కాకినాడలోనూ "ఫ్యాన్" క్రష్..!

మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షంగా వ్యవహరిస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి. దెబ్బ మీద దెబ్బ అది కూడా ఒకదాని వెంట ఒకటి తగులుతూ ఉండటంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను నిరాశ అవహిస్తోంది. గుండెను ఎంత నిబ్బరంగా ఉంచుకుందామన్నా వారికి సాధ్యం కావడం లేదు. అంచనాలను, సర్వేలను తలక్రిందులు చేస్తూ తెలుగుదేశం పార్టీ నంద్యాలలో ఘన విజయం సాధించింది. సమీకరణాలన్నీ అనుకూలంగా ఉన్న చోట ఓటమి వెక్కిరించడంతో వైసీపీ ఖంగుతింది.

 

ఆ షాక్ నుంచి బయటపడదాం అనుకుంటున్న సమయంలో కాకినాడ నగరపాలక సంస్థకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు తీర్పునివ్వడంతో వైసీపీ ఎన్నికలకు సిద్ధమైంది. కానీ లోలోపల ఏదో భయం.. అక్కడ ఏ ఫలితం వస్తుందోనని..చివరకు కార్యకర్తలు భయపడినంత పని జరిగింది. కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్‌ను తెలుగుదేశం పార్టీ తన్నుకుపోయింది. అధికార పార్టీ అక్కడ గెలుస్తుందని ముందే ఊహించారు. అయితే టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒకసారి మాత్రమే కాకినాడలో గెలిచింది. 1985లో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు తెలుగుదేశం ఛైర్మన్ ‌పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తూ వచ్చింది.

 

రాష్ట్ర విభజన తర్వాత హస్తం నామరూపాలు లేకుండా పోయింది. అప్పటిదాకా కాకినాడ పెత్తనం చలాయిస్తూ వచ్చిన నాయకుల్లో చాలామంది వైసీపీ, టీడీపీల్లోకి వెళ్లిపోయారు. కాబట్టి ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా హోరా హోరీ పోరు ఖాయమని విశ్లేషకులు భావించారు. అందుకు తగ్గట్టుగానే ప్రచారంలో ఇరు పార్టీలు దుమ్మురేపాయి. తీరా కౌంటింగ్ దగ్గరికి వచ్చే సరికి ఏకపక్షంగా మారిపోయింది. కౌంటింగ్ ప్రారంభమైన నాటి నుంచి సైకిల్ స్పష్టమైన మెజారిటీతో దూసుకెళ్లి మేయర్ పీఠాన్ని ఎగరేసుకుపోయింది. ఇలా వరుసగా తమను పరాభవాలు వెక్కిరిస్తుండటంతో వైసీపీ దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది.