Top Stories

బుద్దాకి తెలుగుదేశం పెద్దల నో అపాయింట్‌మెంట్!

బెజవాడ వెంకన్నని ఇక పక్కన పెట్టేస్తారా? అపార రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిలా బుద్దా వెంకన్న కలర్ ఇస్తారు. ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల ముఖం ఎరుగని బుద్దాకి పొలిటికల్‌గా నోరే ప్లస్ అవుతుంది  ఎంతటి వారిపైనైనా విరుచుకుపడిపోయే ఆ మాస్ ఇమేజే ఆయనను టీడీపీలో ఎమ్మెల్సీని చేసింది. ఒక్క టర్మ్ ఎమ్మెల్సీగా చేసి బెజవాడ తెలుగుదేశంలో తానొక్కడే నాయకుడ్ని అన్నట్లు ఫీలైపోతుంటారాయన. ఎప్పటికప్పుడు వివాదాల్లో ఇరుక్కుంటూ పార్టీకి తలనొప్పిగా మారుతుంటారు . అలాంటాయన ప్రస్తుతం పదవి కోసం, గుర్తింపు కోసం పడుతున్న పాట్లు హాట్ టాపిక్‌గా మారాయి.  ఎన్ని చేసినా పార్టీ తనను కరుణించడం లేదని తెగ బాధపడిపోతున్నారట మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.  ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు, ఎన్ని తిప్పలు పడినా ఎవరూ పట్టించుకోవడం లేదని లబోదిబోమంటున్నారట. తనకు ఈసారి ఎలాగైనా ఎమ్మెల్సీ ఇప్పించమని పార్టీ పెద్దలందరి దగ్గరా మొత్తుకుటున్నారట. ఎమ్మెల్సీ రేసులో తాను ఉన్నానని తన పేరు కాస్త వేయండని మీడియా వాళ్లకి ఫోన్లు చేసి మరీ బతిమాలుకుంటున్నారట.  తనకు తానుగా ఒక ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఫీలయిపోయే ఆ విజయవాడ టీడీపీ నాయకుడికి  ఏ లాబీయింగ్ కలిసి వచ్చిందో ఏమో కాని తెలుగుదేశం పార్టీలో  ఒకసారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది . దాంతో మామూలుగానే మాస్ ఇమేజ్ ఉన్న ఆయన దూకుడు మరింత పెరిగిపోయింది . తెలుగుదేశం ఎంపీగా ఉన్నప్పుడు కేశినేని నానికి చుక్కలు చూపించారు వెంకన్న.  ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి మద్దతుగా నిలిచి,  కేశినేని నాని పార్టీ నుంచి బయటకు వెళ్లే వరకు నిద్రపోలేదు. బుద్దా వెంకన్న దూకుడు టీడీపీకి ఎంత ప్లస్ అయిందో, అంతే మైనస్ అయిన సందర్భాలూ   ఉన్నాయి. చంద్రబాబు, లోకేశ్‌లపై నోటికొచ్చినట్లు చెలరేగిపోయే  మాజీలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి వారిని తన స్టైల్లో టార్గెట్ చేస్తూ బుద్దా వెంకన్న తన మాస్ ఇమేజ్ మరింత పెంచుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు జోగి రమేష్ తన అనుచరులతో దండెత్తినప్పుడు, బుద్దా వెంకన్న అడ్డంపడి పార్టీలో మంచి మార్కులే కొట్టేశారు . ఆ క్రమంలో మొన్నటి ఎన్నికల్లో  విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన బుద్దా చాలా హడావుడే చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చిత్రపటానికి తన రక్తం తీసి అభిషేకం చేసి కలకలం రేపారు. భారీ బల ప్రదర్శనతో ఇంద్రకిలాద్రీ కొండెక్కి టికెట్ కోసం మొక్కులు మొక్కుకున్నారు. అయినా వెంకన్నకు టికెట్ రాలేదు కానీ,  అధిష్టానం మాత్రం అతి చేయవద్దని గట్టిగానే చీవాట్లు పెట్టింది.  ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవ్వడంతో ఆ పదవిపై కన్నేసిన ఆయన మళ్లీ తన స్టైల్లో ప్రయత్నాలు మొదలుపెట్టారట. గుర్తింపు కోసం పార్టీ చెప్పకపోయినా సరే.. ప్రతి రోజూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ  బ్రేకింగులు వేయించుకునేవారాయన. చివరికి ఆయన ప్రెస్ మీట్ల దెబ్బకి మీడియా వాళ్లు..కూడా బాబోయ్ బుద్దా వెంకన్నా అనాల్సి వస్తోందంట. ఎక్కడికీ కదలకుండా తన ఇంట్లోనే కూర్చుని ప్రతి రోజూ బుద్దా వెంకన్న ప్రెస్ మీట్లు పెట్టడాన్ని భరించలేక మీడియా వాళ్లు కూడా ఇక మేం రాలేం అన్నారట. ఆ తర్వాత కాస్త ప్రెస్ మీట్లు తగ్గించారు బుద్దావెంకన్న. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని న్యూస్ ఛానెల్స్ ను బ్యాన్ చేసింది. అయితే బుద్దా వెంకన్న ఆ ఛానెల్స్ తో ఎక్కువగా టచ్ లో ఉంటూ, ఆ ఛానెల్స్ లో తన బ్రేకింగ్స్ ఎక్కువ వచ్చేట్టుగా ప్లాన్ చేశారట. పాపం అదే బుద్దావెంకన్నకు మైనస్ అయ్యిందట. తాము ఆ ఛానెల్స్ ని బ్యాన్ చేస్తే నువ్వు ఆ ఛానెల్స్ వాళ్లతోనే ఎక్కువగా టచ్ లో ఉండడం ఏంటని పార్టీ అధిష్టానం సీరియస్ అయిందట.  రెండోసారి తనకు ఎమ్మెల్సీ కావాలంటున్నారు బుద్దావెంకన్న. ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ వాయిస్ తానే వినిపించానని, చంద్రబాబు ఇంటి మీదకు జోగి రమేష్ దాడికి వస్తే తానే అడ్డుకున్నానని, గతంలో కొడాలి నానిని తానే ఎదుర్కున్నానని అలాంటి తనకు ఎమ్మెల్సీ కచ్చితంగా ఇవ్వాల్సిందే అంటున్నారట. పైగా తాను ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జిననీ, తాను గవర కులానికి చెందిన వాడిని కాబట్టి బీసీ కోటాలో అయినా తనకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారట.  ఎన్నికల సమయంలో బుద్దావెంకన్న చేసిన ఓవరాక్షన్ కి టీడీపీ అధిష్టానం తీవ్రంగా మండిపడింది. బుద్దా బ్లడ్ ఎపిసోడ్‌పై పార్టీ పెద్దలు ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారంట. అలాగే మీడియాలో కవరేజ్ కోసం ఇష్టమొచ్చినట్టు మాట్లాడి పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టారని కోపంతో ఉన్నారంట. ఈ నేపథ్యంలోనే గత కొద్దిరోజులు గా చంద్రబాబు, లోకేశ్‌లు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదట.. ఎక్కడ అపాయింట్‌మెంట్ ఇస్తే తనకు ఎమ్మెల్సీ అంటారో అని పార్టీ పెద్దలు   బుద్దావెంకన్నను కలవడానికి  కూడా ఇష్టపడటం లేదంట . దాంతో ఆయన  తన ఫ్యూచర్ ఏంటో అర్థం కాక నెత్తినోరు బాదుకుంటున్నారట
బుద్దాకి తెలుగుదేశం పెద్దల నో అపాయింట్‌మెంట్! Publish Date: Mar 8, 2025 9:59PM

చంద్రబాబు చాణక్యం!

