Top Stories

గులాబీ పార్టీ సన్ స్ట్రోక్ .. ప్లీనరీ వేదిక మార్పు?

లక్షల మందితో వరంగల్‌లో ప్లీనరీ నిర్వహించి క్యాడర్‌లో జోష్ నింపాలని ఫిక్స్ అయింది గులాబీ పార్టీ. అయితే వారికి వాతావరణం, పరిస్థితులు అనుకూలించడం లేదంట. దాంతో సభను వాయిదా వేస్తే మరింత పరువు పోగొట్టుకోవాల్సి వస్తుందనీ, అందుకే సభాస్థలి మార్చడానికి ఫిక్స్‌ అయ్యారంట. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27కి పాతికేళ్లు అవుతుండటంతో సిల్వర్ జూబ్లీ వేడుకలను వైభవంగా నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించింది. వరంగల్ లో సభను నిర్వహించేందుకు సిద్ధమైంది. వరంగల్ శివారులోని దేవన్నపేట, కోమటిపల్లిలో సభ నిర్వహణ పరిసరాలను సైతం నాయకులు పరిశీలించారు. అయితే ఎండల తీవ్రత, వరి కోతల టైమ్ కావడంతో వరంగల్ సభ సభకు జనాన్ని సమీకరించడం అసాధ్యమని పార్టీ అధిష్టానం భయపడుతున్నట్లు సమాచారం. అందుకే సభా స్థలిని మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ ప్రాంతానికి షిఫ్ట్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ ప్రాంతం అయితే అన్ని జిల్లాలకు చెందిన ప్రజలు తరలివచ్చేందుకు రోడ్డు మార్గం సైతం అనుకూలంగా ఉంటుందని సభా స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలిసింది. త్వరలోనే అధికారంగా సభా స్థలి మార్పును ప్రకటిస్తారంట. ఏప్రిల్ నెలలో ఎండలు ఎక్కువ. దీనికి తోడు వరికోతలు సైతం ముమ్మరంగా సాగుతాయి. రైతు జనమంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు. దాంతో వరంగల్ అనుకూలంగా ఉండదని సభకు జనాన్ని తరలించడం కష్టమవుతుందని నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్లీనరీ సభకు 5 లక్షలకుపైగా జనాన్ని తరలించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న కేడర్ లో జోష్ నింపాలంటే సభను గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఒక వేళ సభను సక్సెస్ చేయకపోతే క్యాడర్ మరింత నైరాశ్యంలో పడటంతో పాటు ..రాబోయే స్థానిక, మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికలపైనా ఎఫ్టెక్ పడే ప్రమాదం ఉంది. గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు పట్టుంది. 24 అసెంబ్లీ స్థానాల్లో 16 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా కంటోన్మెంట్ కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో బీఆర్ఎస్ బలం15 స్థానాలకు చేరింది. పార్టీ మారిన  ఎమ్మెల్యేలను పక్కన పెట్టినా గ్రేటర్లో గులాబీ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేలున్నారు. దాదాపు అన్ని సెగ్మెంట్లలోనూ పార్టీకి క్యాడర్ ఉంది. సిల్వర్ జూబ్లీ వేడుకలకు గ్రేటర్‌ నుంచి జనాన్ని తరలించడం సులభం అవుతుందని పార్టీ అధిష్టానం భావించినట్లు తెలిసింది. జిల్లాల నుంచి ఆశించిన మేర రాకున్నా గ్రేటర్ నుంచి జనం వస్తే సభ భారీ సక్సెస్ అవుతుందని అంచనాకు వచ్చిందంట. గ్రేటర్ లోని ప్రతి సెగ్మెంట్ నుంచి 10 నుంచి 20వేల మందిని తరలించేందుకు ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్‌లకు టార్గెట్ విధించాలని పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచ్చిందంట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నియోజకవర్గాలకు 5 వేలు టార్గెట్ పెట్టినా సరిపోతుందని లెక్కలు వేసుకుంటున్నారంట.  వరంగల్ బీఆర్ఎస్‌కి సెంటిమెంట్. ఉద్యమ కాలం నుంచి సందర్భం ఏదైనా తొలిసభ అక్కడి నుంచే నిర్వహిస్తూ వస్తున్నారు. అందుకే మొదట్లో వరంగల్ లో సభ నిర్వహించాలని భావించారు. గత ఏడాది సైతం ప్లీనరీ నిర్వహిస్తామని, భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని లీకులు ఇచ్చారు. కానీ సభ నిర్వహించలేదు. ఈ సారి సైతం నిర్వహిస్తామని సభకు హరీష్‌రావు స్ధల పరిశీలన కూడా చేశారు. కానీ పార్టీ నేతల నిర్ణయం మేరకు జన సమీకరణకు అనుగుణంగా లేకపోవడం, భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం మేరకు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ కు మార్చినట్లు సమాచారం. ఏదీ ఏమైనా పార్టీ సభ స్థలి మార్పు చేస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం కేడర్ లో హాట్ టాపిక్ గా మారింది.
గులాబీ పార్టీ సన్ స్ట్రోక్ .. ప్లీనరీ వేదిక మార్పు? Publish Date: Mar 27, 2025 12:18PM

