నాడట రజనీ. ఇదిలావుంటే.. ఇటీవల ఓ మీడియా సమావేశంలో రజనీపై కమల్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట పెను దుమారం రేపాయ్. 


ఏ పార్టీతో కలిసి పనిచేసే ఉద్దేశం తనకు లేదనీ.. నా భావజాలానికి తగ్గ పార్టీ ఎక్కడా కనిపించలేదనీ.. అందుకే పార్టీని స్థాపించబోతున్నానని తెలిపిన కమల్.. తనలాగే పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్న రజనీ గురించి ప్రస్తావిస్తూ... రజనీకాంత్ లాంటి బహుళ ప్రజాదరణ గల నాయకుడు రాజకీయాల్లో రావడం మంచిదేననీ..  రజనీ వస్తానంటే... తన పార్టీలో చేర్చుకోడానికి ఎలాంటి ఇబ్బందీ లేదని కమల్ అన్నాడు. 


మరి ఈ మాటంటే  రజనీ అభిమానులకు చిర్రెత్తకుండా ఉంటుందా? సోషల్ మీడియాలో కమల్ ని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లమీదకు వచ్చి కమల్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నట్లు తెలిసింది. మరి ఈ వ్యవహారం మీద రజనీ ఏ విధంగా స్పందిస్తారో..కమల్ ఏ విధంగా వివరణ ఇస్తారో చూడాలి.