గోదావరి జలాలపై ఏపీ సీఎం సంచలన ప్రకటనతో బీఆర్ఎస్ గప్ చుప్! తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై ఆసక్తికర చర్చ పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీలో ఎంత చర్చ జరుగుతోందో ఏమో కానీ.. తెలంగాణ రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీలో కట్టబోతోన్న ఇరిగేషన్ ప్రాజక్టు మీద తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరగడానికి కారణం చంద్రబాబు చేసిన కామెంట్లే. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు చేద్దామనుకున్న సెంటిమెంట్ రాజకీయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు మొగ్గలోనే తుంచేశారు. తెలంగాణలో ఉన్న రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పినా.. అది మరింత ముదరకుండా చంద్రబాబు తన కామెంట్లతో కామ్ చేసేశారనే ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీంతో భగ్గున మండుతుందనుకున్న సెంటిమెంట్ రాజకీయ మంటలు రేగకుండా చప్పున చల్లారేలా చంద్రబాబు చేశారనేది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్సులో జరుగుతున్న చర్చ.  ఒక్క టీఎంసీ నీటి కోసం.. రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున గొడవలు.. ఆందోళనలు.. పోలీసుల మొహరింపు వంటి సంఘటనలు చోటు చేసుకున్న రోజులున్నాయి. అలాంటింది, ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు చేసిన కామెంట్ ఆయనలోని రాజకీయ పరిపక్వతకు, దార్శనికతకు నిదర్శనంగా నిలిచిందని అంటున్నారు.  పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అడ్డంకులు రాకుండా చేసుకోవడంతో పాటు తెలంగాణలో కూడా ఎలాంటి సెంటిమెంట్ రాజుకోకుండా చూడడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని అంటున్నారు. తెలంగాణ అభివృద్ధి కూడా తనకు ముఖ్యమని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నా.. తామేం అభ్యంతరం చెప్పలేదని,  ఇప్పుడు కూడా తెలంగాణ నీటి అవసరాల కోసం కావాలనుకుంటే మరిన్ని ప్రాజెక్టులు గోదావరి నదిపై కట్టుకోవచ్చంటూ బంపరాఫర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. సహజంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈ తరహా కామెంట్లు చేయడం దాదాపు ఉండదు. మరీ ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు.. నదీ జలాల విషయంలో సీఎం స్థాయి వ్యక్తులు అన్ని కోణాల్లో ఆలోచన చేస్తారు. కానీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాలు కూడా తమకు ముఖ్యమని చెబుతూనే.. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవద్దని స్పష్టంగా చెప్పేశారు. ఈ విధంగా ఏపీకి అతి ముఖ్యమైన ప్రాజెక్టుకు అడ్డంకులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే భావన తెలంగాణ సర్కిల్సులో వ్యక్తమవుతోంది. పైగా తాము నికర జలాలను వాడుకోవడం లేదని.. వరద జలాలను మాత్రమే తరలిస్తామని చెప్పడం ద్వారా సాంకేతిక పరమైన అడ్డంకులు లేకుండా చూసుకున్నారు చంద్రబాబు.  గోదావరి జలాల గురించి చంద్రబాబు అంత విశాల హృదయంతో స్పందిస్తారని తామెవ్వరంఊహించలేకపోయామనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో కూడా జరుగుతోందట. చంద్రబాబు చాణక్యంతో తాము చేద్దామనుకున్న రాజకీయానికి చెక్ చెప్పేశారని బీఆర్ఎస్ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. గతంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతాన్ని తాము ఎద్దేవా చేశామనీ, ఇప్పుడూ  చంద్రబాబు అదే సిద్దాంతాన్ని   చెప్పడం ద్వారా తమ ప్రణాళికలు చెక్ పెట్టేశారన్న ప్రశంసాపూర్వక వ్యాఖ్యలు ప్రైవేటు సంభాషణల్లో బీఆర్ఎస్ నేతల నుంచే వస్తున్నాయి. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకునేందుకు తాము ఏపీ ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తే.. తమ రాష్ట్రంలో ప్రాజెక్టుకు ఇబ్బందుల్లేకుండా చూసుకోవడానికి ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు చేసిన కామెంట్లతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకోవడం కుదరడం లేదంటూ నిట్టూరుస్తున్నారట బీఆర్ఎస్ నేతలు.
