పిల్ల సజ్జలపై లుక్ ఔట్ నోటీసు

వైసీపీ సోషల్ మీడియా వింగ్ మాజీ ఇన్ చార్జ్  సజ్జల భార్గవ రెడ్డిపై కడప జిల్లా పోలీసులు లుక్  ఔట్ నోటీసులు జారీ చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి. జగన్ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా నడిచిపోయింది.  జగన్ అధికారంలో ఉన్నంత కాలం సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన  ముఖంలా, గొంతులా వ్యవహరించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్ సీఎంగా ఉన్న సమయంలో సజ్జల డిఫాక్టో సీఎంగా పెత్తనం చెలాయించారు.  ఆ పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని ఉపయోగించుకునే సజ్జల  వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను తన పుత్రరత్నం, పిల్ల సజ్జల అదేనండి సజ్జల భార్గవరెడ్డికి అప్పగించారు.  దీంతో సజ్జల భార్గవరెడ్డి పేనుకు పెత్తనం ఇస్తే.. అన్న సామెత చందంగా సోషల్ మీడియా చేతిలో పెట్టుకుని ఇష్టారీతిగా చెలరేగిపోయారు. సజ్జల భార్గవ రెడ్డి హయాంలో వైసీపీ సోషల్ మీడియా వెర్రిపుంతలు తొక్కింది. అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోయింది. సరే జగన్ సర్కార్ పతనమైన తరువాత సజ్జల భార్గవ రెడ్డి అయిపు లేకుండా పోయారు.  సోషల్ మీడియాలో అసభ్య, అనుచిత పోస్టులు పెట్టిన వారిపై  ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు తాజాగా  వైసీపీ సోషల్‌ మీడియా మాజీ ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ సమీప బంధువు అర్జున్‌ రెడ్డి సహా మరికొందరిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ఈనెల 8న పులివెందులలో వర్రా రవీందర్‌రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే.     
Publish Date: Nov 12, 2024 5:08PM

మాజీ మంత్రి కెటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం? 

మాజీ మంత్రి   కెటీఆర్ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వహాయంలో ఫార్ములా ఈ రేస్ కుంభకోణం జరిగిందని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధారాలు సేకరించింది. ఐఎఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం 55  కోట్ల నిధులను కెటీఆర్ ఇచ్చిన ఆదేశం మేరకే  నిర్వహణ సంస్థకు బదిలీ చేసి నట్లు  చెప్పారు.   అవినీతి నిరోధక చట్టం 17 ఏ క్రింద కెటిఆర్ ను అరెస్ట్ చేయనుందని తెలుస్తోంది. గతంతో ఎపిలో ఇదే చట్టం క్రింద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసింది. నిధుల దుర్వినియోగం జరిగితే కెటీఆర్ తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయే అవకాశముంది.  ఏడు సంవత్సరాలు చట్ట సభలకు పోటీ చేసే అవకాశం ఉండదు. గవర్నర్ అనుమతి తీసుకుని ప్రజా ప్రతినిధిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇదే యాక్ట్ క్రింద అరెస్ట్ చేస్తే మూడు నెలల వరకు బెయిల్ రాకపోవచ్చు. తన ఆదేశం మేరకే అరవింద్ నిధులు బదిలీ చేశారని కెటీఆర్ సైతం అంగీకరించడంతో అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది. మంత్రి పొంగులేటి గత నెలలో సియోల్ పర్యటనలో ఉన్నప్పుడే కెటీఆర్ అరెస్ట్ కావచ్చు అని సూచనాప్రాయంగా తెలిపారు. దీపావళి తర్వాత పొలిటికల్ బాంబు పేలనున్నట్లు తెలిపారు. కెటీఆర్ అరెస్ట్ తో అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో హైదరాబాద్ లో 144 సెక్షన్ విధించింది.  నిధుల దుర్వినియోగం కేసులో ఎసిబి ఫైల్ సిద్దం చేసింది.  ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ ప్రతిష్ట పెరిగిందని బిఆర్ఎస్ అంటోంది. కెటీఆర్ బావమరిదికి లాభం చేకూరేలా ఫార్ములా ఈ రేస్ నిర్వహించారని కాంగ్రెస్ ఆరోపించింది. 
Publish Date: Nov 12, 2024 4:30PM

