'కల్కి 2' రేసులో ఎన్టీఆర్, మహేష్ బాబు..!

ఒకప్పుడు తెలుగులో పౌరాణిక చిత్రాలు ఎన్నో వచ్చేవి. కానీ ఇప్పుడు వాటి ఊసే లేదు. అయితే తాజాగా విడుదలైన 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) సినిమాతో మరోసారి పౌరాణిక చిత్రాల గురించి చర్చ మొదలైంది. ఎందుకంటే 'కల్కి' అనేది మహాభారతంలోని పాత్రల ఆధారంగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. ఇందులో అశ్వత్థామ, అర్జునుడు, కర్ణ, కృష్ణుడు వంటి పాత్రలు చూపించారు. అయితే వీటిలో ప్రధానంగా కృష్ణుడి పాత్ర గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.

తెలుగు ప్రేక్షకులకు శ్రీ కృష్ణుడు అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు నందమూరి తారక రామారావు (NTR). అంతలా కృష్ణుడి పాత్రకి ప్రాణం పోశారు ఎన్టీఆర్. ఆ పాత్రలో వేరొకరిని ఊహించుకోవడం తెలుగు ప్రేక్షకులకు కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకే 'కల్కి'లో టెక్నాలజీని ఉపయోగించి కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ ని చూపించాలని మొదట మూవీ టీం భావించిందట. కానీ ఎందుకనో ఆ ఆలోచనను పక్కన పెట్టి.. కృష్ణకుమార్ అనే నటుడి చేత కృష్ణుడి పాత్ర చూపించారు. కానీ సినిమాలో అతని ఫేస్ ని మాత్రం రివీల్ చేయలేదు. దీంతో కృష్ణుడి పాత్రలో ఫలానా ప్రముఖ హీరోని చూపించి ఉంటే బాగుండేది అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) లేదా మహేష్ బాబు (Mahesh Babu) ఆ పాత్రకి సరిపోతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పౌరాణికాలకు నందమూరి కుటుంబం పెట్టింది పేరు. పైగా దర్శకధీరుడు రాజమౌళి సైతం తన డ్రీం ప్రాజెక్ట్ అయిన 'మహాభారతం' చేస్తే కృష్ణుడిగా తారక్ ని తీసుకుంటానని ఓ సందర్భంలో చెప్పాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తుచేస్తూ.. 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్, కృష్ణుడిగా తారక్ ని చూపించి ఉంటే బాగుండేదని అంటున్నారు. అయిపోయిందేమో అయిపొయింది.. కనీసం 'కల్కి 2' లోనైనా కృష్ణుడి పాత్ర జూనియర్ ఎన్టీఆర్ తో చేయించమని కోరుతున్నారు. తారక్ అయితేనే పౌరాణిక పాత్రలకు పూర్తి న్యాయం చేయగలడని, ఉచ్ఛారణ కూడా అద్భుతంగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు.

ఇక మహేష్ బాబు అభిమానులు కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ ఎంతో అందంగా ఉంటాడని.. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలకు సరిగ్గా సరిపోతాడని అంటున్నారు. 'కల్కి 2' లో కృష్ణుడి పాత్రలో మహేష్ ని చూపిస్తే చూడటానికి రెండు కళ్ళు సరిపోవని చెబుతున్నారు. 

తెలుగు సినీ అభిమానులు సైతం తారక్ లేదా మహేష్ లలో ఒకరి చేత కృష్ణుడి పాత్ర చేయిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి దర్శకుడు నాగ్ అశ్విన్ మనసులో ఏముందో? 'కల్కి 2' కోసం ఏయే నటులను రంగంలోకి దింపుతాడో చూడాలి.