చంద్రబాబు చాణక్యం! Publish Date: Mar 8, 2025 9:51PM

అర్ధాంగి భువనేశ్వరికి బేరమాడి పట్టు చీర కొన్న చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు  తన ఫ్యామిలీ కోసం సమయం కేటాయించడం అరుదుగా కనిపిస్తుంది.  మరీ ముఖ్యంగా తన అర్ధాంగి నారా భువనేశ్వరి గురించి ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంటారు. శనివారం (మార్చి 8) ప్రకాశం జిల్లా మార్కాపురంలో  ఆమెకు సర్ ప్రైజ్ గిప్ట్ కొనుగోలు చేశారు.   తన పర్యటనలో భాగంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను స్వయంగా  పరిశీలించారు. ఓ చీరల స్టాల్ ను  సందర్శించిన చంద్రబాబు... తన అర్ధాంగి కోసం ఓ పట్టుచీర కొన్నారు. బేరం ఆడి  మరీ చీరను కొన్నారు.   చీర ఎంతకు అమ్ముతున్నావమ్మా అని  స్టాల్ లో ఉన్న మహిళను చంద్రబాబు అడిగారు. రూ.26,400 అని ఆ మహిళ బదులిచ్చింది.   ఆ చీరను రూ.25 వేలకు  ఇవ్వమని బేరం ఆడి కొన్నారు. వ్యాపారం ఎలా సాగుతుందమ్మా అని ఆప్యాయంగా అడిగారు.  టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తన సతీమణి భువనేశ్వరికి స్పెషల్ గిఫ్ట్ తీసుకున్నారు. ఆయన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడ స్టెల్లా ఆడిటోరియంలో చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఎగ్జిబిషన్‌ స్టాల్ ప్రారంభించిన తర్వాత ప్రతి స్టాల్ దగ్గరకు వెళ్లి చేనేత దుస్తులను చంద్రబాబు స్వయంగా పరిశీలించారు.భార్య కోసం  స్వయంగా రెండు చీరలు కొనుగోలు చేశారు. ఆ చీరల ప్రత్యేకత గురించి చంద్రబాబు  అప్పట్లో అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత జరిగిన తొలి చేనేత దినోత్సవంలో రెండు చీరలు కొనడం ఆసక్తి కలిగించింది.   చంద్రబాబు అరెస్టు సమయం నుంచి రాజకీయంగా క్రియాశీలంగా ఉన్న భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో  రాష్ట్రాన్ని చుట్టుముట్టారు.  ఆమె  తన భర్త చంద్రబాబుకు ప్రజలే తొలి ప్రాధాన్యత అని… కుటుంబం ఆ తరువాతేనని భువనేశ్వరి చెబుతుంటారు.తనకు ఆయన  ఓ చీర కొనిచ్చి దాదాపు 30 ఏళ్ళు అయి ఉంటుందని   నాడు తెచ్చినప్పుడు కూడా తనకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయ్యిందని... దాన్ని భద్రంగా బీరువాలో దాచుకున్నానని ఆ తర్వాత భువనేశ్వరి  సరదాగా చెప్పారు. భువనేశ్వరి వ్యాఖ్యలు దృష్టిలో ఉంచుకునే ఆమెకు ఓ గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచనతోనే బాబు ఈ చీర కొన్నారని అనుకోవచ్చు..  గతానికి భిన్నంగా చంద్రబాబు ఇటీవలి కాలంలో కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ వారితో కొంత సమయం కేటాయిస్తున్నారు. 
అర్ధాంగి భువనేశ్వరికి బేరమాడి పట్టు చీర కొన్న చంద్రబాబు Publish Date: Mar 8, 2025 4:49PM

సాక్షులు, నిందితుల వరుస మరణాలు.. అప్పుడు పరిటాల రవి.. ఇప్పుడు వివేకా కేసు

కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ మొదటి సారి బాధ్యతలు చేపట్టినప్పుడు టీడీపీ నేత పరిటాల రవీంద్ర హత్యకు గురయ్యారు.  జగన్ అధికారపగ్గాలు చేపట్టడానికి ముందు ఆయన బాబాయ్ వైఎస్ వివేకా హతమయ్యారు.  