జగన్ కు ‘మహా ’డేంజర్ బెల్స్

ఎంకి పెల్లి సుబ్బి చావుకోచ్చిందంటారు. అలా తయారైంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి. అసలే రాష్ట్రంలో ఘోర పరాజయంతో ఇటు జనానికీ, అటు అసెంబ్లీకి ముఖం చూపించలేక ప్రెస్ మీట్లతో నెట్టుకొచ్చేస్తున్న జగన్ కు మహారాష్ట్ర ఎన్నికలు మహా డెంజర్ గా పరిణమించాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం బీజేపీకి అత్యంత అవసరం, కీలకం కూడా. అయితే ఈ ఎన్నికలలో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత మహారాష్ట్రలో సంభవించిన రాజకీయ పరిణామాలు బీజేపీ పట్ల ప్రజలలో వ్యతిరేకత ఏర్పడటానికి కారణమయ్యాయంటున్నారు. మహాలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ ఆ రాష్ట్రంలోని రెండు అత్యంత కీలకమైన బలమైన ప్రాంతీయ పార్టీలను చీల్చింది. బీజేపీ పుణ్యమా అని రాష్ట్రంలో బలమైన శివసేన రెండుగా చీలి బలహీన పడింది. అలాగే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్డీయే కూడా నిట్ల నిలువుగా చీలి రెండు ముక్కలైంది. ఈ రెండు చీలిక వర్గాలూ కూడా బీజేపీ పంచన చేరి ప్రభుత్వంలో భాగస్వాములయ్యాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కూటమి విజయం సాధించలేకపోతే.. శివసేన, ఎన్సీపీ చీలిక వర్గాలకు బీజేపీతో కలిసి ఉండాల్సిన అవసరం ఉండదు. అంతే కాదు ఆ రెండు చీలిక వర్గాలకూ కలిపి లోక్ సభలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వారు ఎన్డీయేలో కొనసాగుతారా లేదా అన్న విషయం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కూటమి విజయంపై ఆధారపడి ఉంటుంది. అదే ఇప్పుడు జగన్ కు డేంజర్ బెల్స్ మోగిస్తోంది.  ఫర్ సపోజ్ మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించలేకపోతే  కేంద్రంలో ఎన్డీయే సర్కార్ చిక్కుల్లో పడుతుంది. ఎందుకంటే లోక్‌సభలో సింపుల్ మెజారిటీకి  272 స్థానాలు అవసరం కాగా, బీజేపీకి 240 సీట్లు మాత్రమే ఉన్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలుగుదేశం, జేడీయూల మద్దతుపైనే పూర్తిగా ఆధారపడి ఉంది. మొత్తం మిత్రపక్షాలతో కలిసి లోక్ సభలో ఎన్డీయే బలం 293. ఒక వేళ మహా ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలైతే  శివసేన, ఎన్సీపీ ఎంపీలు ఏడుగురినీ ఎన్డీయే సభ్యులుగా భాజించలేం. అంటే ఏడుగురు సభ్యుల మద్దతును బీజేపీ కోల్పోతుంది. అంటే లోక్ సభలో ఎన్డీయే బలం 286కు పడిపోతుంది. అంటే కేంద్రంలో బీజేపీ మరింత బలహీనపడుతుంది. ఈ పరిస్థితిని తెలుగుదేశం నిస్సందేహంగా అవకాశంగా తీసుకుని జగన్ కేసుల సత్వర విచారణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తుంది. అంటే ఫలితాల తరువాత జగన్ కేసుల విచారణ వేగం పుంజుకుంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా రఘురామకృష్ణం రాజు బెయిలు రద్దు పిటిషన్ లో సీబీఐ జగన్ బెయిలు రద్దు చేయాలంటూ కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికలు జగన్ కు మహా డేంజర్ గా మారాయని రాజకీయవర్గాలలో టాక్ నడుస్తోంది.  
Publish Date: Nov 12, 2024 4:10PM

వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులో 55 మంది అరెస్ట్  

 వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామసభ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.  .  గ్రామసభ నిర్వహించేందుకు వచ్చిన అధికారులపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడిన 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు.  ఎలాంటి అల్లర్లు జరగకుండా లగచర్లలో భారీగా పోలీసులు మోహరించారు.ముఖ్యమంత్రి స్వంత జిల్లాలో ఏకంగా కలెక్టర్ పై దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బిఆర్ ఎస్ ప్రోద్బలంతోనే దాడి జరిగిందని ప్రభుత్వానికి నివేదిక అందినట్లు తెలుస్తోంది. ఫార్మా కంపెనీకి భూ సేకరణ చేపట్టాలని నిర్ణయించి గ్రామస్థుల చేత అభిప్రాయ సేకరణ చేపడుతుండగా దాడి జరిగింది.   
Publish Date: Nov 12, 2024 2:57PM

జగన్ బెయిలు రద్దు.. సీబీఐ స్టాండ్ మారిందా?

జగన్ బెయిలు రద్దు పిటిష్ విషయంలో సీబీఐ తన స్టాండ్ మార్చుకుంటుందా? అలా మార్చుకుంటే జగన్ జైలుకు వెళ్లక తప్పదా అంటే పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్ బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఆ రోజు విచారణ జరిగింది. రఘురామకృష్ణం రాజు సుప్రీంలో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి జగన్ బెయిలు రద్దు చేయాలన్నది కాగా, రెండోది జగన్ అక్రమాస్తుల కేసు విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలని. ఈ కేసుల విచారణ నుంచి జస్టిస్ సంజీవ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అంటూ వైదొలిగారు. దీంతో కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసు మరో బెంచ్ ముందు డిసెంబర్ 2న విచారణకు రానుంది.  అయితే ఆసక్తికర పరిణామమేంటంటే.. సీబీఐ తరఫున ఈ కేసులో వాదనలు వినిపించాల్సిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెయిలు రద్దు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం అడిగారు. అలా అడగడమే సీబీఐ జగన్ బెయిలు రద్దు విషయంలో ఇంత వరకూ మెయిన్ టైన్ చేస్తూ వస్తున్న స్టాండ్ ను మార్చుకుంటుందా అన్న అనుమానాలకు తావిస్తోంది.  ఎందుకంటే జగన్ సీఎంగా ఉన్నంత కాలం ఆయన బెయిలు విషయంలో సీబీఐ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.   అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. జగన్ సీఎం కాదు. కేవలం పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే మాత్రమే. దీంతో ఇప్పటి వరకూ జగన్ బెయిలు విషయంలో అభ్యంతరాలు చెప్పని సీబీఐ ఇప్పుడు వైఖరి మార్చుకుని ఆయన బెయిలు రద్దు కోరే అవకాశం ఉంది. అలా కాకపోతే కనీసం కేసు రోజువారీ విచారణ కోరే అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఏది జరిగినా జగన్ ఇబ్బందుల్లో పడక తప్పదు.   గతంలో జగన్ బెయిలు విషయంలో సీబీఐ ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన దేశం విడిచి పారిపోరన్న గ్యారంటీ , బెయిలు షరతులు ఉల్లంఘించరన్న నమ్మకం ఉండేది. అయితే జగన్ ఇప్పుడు అధికారంలో లేరు. అందుకే మారిన పరిస్థితుల్లో సీబీఐ కూడా తన స్టాన్స్ మార్చుకునే అవకాశం ఉంది. అందుకే జగన్ కు ఇబ్బందులు తప్పవన్న భావన న్యాయవర్గాలలో ఎదురౌతోంది. జగన్ బెయిలు రద్దైనా, కేసుల విచారణను రోజువారీ చేపట్టాలని నిర్ణయించినా జగన్ జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడినట్లేనని పరిశీలకులు అంటున్నారు.  
Publish Date: Nov 12, 2024 2:26PM

బీఆర్ఎస్ బీజేపీ జుగల్ బందీ.. కాంగ్రెస్ ఆరోపణలు నిజమేనా?

ఇప్పుడనేమిటి? గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ కూడా బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఏదో రహస్య బంధం ఉందన్న ఆరోపణలు, అనుమానాలూ వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అసలు ఆ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీలు పరాజయం పాలై, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తెరవెనుక ఈ రెండు పార్టీల సంబంధాలే కారణమని కూడా అంటారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా నిలువరించడానికే.. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని జనం భావించేలా రెండు పార్టీలూ బయటకు విమర్శల యుద్ధం చేసుకుని అంతర్గతంగా మాత్రం పరస్పర సహకారం అందించుకున్నారని కాంగ్రెస్ అప్పట్లో విమర్శించిన సంగతి తెలిసిందే. నిజానిజాల సంగతి పక్కన పెడితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రాపంకం కోసం పాకులాడుతోందని కాంగ్రెస్ తాజాగా విమర్శలు గుప్పిస్తోంది. అందుకే అయిపోయిన పెళ్లికి బాజాలు అన్నట్లుగా ఎప్పుడో రెండు నెలల కిందటే బీఆర్ఎస్ విమర్శలు గుప్పించి, ఆందోళనలు చేసి.. వాటిలో పస లేదని గ్రహించి వదిలేసిన అమృత్ పథకంపై ఆరోపణలకు మళ్లీ దుమ్ము దులిపి కేంద్రానికి ఫిర్యాదు చేసిందని కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది. ఫిర్యాదు మిషతో హస్తిన వెళ్లి అక్కడ కేంద్ర పెద్దలను మంచి చేసుకుని ఫార్ములా ఇ రేస్ కేసు నుంచి బయటపడాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది. అమృత్ టెండర్లపై కేటీఆర్ గతంలోనే ఆరోపనలు గుప్పించారు. విచారణ జరిపించాలని బీజేపీకి సవాల్ విసిరారు. ఏ ప్రయోజనం లేక ఆ అంశాన్ని మూలన పడేశారు. ఇప్పుడు హఠాత్తుగా కేటీఆర్ నాడు చేసిన ఆరోపణలను మళ్లీ ఫిర్యాదు రూపంలో చేస్తాను అప్పాయింట్ మెంట్ ఇవ్వండి అని అడిగీ అడగకుండానే కేంద్ర మంత్రి అప్పాయింట్ మెంట్ ఇచ్చేశారు. వచ్చి ఫిర్యాదు చేసుకోండి అంటూ రెడ్ కార్పెట్ పరిచారు. దీంతో కేంద్ర మంత్రితో భేటీ అయి ఫిర్యాదు చేసిన కేటీఆర్ హస్తినలోనే మీడియా సమావేశం పెట్టారు. సహజంగానే కాంగ్రెస్ పార్టీపైనా, రేవంత్ సర్కార్ పైనా విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ హైకమాండ్ కు తెలంగాణ రాష్ట్రం ఏటీఎమ్ గా మారిందని ప్రధాని మోడీ ఆరోపణలనే వల్లె వెశారు.  కేటీఆర్ ఆరోపణలపై కాంగ్రెస్ కూడా దీటుగానే స్పందించింది. కేటీఆర్ హస్తిన వెళ్లి ఫిర్యాదు చేయడం అన్నది బీజేపీ ప్లాన్ ప్రకారమే జరిగిందని ఎదురుదాడికి దిగింది. మహా రాష్ట్ర ఎన్నికలలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బీజేపీ.. కాంగ్రెస్ పై ఆరోపణలు గుప్పించినా ఫలితం లేకపోవడంతో బీఆర్ఎస్ ను ఆశ్రయించిందని అంటున్నారు. మహా ఎన్నికలలో తమకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ పార్టీ హైకమాండ్ కనుసన్నలలో నడుస్తాయనీ, రాష్ట్ర ప్రయోజనాల కంటే హైకమాండ్ పెద్దల మొప్పు కోసమే పని చేస్తాయనేలా విమర్శలు గుప్పిస్తే మహారాష్ట్రలో కాంగ్రెస్ కు ప్రస్తుతం కనిపిస్తున్న పాజిటివ్ వైబ్ తగ్గుతుందని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అందుకే కేటీఆర్ ను హస్తినకు రప్పించుకుని మరీ అమృత్ టెండర్లపై ఫిర్యాదు స్వీకరించిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. క్విడ్ ప్రోకో చందంగా కేటీఆర్ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తే, ఆరోపణలు గుప్పిస్తే ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి ఆయనను బయటపడేస్తామని బీజేపీ పెద్దలు బేరాలాడుతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కేసీఆర్ ను విచారించడానికి అనుమతి ఇవ్వడంలో జాప్యం చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతోంది.  మొత్తం మీద బీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య స్నేహంపై అనుమానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. 
Publish Date: Nov 12, 2024 2:03PM