ఇంతకీ ఇప్పాల ఎక్కడ.. సిస్కో పక్కన పెట్టేసిందా? పంపించేసిందా?

టెక్నాలజీ రంగంలో దిగ్గజం అయిన సిస్కో తెలంగాణలోని ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో కలిసి నైపుణ్య శిక్షణను అందించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో స్కిల్స్ యూనివర్సిటీ, సిస్కో మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రితో పాటు ఐటీ  మంత్రి శ్రీధ‌న్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు, సిస్కో సీనియర్ వైఎస్ ప్రసిడెంట్ డాక్టర్ గయ్ డీడ్రిక్ గై డైడ్రిచ్, ఆ సంస్థ ఇతర ప్రతినిధులతో కీలక సమావేశం జరిగింది. నైపుణ్య శిక్షణ అందించే విషయంలో ఈ సందర్బంగా సిస్కోకు స్కిల్స్ యూనివర్సిటీకి, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) కు మధ్య వేర్వేరు ఒప్పందాలు కుదిరాయి. ఈ సమావేశంలో స్కిల్స్ యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు, టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా పాల్గొన్నారు. ఒప్పందం విషయం పక్కన పెడితే.. తెలంగాణ సీఎం సమక్షంలో ఈ ఒప్పందం కుదిరిన సమయంలో సిస్కో బృందంలో ఇప్పాల రవీంద్రారెడ్డి ఎక్కడా కనిపించలేదు. సిస్కో  సౌత్ ఇండియా టెరిటరీ ఎక్కౌంట్స్ మేనేజర్ గా ఉన్న ఇప్పాల రవిచంద్రారెడ్డి ఏపీ ప్రభుత్వంతో సిస్కో ఒప్పందం సందర్భంగా మంత్రి లోకేష్ ను కలిసిన బృందంలో కనిపించారు. అంతే కాదు మంత్రి లోకేష్ ముందు నిలిచి మాట్లాడారు. మామూలుగా అయితే ఈ విషయానికి ఏమంత ప్రాధాన్యత ఉండదు కానీ ఈ ఇప్పాల రవిచంద్రారెడ్డి ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సోషల్ మీడియా వేదికగా అత్యంత అసహ్యంగా, జుగుప్సాకరంగా తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా పోస్టులు పెట్టారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన ఇప్పాల రవిచంద్రారెడ్డి పోస్టులపై అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే. అటువంటి వ్యక్తి సిస్కో బృందంలో సభ్యుడిగా మంత్రి లోకేష్ తో భేటీ కావడం తెలుగుదేశం వర్గాలలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. వాస్తవానికి ఇప్పాల రవిచంద్రారెడ్డి ఎవరో, ఎలా ఉంటారో లోకేష్ కు తెలిసే అవకాశం లేదు. కానీ ఆయన పోస్టులు, ఆ పోస్టులలో వాడిన భాష కారణంగా తెలుగుదేశం నేతలు, శ్రేణులకు ఇప్పాలను గుర్తించడం పెద్ద కష్టం కాదు. లోకేష్ తో సిస్కో బృందం భేటీకి సంబంధించిన విజువల్స్ లో ఇప్పాల కనిపించడంతో తెలుగుదేశం  శ్రేణులు భగ్గు మన్నాయి. దీంతో విషయం తెలిసిన లోకేష్ వెంటనే స్పందించారు. సిస్కోకు లేఖ రాశారు. రాజకీయాలకూ, వ్యాపార బంధాలకూ ముడిపెట్టడం తమ ప్రభుత్వ విధానం కాదని చెబుతూనే సుతిమెత్తగా ఇప్పాల నిర్వాకాలను ప్రస్తావిస్తూ అటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ ప్రాజెక్టులోనూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ భాగస్వామిని చేయవద్దని సూచించారు.  ఇది జరిగిన రెండు రోజులకు ఇదే సిస్కో బృందం తెలంగాణ ప్రభుత్వంతో భేటీ అయ్యింది. అయితే ఆ సందర్భంగా ఇప్పాలను మాత్రం దరి చేరనీయలేదు. కాగడా పెట్టి వెతికినా ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసిని సిస్కో బృందంలో ఇప్పాల రవిచంద్రారెడ్డి కనిపించలేదు. లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు ఇప్పాలను దూరం పెట్టాలని సిస్కోకు సూచిస్తే.. ఆ సంస్థ మొత్తంగా తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల నుంచే ఇప్పాలను తప్పించేసినట్లుందని పురిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ సిస్కో ఇప్పాలను తప్పించేసిందా? తొలగించేసిందా? అన్న చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో జోరుగా సాగుతోంది. 
ఇంతకీ ఇప్పాల ఎక్కడ.. సిస్కో పక్కన పెట్టేసిందా? పంపించేసిందా? Publish Date: Mar 27, 2025 11:44AM