పరిటాల రవి హత్య కేసు విచారణలో ఉండగానే నిందితులు, సాక్షుల మరణాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడదే సీన్ వివేకా హత్య కేసులోనూ రిపీట్ అవుతుండటం  కలకలం రేపుతోంది. ఆ క్రమంలో ఈ మరణాల వెనుక వివేకా హత్య కేసు నిందితుల కుట్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన మాజీ మంత్రి పరిటాల రవీంద్ర పెనుగొండ ఎమ్మెల్యేగా ఉంటూ 2005 జనవరి 24న హత్యకు గురయ్యారు. అప్పట్లో ఆ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం  రేపింది. ఆ హత్య కేసులో నిందితుడైన జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శీను 2008లో అనంతపురం జిల్లా జైలులో హత్యకు గురయ్యాడు. మరో నిందితుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి 2012లో హైదరాబాద్ జైల్లో హతమయ్యాడు. ఆ కేసుతో ప్రమేయమున్న తగరకుంట కొండారెడ్డిని కూడా హతమార్చారు .. మొద్దు శీనుని చంపిన ఓం ప్రకాష్ జైల్లోనే మరణించాడు. ఇక పరిటాల కేసులో ప్రధాన నిందితుడు   మద్దెలచెరువు సూరిని అతని అనుచరుడు భాను కిరణ్ 2011 జనవరి 4న హైదరాబాద్‌లో హత్య చేశాడు.  2019 ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. పరిటాల రవి హత్య కేసు తరహాలోనే మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక సాక్షులు, అనుమానితులు వరుసగా మరణిస్తున్నారు. వైసీపీ పాలనా కాలంలో 2019-24 మధ్య నలుగురు మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయారు. ఈ ఆరుగురివీ సహజ మరణాలేనని, అనారోగ్య కారణాలతో చనిపోయారని పైకి చెబుతున్నప్పటికీ లోతుగా చూస్తే అనుమానాస్పదంగానే కనిపిస్తున్నాయి. అందరూ ఒకే తరహాలో చనిపోవటం అనేక సందేహాలకు తావిస్తోంది.  కేసు విచారణ కీలక దశకు చేరుకుంటున్న వేళ ప్రధాన సాక్షులు, కేసుతో సంబంధమున్న వ్యక్తులు మరణిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్ష సాక్షి వాచ్‌మన్‌ రంగన్న తాజాగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం, తన తండ్రికి అందించిన చికిత్సపై అనుమా నాలున్నాయంటూ రంగన్న కుమారుడు కాంతారావు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ మరణాల వెనుక వివేకా హత్య కేసు నిందితుల ప్రమేయం, కుట్ర ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మరణాలన్నింటిపై సమగ్ర దర్యాప్తునకు సిద్ధమవుతోంది. వివేకానందరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతిలను హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు తీసుకొచ్చిన వాహన డ్రైవర్‌ నారాయణ యాదవ్‌ 2019 డిసెంబరులో మృతి చెందారు. అనారోగ్య కారణాలతో చనిపోయారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలోని సిట్‌ విచారణ వేగవంతమవుతున్న తరుణంలో ఆయన మరణించటం సందేహాస్పదంగా మారింది.  ప్రయాణంలో జగన్‌, భారతి, అవినాష్‌రెడ్డి, ఇతరుల మధ్య వివేకా మరణానికి సంబంధించి ఫోన్‌ సంభాషణలు జరిగాయని, అవన్నీ నారాయణ యాదవ్‌ విన్నారన్న ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను కీలక సాక్షిగా విచారించాలి. విచారణకు పిలవకముందే ఆయన చనిపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. నారాయణ యాదవ్‌ మృతిపై పోలీసులు అసలు కేసే నమోదు చేయలేదు. అతని అంత్యక్రియలకు జగన్, భారతి హాజరయ్యారు.  వివేకా నివాసం వద్ద కాపలా ఉన్న వాచ్‌మన్‌ బి.రంగన్న ఆయన హత్యలో పాల్గొన్న వారిని ప్రత్యక్షంగా చూశారు. ఎర్ర గంగిరెడ్డి, షేక్‌ దస్తగిరి, సునీల్‌ యాదవ్, ఉమాశంకరరెడ్డి ఈ హత్య చేసినట్లు ఆయన సీబీఐకి, మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలమిచ్చారు. ఆ తర్వాతే శివశంకరరెడ్డి, అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, తదితర ముఖ్యుల ప్రమేయం బయటపడింది. వివేకా హత్య గురించి ఎవరికైనా చెబితే నరికి చంపేస్తానంటూ ఎర్ర గంగిరెడ్డి అప్పట్లో తనను బెదిరించారని కూడా రంగన్న వాంగ్మూలమిచ్చారు.  వివేకా హత్య కేసులో అత్యంత కీలక సాక్షి అయిన రంగన్న ఈ నెల 5న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన అస్వస్థతకు గురయ్యారంటూ తొలుత పులివెందుల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కడప రిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే రిమ్స్‌లో జరిగిన చికిత్సపై తమకు అనుమానాలున్నాయని రంగన్న భార్య, కుమారుడు కాంతారావు ఆరోపించారు. పోలీసులు కూడా ఇది అనుమానాస్పద మృతేనని తేల్చి దర్యాప్తు చేస్తున్నారు.  వివేకా హత్య కేసు ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్‌రెడ్డి 2022 జూన్‌లో మృతి చెందారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందారంటూ అప్పట్లో ప్రచారం చేశారు. అయితే ఆ మరణమూ అనేక సందేహాలకు తావిచ్చింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కోసం సీబీఐ బృందాలు పులివెందులలోని జగన్‌ క్యాంపు కార్యాలయం, వివేకానందరెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఇళ్లు, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో కొలతలు, గూగుల్‌ కోఆర్డినేట్స్‌ తీసుకున్నాయి. అది జరిగిన వెంటనే.. ఈ కేసులో కీలక వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు.  ఇదే కేసులో అనుమానితుడైన   కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి 2019 సెప్టెంబరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విషపుగుళికలు సేవించి, ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం జరిగింది. శ్రీనివాసులరెడ్డి వివేకా హత్య కేసులో అనుమానితుడు. ఈ హత్య కుట్ర సంబంధిత వివరాలు అతనికి, అతని బావ పరమేశ్వరరెడ్డికి ముందే తెలుసన్న అనుమానాలున్నాయి.  వివేకా హత్య కేసు కీలక సాక్షుల్లో డా.వైఎస్‌ అభిషేక్‌రెడ్డి ఒకరు. వివేకా చనిపోయినట్లు దేవిరెడ్డి శివశంకరరెడ్డి నుంచి తనకు ఫోన్‌కాల్‌ వచ్చిందని, ఘటనాస్థలానికి వెళ్లి చూడగా.. మృతదేహం చుట్టూ రక్తపు మడుగు, ఆయన నుదుటిపై గాయాలున్నట్లు గుర్తించి, ఇది హత్యేనని భావించానంటూ 2021 ఆగస్టులో అభిషేక్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలమిచ్చారు. అవినాష్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శివశంకరరెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి, ఎర్ర గంగిరెడ్డే వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ చిత్రీకరించారని వాంగ్మూలంలో ప్రస్తావించారు. స్వతహాగా వైద్యుడు, యువకుడైన అభిషేక్‌రెడ్డి ఈ వాంగ్మూలం వెలుగుచూసిన కొన్నాళ్ల తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు.  వైఎస్‌ భారతి తండ్రి, జగన్‌ మామ అయిన ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబరులో అనారోగ్యంతో చనిపోయారు. వివేకా హత్య కుట్ర గురించి ఆయనకు తెలుసనే ఫిర్యాదులున్నాయి. వివేకా హత్యను కప్పిపుచ్చేందుకు ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బందే ఆయన మృతదేహానికి కట్లు కట్టి, బ్యాండేజీలు చుట్టారు. వివేకా హత్య తర్వాత నిందితులు గంగిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి చేతులు శుభ్రం చేసుకున్నారనే ఫిర్యాదులున్నాయి.  పరిటాల రవి హత్య కేసులో జగన్‌ని సీబిఐ అప్పట్లో విచారించి వదిలేసింది ..అప్పట్లో తండ్రి వైఎస్ సిఎం గా ఉండటంతో పాటు కేంద్రలో కాంగ్రెస్స్ ప్రభుత్వం ఉండటంతో సీబిఐ అధికారులు జగన్ ఇంటికే వెళ్ళి విచారించి వదిలేసారు. ఇప్పుడు పరిటాల హత్య కేసు నిందితుల తరహాలోనే వైఎస్ వివేకా హత్య కేసు నిందితులు, సాక్షులు కూడా చనిపోతుండం కలకలం రేపుతోంది. ఈ మరణాలపై తాజాగా ఏపీ క్యాబినెట్‌లో కూడా చర్చకు వచ్చిందంట. వాటిపై సమగ్ర విచారణకు రంగం సిద్దమవుతోందంట మరి ఈ మరణాలు యాధృచ్చికమో? కుట్ర పూరితమో  తేలాల్సి ఉంది
సాక్షులు, నిందితుల వరుస మరణాలు.. అప్పుడు పరిటాల రవి.. ఇప్పుడు వివేకా కేసు Publish Date: Mar 8, 2025 4:03PM

ఆదివారం అసలు సిసలు మజా.. క్రికెట్ ఫెస్ట్

క్రికెట్ అభిమానులు ఆదివారం (మార్చి9) అసలు సిసలు మజా ఎంజాయ్ చేయబోతున్నారు. ఔను దుబాయ్ వేదికగా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ ఆదివారం (మార్చి 9)జరగనుంది. ఓటమనేదే తెలియకుండా సాగుతున్న టీమ్‌ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది. న్యూజిలాండ్‌ కూడా భారత్‌కు దీటుగా ఉంది. అయితే అన్ని విభాగాల్లో రెండు జట్లూ సమానంగా కనిపిస్తున్నా.. దుబాయ్‌లో స్పినర్లే నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నారు.  ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమ్‌ఇండియా అజేయగా ఫైనల్‌ చేరడంలో స్పిన్నర్ల పాత్ర అత్యంత కీలకం. బుమ్రా లాంటి మేటి ఫాస్ట్‌బౌలర్‌ లేకున్నా.. జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది అంటే కారణం స్పిన్నే. గ్రూప్‌ దశలో, సెమీస్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసిన స్పిన్‌ దళం.. భారత్‌ పనిని తేలిక చేసింది. ఆదివారం ఫైనల్లోనూ స్పిన్నే ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగుతోంది. జడేజా, అక్షర్‌ పటేల్, వరుణ్‌ చక్రవర్తి, కుల్‌దీప్‌లతో టీమ్‌ఇండియా స్పిన్‌ దుర్భేద్యంగా కనిపిస్తోంది. కానీ న్యూజిలాండూ తక్కువేమీ కాదు. టోర్నీలో స్పిన్‌ వనరులలో భారత్‌కు దగ్గరగా వచ్చే జట్టేదయినా ఉందంటే అది కివీసే.  బ్రాస్‌వెల్, రచిన్‌ రవీంద్ర, గ్లెన్‌ ఫిలిప్స్‌ రూపంలో మంచి స్పిన్‌ ప్రత్యామ్నాయాలు ఆ జట్టుకున్నాయి. పిచ్‌ స్పిన్‌కు సహకరించనున్న నేపథ్యంలో రెండు జట్ల స్పిన్నర్ల మధ్య రసవత్తర పోటీ ఖాయంగా కనిపిస్తుంది. స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టిపడేయడం, బ్యాటింగ్‌లో స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోవడం మీదే మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంది. భారత్‌ తిప్పేసిందిలా.. ఛాంపియన్స్‌ ట్రోఫీలో తన మ్యాచ్‌లన్నింటీనీ దుబాయ్‌లోనే ఆడిన టీమ్‌ఇండియా.. స్పిన్‌కు బాగా సహకరిస్తున్న పిచ్‌లపై అద్భుత ఫలితాలు రాబట్టింది. నలుగురు స్పిన్నర్లలో ప్రతి ఒక్కరూ జట్టు ముందంజ వేయడంలో తమదైన పాత్రను పోషించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కీలక సమయాల్లో వికెట్లను అందించడమే కాకుండా.. పరుగుల ప్రవాహానికీ కళ్లెం వేశారు. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ మినహా స్పిన్నర్లంతా ఓవర్‌కు అయిదు లోపే పరుగులివ్వడం విశేషం. కుల్‌దీప్‌ కూడా 4 మ్యాచ్‌ల్లో 5.01 ఎకానమీతో, 5 వికెట్లు పడగొట్టాడు. వరుణ్‌ 2 మ్యాచ్‌ల్లో 4.55 ఎకానమీతో 7 వికెట్లు, అక్షర్‌ 4 మ్యాచ్‌ల్లో 4.51 ఎకానమీతో 5 వికెట్లు), జడేజా 4 మ్యాచ్‌ల్లో 4.78 ఎకానమీతో4 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేశారు. సీనియర్‌ స్పిన్నర్‌ జడేజా మధ్య ఓవర్లలో విశేషంగా రాణించాడు. సెమీస్‌లో బ్యాటింగ్‌ అనుకూల