బట్టతల కారణంగా పెళ్లి క్యాన్సిల్.. మనస్థాపంతో యువ వైద్యుడి బలవన్మరణం 

వయసు మీద పడుతున్నా తనకు  పెళ్లి కావడం లేదన్న మనో వ్యధతో సికింద్రాబాద్  లో ఓ  యువవైద్యుడు బలవర్మణానికి పాల్పడ్డాడు. వివరాల్లో వెళితే  గుజరాత్ కు చెందిన ప్రకాశ్ మాల్ బతుకుదెరువు కోసం  దశాబ్దాల క్రితమే సికింద్రాబాద్  వచ్చి స్థిరపడ్డాడు. అయితే చిన్న కుమారుడు పురోహిత్ కిషోర్ ను బాగా చదివించి డాక్టర్ చేశాడు. బస్తీ దవాఖానాలో డాక్టర్ గా పని చేస్తున్న పురోహిత్  కిషోర్ కు ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. నిశ్చితార్థ వేడుక కూడా  ఘనంగా జరిగింది.  అప్పటివరకు విగ్ ధరించి మేనేజ్ చేసిన పురోహిత్ పూజారీ ఈ వేడుకలోనే  తన బట్టతల బయటపడటంతో అమ్మాయి కుటుంబం పెళ్లి క్యాన్సిల్ చేసింది. చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు వెతుకుతున్నప్పటికీ పురోహిత్ పూజారీకి అమ్మాయిని ఇవ్వడానికి  ఎవ్వరూ ముందుకు రాలేదు. దీనికి ప్రధాన కారణం అతడికున్న బట్టతల. రాకరాక వచ్చిన ఈ సంబంధం కూడా నిశ్చితార్థం తర్వాత   క్యాన్సిల్ కావడంతో అబ్బాయి తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు . బొల్లారం రైల్వే స్టేషన్  సమీపంలోని క్యావలరీ బ్యారక్ రైల్వేస్టేషన్ వద్ద రైలు క్రిందపడి చనిపోయాడు. గుర్తింపు కార్డులో పురోహిత్ పూజారీ డిటైల్స్ ఉండటంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.  జీవితంలో అన్ని ఎత్తు పల్లాలను అధిగమించిన ఈ యువ డాక్టర్ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తీవ్ర విషాదాన్ని నింపింది.   
బట్టతల కారణంగా పెళ్లి క్యాన్సిల్.. మనస్థాపంతో యువ వైద్యుడి బలవన్మరణం  Publish Date: Mar 27, 2025 11:32AM

సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన.. పరిహారం, పునరావాసంపై కీలక ప్రకటన?!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం (మార్చి 27) పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు.  ఈ సందర్భంగా ఆయన పరిహారం, పునరావాసం, డయాఫ్రం వాల్ నిర్మాణ పనులపై కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయంటున్నారు. ముందుగా ఈ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.  అంతకు ముందు పోలవరం వ్యూపాయింట్ ను పరిశీలిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయన పోలవరం ప్రాజెక్టు పరిశీలన చేసిన అనంతరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది.  తాజా సమీక్షలో   పనుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు అధికారులకు మార్గనిర్దేశనం చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో తాగు, సాగునీటికి కొరత లేకుండా పోతుందని చంద్రబాబు చెబుతున్నారు. 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ జీవనాడి వంటి పోలవరంపై ప్రత్యేక  దృష్టి పెట్టి పనులను పరుగులెత్తించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రతి సోమవారం ఆయన పోలవారంగా మార్చుకుని ప్రాజెక్టు సందర్శన చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ పోలవరం పనులను నిలిపివేసింది. జగన్ హయంలో పోలవరం పడకేసింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం పోలవరం పరుగులు తీస్తున్నది. నిర్దుష్ట కాలపరిమితిలో పోలవరం పూర్తే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది. అధికార పగ్గాలు అందుకున్న తరువాత చంద్రబాబు పోలవరం సందర్శించడం ఇది మూడో సారి. దీనిని బట్టే ఆయన పోలవరం పూర్తికి ఇస్తున్న ప్రాధాన్యత అవగతమౌతుంది. 
సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన.. పరిహారం, పునరావాసంపై కీలక ప్రకటన?! Publish Date: Mar 27, 2025 11:17AM

హైకోర్టులో మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్వల్ప ఊరట కలిగించింది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిపై ఏప్రిల్ 3వ తేదీ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని సీఐడీకి ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ ససింది.  ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.  మద్యం కుంభకోణం కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచార జరిగిన సంగతి తెలిసిందే.   కోట్లాది రూపాయల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి ప్రమేయం ఉందని ఈ కేసు ఏపీ సీఐడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మిథున్ రెడ్డి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఈ కేసులో తుది తీర్పు వెలుువడే వరకూ అంటే ఏప్రిల్ 3 వరకూ ఎంపీ మిథున్ నెడ్డిపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దనీ, అరెస్టు చేయవద్దనీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  కాగా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అంశాన్ని తెలుగుదేశం ఎంపీ లావు కృష్ణదేవరాయులు లోక్ సభలో లేవనెత్తారు. ఏపీ మద్యం కుంభకోణంలో పోలస్తే డిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నదన్న ఆయన ఈ విషయంలో మనీ ల్యాండరింగ్ కూడా జరిగిందని ఆరోపిస్తూ ఈడీ దర్యాప్తునకు  డిమాండ్ చేశారు.   దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిధున్ రెడ్డిని పార్లమెంటు ఆవరణలోని తన కార్యాలయానికి పిలిపించుకుని మరీ ఈ కుంభకోణంపై ఆరా తీశారు. హోంమంత్రితో భేటీ అనంతరం హుటాహుటిన అమరావతికి వచ్చిన ఎంపీ కృష్ణ దేవరాయులు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు.  ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ మద్యం కుంబకోణం కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  
హైకోర్టులో మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట Publish Date: Mar 27, 2025 10:29AM

కార్ల దిగుమతిపై పాతిక శాతం సుంకం పెంపు.. ట్రంప్ మరో సంచలనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అమెరికా ఫస్ట్ అంటూ వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో ప్రపంచ దేశాలకు షాక్ లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా విదేశీ కార్ల దిగుమతిపై పాతిక శాతం సుంకం పెంచుతే నిర్ణయం తీసుకున్నరు. అమెరికాలో తయారు కాని అన్ని కార్లపై ఈ పాతిక శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు. జఅయితే అమెరికాలో తయారైన కార్లపై మాత్రం ఎటువంటి సుంకం ఉండదు.  ఈ కొత్త దిగుమతి సుంకం ఏప్రిల్ 3 నుంచి అమలులోకి రానుంది.  దేశీయ పరిశ్రమను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు.  అయితే ఈ తాజా సుంకం నిర్ణయం కారణంగా ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా, ఆటో మేకర్ సరఫరా చైన్ ను దెబ్బతీస్తుందని ఆటోమొబైల్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ప్రపంచ వాణిజ్య సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు.  
కార్ల దిగుమతిపై పాతిక శాతం సుంకం పెంపు.. ట్రంప్ మరో  సంచలనం Publish Date: Mar 27, 2025 10:11AM