పిచ్‌పై ఆసీస్‌ను అతడు నిలువరించిన తీరు అద్భుతం. మరీ ముఖ్యంగా కుడిచేతి వాటం బ్యాటర్లపై అక్షర్, జడేజా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు. ఇక ఆఖరి ఓవర్లలో కుల్‌దీప్‌పై రోహిత్‌ రాణిస్తున్నాడు. ఇక లెగ్‌స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి టోర్నీలో ఆలస్యంగా అవకాశం దక్కించుకున్నా.. తన మిస్టరీ స్పిన్‌తో బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో 4.55 ఎకానమీతో ఏడు వికెట్లు పడగొట్టాడు. వికెట్ల వేటలో దూసుకుపోతున్న అతడి నుంచి కివీస్‌కు పెను సవాలు తప్పదు.  భారత స్పిన్నర్లలాగే న్యూజిలాండ్‌ స్పిన్నర్లు టోర్నీలో సత్తా చాటారు. గ్రూప్‌ మ్యాచ్‌లో వాళ్లను ఎదుర్కోవడంలో టీమ్‌ఇండియా విజయవంతమైనా.. ఫైనల్లో వాళ్లను తేలిగ్గా తీసుకోవడానికి వీళ్లేదు. పార్ట్‌ టైమర్‌ ఫిలిప్స్‌ తప్ప కివీస్‌ స్పిన్నర్లంతా ఓవర్‌కు అయిదు లోపే పరుగులిచ్చారు. శాంట్నర్‌  కివీస్‌ బౌలింగ్‌కు మూలస్తంబంలా నిలిచాడు. బ్రాస్‌వెల్‌, రచిన్‌ ఆకట్టుకున్నారు. స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనతోనే ఇటీవల భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్‌ను కివీస్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.
ఆదివారం అసలు సిసలు మజా.. క్రికెట్ ఫెస్ట్ Publish Date: Mar 8, 2025 4:02PM

గుజరాత్ కాంగ్రెస్ లో బీజేపీ కోవర్టులు!

కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులున్నారా? ఔను ఉన్నారనే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన రాహుల్ గాంధీ చేసిన ఈ కోవర్ట్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను, నేతలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్ లో సగం మందికి పైగా కాంగ్రెస్ నాయకులు బీజేపీకి బీ టీమ్ గా పని చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.  అలాంటి వారినందరినీ గేలం వేసి పట్టుకుని మరీ బయటకు పంపేస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ లో నాయకులకు కొరవ లేదన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసేవారెవరైనా, ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రశక్తే లేదన్నారు.   గుజరాత్ కాంగ్రెస్  కార్యకర్తలలో కొందరు పార్టీ కోసం నిజాయితీగా పని చేస్తూ పార్టీ సిద్ధాంతాలను తు.చ. తప్పకుండా అనుసరించేవారు, అలాగే పార్టీ, ప్రజలను పట్టించుకోకుండా బీజేపీ తో అంటకాగేవారు మరి కొందరు ఉన్నారని రాహుల్ అన్నారు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి ఆ రాష్ట్ర నాయకులు అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేశారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కు 22 శాతం ఓట్లు పెరిగాయన్నారు.  గుజరాత్ లో కాంగ్రెస్ కు 40 శాతం ఓటు బ్యాంకు ఉందనీ, అయితే కొందరు నేతలు బీజేపీతో కలిసి పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని విమర్శించారు.  అటువంటి నేతలను ఉపేక్షించేది లేదని కుండబద్దలు కొట్టారు. రాహుల్ గాంధీ చేసిన ఈ కోవర్టు వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాహుల్ ప్రత్యేకంగా తెలంగాణ కాంగ్రెస్ను ప్రస్తావించి, ప్రశంసించడంతో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ మధ్య గ్యాప్ అంటే జరుగుతున్న ప్రచారానికి ఫఉల్ స్టాప్ పెట్టినట్లైంది. 
గుజరాత్ కాంగ్రెస్ లో బీజేపీ కోవర్టులు! Publish Date: Mar 8, 2025 3:19PM